వడదెబ్బ - లక్షణాలు - జాగ్రత్తలు

ఎండలో ఎటువంటి రక్షణ లేకుండా తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు దీని వల్ల ప్రాణం పోయే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక వ్యవస్థ సహజంగానే మన శరీరంలో ఉంటుంది. ఈ వ్యవస్థ బలహీనపడినపుడు ఉష్ణోగ్రత అదుపుతప్పుతుంది. అయితే అదే పనిగా ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని లేదు. మన నియంత్రణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఇంట్లో కూర్చున్నా వడదెబ్బకు గురికావచ్చు. వడదెబ్బ లక్షణాలు ఇలా ఉంటాయి. శరీరం ఉష్ణోగ్రత విపరీతంగా పెరిపోతుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. 

శరీరం నుంచి చెమట రావడం నిలిచిపోతుంది. నాడి వేగంగా కొట్టుకుంటుంది. శరీరం, మెదడు స్వాధీనంలో ఉండవు. సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. మిగతా అన్ని జబ్బుల్ని నయం చేసుకోవడానికి కొంత వ్యవధైనా ఉంటుంది. కాని వడదెబ్బ విషయంలో ప్రాణాపాయం జరగడమన్నది ఒక్కోసారి కొన్ని క్షణాలు, కొన్ని నిమిషలలో జరిగిపోవచ్చు. చర్మం పొడిబారిపోవడం అన్నది కేవలం చర్మ సంబంధ సమస్య ఏమీ కాదు. శరీరంలో నీటి పరిమాణం పడిపోయిందని చెప్పే ఒక సూచన మాత్రమే. వడదెబ్బ నుంచి కాస్త కోలుకున్నామని అనిపించిన వెంటనే మళ్లీ ఎండలోకి వెళ్లే ప్రయత్నం చేయకూడదు.

ఆ రోజంతా విశ్రాంతి తీసుకుంటే తప్ప శరీర వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి రాదు. ఈ లక్షణాలు కనబడితే వెంటనే వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తరలించాలి. శరీరాన్ని చల్లటి నీటితో లేదా ఐసుతో తుడవాలి. వెంటనే వైద్యుని పర్యవేక్షణలో సెలైన్ ఎక్కించాలి. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్ ధరించాలి. తరచు నీళ్లు తాగుతుండాలి. కళ్లకు యువి కిరణాలు తగలని కూలింగ్ గ్లాసెస్ ధరించాలి. అయితే వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవడం అందరికీ మంచిది. 
Share on Google Plus