మోకాలి నొప్పికి పరిష్కారం 'హై ప్లెక్స్ సీఆర్' (మోకాలి మార్పిడి చికిత్స )


వయసు పైబడిన వారిలో, కీళ్లవాతంతో బాధపడే వారిలో కనిపించే సాధారణ సమస్య మోకాలి నొప్పి. ఈ సమస్యకు ఇప్పుడు మోకాలి మార్పిడి చికిత్స అందుబాటులో ఉంది. అయితే ముదిమి వయస్సులో శస్త్రచికిత్స చేయించుకుంటే ఫలితం ఉంటుందా? మోకాలి మార్పిడి తరువాత మామూలుగా నడవటం సాధ్యపడుతుందా? ఏ రకమైన ఇంప్లాంట్ నప్పుతుంది? 

వయసు పైబడిన వారిలో మోకాలి నొప్పి సమస్య కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య చాలా ఎక్కువ. కాల్షియం లోపించడం, ఎక్కువ కూర్చుని పనిచేయడం, కీళ్లవాతం తదితర కారణాల వల్ల మోకాలు నొప్పి మొదలవుతుంది. అయితే మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స అందరికీ అవసరం రాకపోవచ్చు. పూర్తిగా కాలు కదల్చలేని స్థితిలో ఉన్న వారికి, ఐదు నిమిషాల పాటు కూడా నడవలేకపోతున్న వారికి ఆపరేషన్ అవసరమవుతుంది. వీరికి కూడా ముందుగా ఫిజియోథెరపీ చేయించి అప్పటికీ పరిస్థితి చక్కబడకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో కంప్యూటర్ సహాయంతో ఆపరేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆపరేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


ఆపరేషన్‌కు ముందు...
మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటే అప్పటి వరకు వాడుతున్న మందుల వివరాలను డాక్టర్‌కు తెలియజేయాలి. ఎందుకంటే కొన్ని మందులు ఆపరేషన్‌కు ముందు మానేయాల్సి ఉంటుంది. మందులు మానేయకుండా ఆపరేషన్ చేస్తే రక్తస్రావం, రక్తం గడ్డకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. «థైరాయిడ్, డయాబెటిస్ ఉంటే వాటిని నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. మూత్రంలో, దంతాలలో ఇన్‌ఫెక్షన్ ఉంటే వాటికి మందులు వాడుకుని ఇన్‌ఫెక్షన్ తగ్గాక ఆపరేషన్ చేయించుకోవాలి. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండే ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవడం కూడా చాలా అవసరం.

ఇంప్లాంట్‌లు
ప్రస్తుతం చాలా రకాల ఇంప్లాంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏది ఎక్కువ కాలం మన్నుతుంది? ఏ ఇంప్లాంట్ ఎవరికి నప్పుతుంది? అనే దానిపై చాలా మందికి సందేహాలు ఉంటాయి.


రొటేటింగ్ ప్లాట్‌ఫామ్:
యుక్తవయసులో ఉన్న వారు, యాభై ఏళ్ల కంటే తక్కువ వయస్సున్నవారు మోకాలి మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి వచ్చినపుడు రొటేటింగ్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఇందులో మధ్యన వాషర్ ఉంటుంది. ఇది అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. దీనివల్ల రాపిడి తక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల కంటే ఎక్కువ మన్నుతుంది. అయితే నిపుణులైన డాక్టర్లచే ఆపరేషన్ చేయించుకుంటేనే ఫలితం ఉంటుంది.

ఏఎస్ నీ :

కొంత మందిలో మెటల్ అలర్జీ, స్కిన్ అలర్జీ ఉంటుంది. అటువంటి వారికి ఇది చాలా ఉపయోగకరం. ఐదు రకాల లోహాలు, సిరామిక్ ఉపయోగించి దీన్ని తయారుచేస్తారు. ఇది చాలా దృఢంగా ఉంటుంది. ఖరీదెక్కువ. అలర్జీ సమస్య తలెత్తదు.

సిరామిక్ నీ(అక్సీనియమ్) :

ఎక్కువ కాలం మన్నుతుంది. కానీ ఖరీదెక్కువ. గత పదేళ్లుగా ఇది వినియోగంలో ఉంది. ఇండియాలో గత ఏడాది నుంచి అక్సీనియమ్ నీ ఉపయోగిస్తున్నారు.


హై ఫ్లెక్స్ సీఆర్ : 
ఎక్కువ మంది ఎంపిక చేసుకునే ఇంప్లాంట్ ఇది. డాక్టర్లు కూడా దీన్నే సూచిస్తుంటారు. ఇందులో బోన్ కటింగ్ తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నుతుంది. యాభై ఏళ్లు పైబడిన వారికిది చాలా ఉపయోగకరం. కింద కూర్చోవాలనుకునే వారికి నప్పే ఇంప్లాంట్.

ఆపరేషన్ సమయంలో...
తొడ ఎముక కింది భాగం, కాలు పైభాగం అరిగిపోవడం, అందులో ఉన్న జిగురు, ఎముక, వాషర్ అరిగిపోవడం వల్ల మోకాలి నొప్పి మొదలవుతుంది. అయితే ఎముక ఎంత మేర అరిగిందో ఆ స్థానంలో మెటల్‌ను అమర్చడం జరుగుతుంది.

రెండు వైపులా మెటల్ వేసిన తరువాత అరిగిన వాషర్ స్థానంలో కొత్త వాషర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎముక తక్కువ కట్ చేస్తాం కాబట్టి రివిజన్ ఆపరేషన్ అవసరమైనా చేసుకునే వీలుంది. కానీ 'నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ'లో రివిజన్ రేటు చాలా తక్కువ. ఆపరేషన్ తరువాత కూడా నొప్పి తగ్గదనేది అపోహ మాత్రమే. ఒకసారి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారు పదిపదిహేనేళ్ల పాటు నడవటం, మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం లాంటి పనులు చేసుకోవచ్చు.



ఆపరేషన్ తరువాత...
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పదిహేను రోజుల తరువాత ఫిజియోథెరపిస్టు అవసరం ఉండదు. కానీ వ్యాయామం ఆపకూడదు. కనీసం ఆరు నెలల పాటు చేయాల్సి ఉంటుంది. కీళ్లవాతం మందులు వాడుతన్నట్లయితే ఆపరేషన్ అనంతరం 20 రోజుల తరువాత మొదలుపెట్టాలి. వీలైనంత వరకు కింద కూర్చోకుండా ఉండాలి. మోకాలు వాయడం, నీరు కారడం, రక్తంకారడం లాంటిది కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top