Kasisadi Tailam


కాసీసాదితైలాంతో అర్శమొలలు హతం...

అర్శమొలలను తగ్గించడంలో 'కాసీసాది తైలం' ఒక సమర్థవంతమైన భూమికను నిర్వహిస్తుంది. కాసీసం వంటి ఔషధ ద్రవ్యాల ఆధారంగా తయారు చేయడం వల్ల దీనికి ఈ పేరు స్థిరపడింది. కాసీసం, ఐరన్ సల్ఫేట్ అనే ఒక ఖనిజ ద్రవ్యం. దీనితో పాటే 'హరితాలకం' అనే మరో ఖనిజాన్ని కూడా ఇందులో వాడతారు.


ఈ రెండింటిలోనూ ఔషధ గుణాలతో పాటు కొన్ని విషగుణాలు కూడా ఉంటాయి. వీటికి తోడు లాంగలీ, కరవీర, దంతీ, చిత్రక, స్వర్ణక్షీరీ, స్నుహీ, అర్క అనే తీక్ష్ణమైన మూలికలు అలాగే శొంఠి, చెంగల్వకోష్టు, పిప్పల్లు, పాషాణ భేది, అనే సాధారణ క్షారధర్మం గల మూలికలు సైందవ లవణమూ ఉంటాయి.

వీటన్నిటి మిశ్రమానికి నాలుగు వంతులు నువ్వుల నూనె, ఆ నూనెకు నాలుగువంతులు గోమూత్రం కలిపి ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలం తయారీలో ఉపయోగించిన చాలా వస్తువులు తీక్ష్ణమైనవి. వీటికి కూడా క్షారగుణమూ, విష లక్షణాలూ ఉంటాయి. ఈ గుణాలన్నిటినీ నియంత్రించడంలో తైలం ఒక కీలక పాత్రను పోషిస్తుంది. ఇందులో క్షార విరుద్ధ «ధర్మం ఉండే సైందవ లవణం కూడా తోడ్పడుతుంది.

ఉపయోగాలు

( హెచ్చరిక : తైలం అనగానే చాలా మంది మర్ధన చికిత్స లేదా కడుపులోకి తీసుకోవడానికి ఉద్దేశించినదనే అభిప్రాయానికే వస్తారు. కానీ కాసీసాది తైలం విషయంలో ఆ అభిప్రాయం ఏమాత్రం సరికాదు. అంటే ఈ తైలాన్ని మర్ధనకు గానీ తాగడానికి గానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు.)

  • ఈ తైలం వల్ల కలిగే ఏకైక ప్రయోజనం అర్శమొలలను (పైల్స్/హెమరాయిడ్స్)ను శస్త్ర చికిత్స లేకుండా తగ్గించడం. కొన్ని సార్లు దీర్ఘకాలికంగా వేధిస్తున్న వ్రణాలు (క్రానిక్ వూండ్స్), ఫిషర్, ఫిస్టులా చికిత్స కోసం కూడా వైద్య నిపుణుల పర్యవేక్షణలో వినియోగించవచ్చు.

  • అర్శమొలలను తగ్గించడానికి లేదా నిర్మూలించడానికి నాలుగు పద్ధతులు ఉంటాయి. వాటిలో 1. మందులు వేసుకోవడం, 2. మొలలపై క్షౌర ఔషధాలను పూయడం, 3.అగ్ని కర్మ ప్రయోగించడం (కాటరైజేషన్), 4. శస్త్రంతో కోసి కుట్లు వేయడం. అర్శమొలల తీవ్రతను బట్టి వైద్యుడు వీటిలో ఏదో ఒకటి ప్రయోగిస్తూ ఉంటాడు. అంటే మొదటి దానినుంచి ఒకదానితో తగ్గనప్పుడు తర్వాత పద్ధతిని అనుసరిస్తారు.


  •  కాసీసాది తైలానికి మౌలికంగా క్షారధర్మం అంటే తినేసే తత్వం ఉంటుంది. అందులో భాగంగా వినియోగంలో లేఖనం(గీకడం), క్షరణం (క్షీణింపచేయడం), క్షపణం(మాన్పడం) అనే మూడు గుణాలు ఉంటాయి. ఈ గుణాల కారణంగా అర్శమొలల్లోని వాపు సూక్ష్మంగా కోతకు (అబ్రేషన్)కు గురవుతుంది. ఆతరువాత 'బర్ర (స్కార్)' రూపంలో వ్రణవస్తు (ఫైబ్రస్ టిష్యూ) ఏర్పడుతుంది. ఫలితంగా వాచిన మొలలు సంకోచం పొంది క్రమేపీ కుంచించుకుపోతాయి. అలా అర్శమొలలు పూర్తిగా కరిగిపోతాయి.
  •  ఒత్తిడి కారణంగా విసర్జన భాగం వ్యాకోచం చెందడం వల్ల అర్శమొలల సమస్య వస్తూ ఉంటుంది. మలబద్ధకం, లివర్ వ్యాధులు, గర్భధారణ వంటి పొట్ట మీద ఒత్తిడిని పెంచే సమస్యలే ఈ వ్యాకోచానికి కారణంగా ఉంటాయి. అలా వ్యాకోచం చెందిన భాగాన్ని తిరిగి సంకోచింప చేయడమే కాసీసాది తైలం ప్రత్యేకత. తైల వినియోగం తరువాత వ్యాకోచించని ఇతర రక్తనాళాల చుట్టూ ఫైబ్రస్ కణజాలం ఒక కుషన్ లా ఏర్పడుతుంది. దీని వల్ల చికిత్స తరువాత సమస్య మళ్లీ తిరగబెట్టే పరిస్థితి ఉండదు.

  • సమస్య బాగా విషమించి సంకోచ ధర్మం కోల్పోయిన స్థితి (4వ దశ హెమరాయిడ్స్)లో మాత్రం క్షారసూత్రం ద్వారా గానీ శస్త్రంతో గానీ ఛేదించవలసి ఉంటుంది. ఆ దశ కన్నా ముందున్న మూడు దశల్లోనూ కాసీసాది తైలం వినియోగంతో ప్రయోజనం ఉంటుంది. ఈ తైలాన్ని పూతపూసి డ్రెస్సింగ్ చేయడం ద్వారా సమస్య తగ్గుముఖం పడుతుంది.


  • బయటికి కనిపించకుండా ఉండే మొలలైతే మల విసర్జన భాగంలోకి నాజిల్ లేదా ట్యూబ్ ఉన్న సిరంజితో 5 నుంచి 10 మి. లీటర్ల పరిమాణంలో ఎక్కించవలసి ఉంటుంది. ఇది వైద్యుని పర్యవేక్షణలోనే జరగాలి.

  • సమస్య తీవ్రతను బట్టి ఈ చికిత్సను 4 నుంచి 8 వారాల పాటు తీసుకుంటే అర్శమొలలు పూర్తిగా తగ్గిపోతాయి. అయితే ఈ చికిత్సతో పాటు కొందరికి అవసరాన్ని బట్టి కొన్ని మాత్రలు కూడా వేసుకోవలసి రావచ్చు.
Share on Google Plus