క్షయ(టీబీ ) వ్యాధి లక్షణాలు - నిర్ధారణ పరీక్షలు - చికిత్స

టీబీ అని సంక్షిప్తంగా పిలిచే ఈ వ్యాధికి ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియా కారణం. ఈ సూక్ష్మజీవి ప్రతివారి శరీరంలోనూ ఉంటుంది. అయితే వ్యాధి నిరోధకశక్తి తగ్గినవారిలో మాత్రం వ్యాధి రూపంలో బయట పడుతుంది. ఈ వ్యాధి రెండు రకాలుగా కనిపిస్తుంది.

టీబీలో రకాలు

పల్మొనరీ టీబీ: వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఊపిరితిత్తులను నివాసం చేసుకుని ఈ వ్యాధి బయటపడితే దాన్ని పల్మొనరీ ట్యూబర్క్యులోసిస్ అంటారు. 


ఎక్స్‌ట్రా పల్మొనరీ టీబీ : ఊపిరితిత్తుల్లో కాకుండా శరీరంలోని వేరే భాగాల్లో వస్తే దాన్ని ఎక్స్‌ట్రా పల్మొనరీ ట్యూబర్క్యులోసిస్ అంటారు. లింఫొనాయిడ్స్ టీబీ, ఊపిరితిత్తుల బయటి పొరలో నీరు చేరడం, సంతానం లేని మహిళల్లో గర్భాశయంలో టీబీ అన్నవి ఎక్స్‌ట్రా పల్మొనరీ టీబీల్లోని ప్రధాన రకాలు. ఇవేగాక... వెన్నెముక (స్పైన్), ఎముక (బోన్), మెదడు భాగాలకు కూడా టీబీ వస్తుంది.

గతంలో దాదాపు 95శాతం కేసుల్లో పల్మొనరీ టీబీయే ప్రధానంగా కనిపించేది. ఎక్స్‌ట్రా పల్మొనరీ కేసులు కేవలం 5 శాతం మాత్రమే కనిపించేవి. అయితే ఇప్పుడు రకరకాల వైద్యపరీక్షలు అందుబాటులోకి రావడంతో దాదాపు 40 శాతం మందిలో ఈ ఎక్స్‌ట్రా పల్మొనరీ కేసులు కనిపిస్తున్నాయి.

వ్యాప్తి ఇలా
ఊపిరితిత్తులకు వచ్చే పల్మొనరీ టీబీ మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు వంటి కారణాలతో ఈ సూక్ష్మజీవి గాలిలోకి చేరి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఎక్స్‌ట్రా పల్మొనరీ రోగుల నుంచి ఇతరులకు సంక్రమించదు.  వ్యాధి నిరోధకశక్తి తగ్గడం వల్ల సూక్ష్మజీవి బలపడి ఈ వ్యాధి బయటపడుతుంది. హెచ్‌ఐవి, డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధినిరోధకశక్తి తగ్గడం వల్ల ఇది బయటపడుతుంది. ఇదీగాక ఇటీవల మారిన జీవనశైలిలో ఒత్తిడి, నిద్రలేమి, పనిభారం, కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం పెరిగినందు వల్ల ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

లక్షణాలు

టీబీ బ్యాక్టీరియా మన శరీరంలో నివాసం ఉండే స్థానాన్ని బట్టి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అది ఊపిరితిత్తుల్లో ఉంటే (పల్మొనరీ టీబీ అయితే) ఎడతెరిపి లేకుండా దగ్గు రావడం, కళ్లె పడటం, దగ్గినప్పుడు రక్తం పడటం, ఆకలి, బరువు తగ్గడం, నీరసించిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఎక్స్‌ట్రా పల్మొనరీ టీబీల్లో కొన్ని ఇతర లక్షణాలతో పాటు బరువు తగ్గుతుండటం, జ్వరం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి.

నిర్ధారణ పరీక్షలు

సాధారణంగా ఎక్స్-రే, కళ్లె పరీక్షలతో 60% నుంచి 70% కేసుల్లో టీబీని డయాగ్నోజ్ చేయవచ్చు. వీటితో నిర్ధారణ కాకపోతే అప్పుడు టీబీ సెరోలజీ, పీసీఆర్, మాంటో వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇవేగాక అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, బోన్ స్కాన్, బయాప్సీ వంటి పరీక్షలు చేయించాలి.
చికిత్స : ఒకప్పుడు టీబీ అంటే ఏదో పెద్ద జబ్బు అనుకునేవారు. ఇప్పుడు దీన్ని పూర్తిగా తగ్గించడానికి నిర్దిష్టమైన మందులు ఉన్నాయి. ఈ మందులు రెండు రకాలు. 


1) ప్రైమరీ డ్రగ్స్ : స్ట్రెప్టోమైసిన్, రిఫ్యాంపిసిన్, ఐఎన్‌హెచ్, పైరజినమైడ్, ఇథాంబుటాల్ అనే ఐదు మందులను ప్రైమరీ డ్రగ్స్ అంటారు. వీటిని ఆరు నెలల నుంచి ఏడాది పాటు వాడితే టీబీని పూర్తిగా నయం చేయవచ్చు. రోగి బరువును బట్టి మందు మోతాదు నిర్ణయిస్తారు. అయితే ఏదైనా కారణాల వల్ల పూర్తికాలం పాటు మందు వాడకపోయినా, తగిన మోతాదుల్లో తీసుకోకపోయినా వ్యాధి క్రిములు మందులకు లొంగకుండా మొండిగా తయారవుతాయి. ఒక్కోసారి డాక్టర్ పర్యవేక్షణ లేకుండా టీబీ మందులను కొనుగోలు చేసి ఇష్టానుసారం వాడటం వల్ల కూడా వ్యాధి లొంగకుండా ముదరవచ్చు. అలా ముదిరిన ఆ వ్యాధిని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ (ఎండీఆర్) టీబీగా వ్యవహరిస్తారు.

2) సెకండ్ లైన్ డ్రగ్స్ : మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ (ఎండీఆర్)టీబీ ఉన్నవారికి ఇచ్చే మందులను రిజర్వ్ డ్రగ్స్ లేదా సెకండ్ లైన్ మందులుగా పేర్కొంటారు. నిజానికి ఇవి టీబీ మందులు కావు. అనేక రకాల యాంటీబయాటిక్స్‌తో ఈ మందులను రూపొందిస్తారు. ఖరీదు కూడా ఎక్కువే. దుష్ర్పభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఎక్కువే.

డాట్స్ చికిత్స

రివైజ్‌డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఆర్‌ఎన్‌టీీపీసీ) పేరిట ప్రభుత్వం టీబీ రోగులకు చికిత్స అందించే కార్యక్రమంలో ఒక భాగమే డాట్స్. ‘డెరైక్ట్‌లీ అబ్జర్వ్‌డ్ ట్రీట్‌మెంట్ షార్ట్ కోర్స్’ అనే ఈ కార్యక్రమానికి సంక్షిప్త రూపమే ‘డాట్స్’. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వాలంటీర్లు రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా స్వయంగా దగ్గరుండి మందులు తీసుకునేలా చూస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగులను మూడు రకాలుగా విభజించి వారు ఈ మందులు పూర్తి కోర్సు వాడేలా జాగ్రత్త తీసుకుంటారు. దీన్నే డాట్స్ అంటారు. ఇటీవల సెకండ్‌లైన్ మందులను కూడా ఈ కార్యక్రమం కింద ఉచితంగా ఇస్తున్నారు.

గుర్తుంచు కోవాల్సింది...

1. బాల్యంలో ఇచ్చే బీసీజీ వ్యాక్సిన్ టీబీని పూర్తిగా అరికట్టలేదు. అయితే దీని తీవ్రత పెరగకుండా చేయగలదు.
2. టీబీ ఎండీఆర్ దశకు చేరాక మందులు వాడటం కంటే ప్రైమరీ మందులతో తగ్గించుకోవడం తేలిక. అలా నయం చేసుకోవడమే మంచిది.

నివారణ ఇలా...

1. ప్రతివారిలో టీబీ బ్యాక్టీరియా తేలిగ్గా ప్రవేశించి శరీరంలో ఆశ్రయం తీసుకుంటుంది. ఇలా వెళ్లడాన్ని నివారించలేం. అయితే శరీరంలో ఆ వ్యాధి పొడసూపకుండా ఉండాలంటే మన వ్యాధినిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే చేయాల్సింది కూడా చాలా సులువు. క్రమబద్ధమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండేలా చూసుకోవాలి. అంటే...
2. సమయానికి భోజనం చేయడం
3. భోజనంలో సమతుల ఆహారం అంటే... ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే గుడ్లు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు వంటివి తీసుకోవాలి.
4. ఒత్తిళ్లు లేకుండా ఉండాలి.
5. పొగతాగడం పూర్తిగా మానేయాలి.
6. ఆల్కహాల్ అలవాటును పూర్తిగా వదిలేయాలి.
7. వ్యాధిని వీలైనంత ముందుగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలి. సరిగ్గా మందులు వాడటం కూడా ఇతరులకు వ్యాధి రాకుండా నివారించడమే అవుతుంది.
Share on Google Plus