కండరాల నొప్పులకు మేలైన వైద్యం- హోమియోలో వాడదగిన మందులు

మన శరీరంలో దీర్ఘకాలంగా వచ్చే కండరాలు, ఎముకల నొప్పులను ఫైబ్రోమయాల్జియా అంటారు. ఈ సమస్య పిల్లలు, పెద్దవాళ్లు ఎవరిలోనైనా రావచ్చు. సాధారణంగా ఈ సమస్య 30 నుండి 55 సంవత్సరాల మధ్యవయస్కులలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధికి హోమియో వైద్యంతో నయం చేయవచ్చు.


మన శరీరంలో కండరాలు సుమారు సగభాగం ఉంటాయి. మన శరీరంలో 650 కండరాలు ఉంటాయి. ఈ కండరాలు ఎముకలకు టెండాన్స్‌తో అతికి ఉంటాయి. నరాల ద్వారా సంకేతం అందినపుడు కండరాలు సడలి మన కదలికలకు తోడ్పడతాయి. కండరాలకు వచ్చే సమస్యలకు చాలా కారణాలు ఉంటాయి. అయితే కండరాల సమస్య మూడు నెలలకు పైబడి ఉండి, శరీరంలో అనేక చోట్ల సమస్య కలిగి ఉండి, స్పర్శకి సున్నితంగా ఉంటే ఆ సమస్యను ఫైబ్రోమయాల్జియా అని నిర్ధారిస్తారు.

కారణాలు ఈ సమస్యకు సరైన కారణం ఇంతవరకు తెలియరాలేదు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. మానసిక ఆందోళన, నరాల నుండి సంకేతాలు సరిగ్గా అందకపోవడం, నరాల చివర్లలో ఉండే న్యూరోట్రాన్స్‌మిటర్స్ లోపం, శారీరక లేదా మానసిక ఆందోళన, ఇతర వ్యాధుల వల్ల వచ్చే అవకాశం, శారీరక గాయాలు, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ వంటి సమస్యల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు నీరసం, అలసట, రోజువారీ పనులు చేసుకోవటం కష్టంగా ఉండటం, భరించలేని నొప్పి, నిద్రలేమి, ఆలోచనా శక్తి తగ్గడం మొదలైన లక్షణాలు ఉంటాయి.



హోమియో చికిత్స ఈ సమస్యకు హోమియోలో వాడదగిన మందులు: 
రస్టాక్స్, రోడోడెండ్రాన్, రూటా, బ్రయోనియా, యూపటోరియం, బెల్లాడోనా, ఆర్నికా, వెరాట్రమ్, వేలరీనా, కాల్కేరియా కార్బ్. రస్టాక్స్: ఇది టుండాన్స్, కండరాలు, ఎముకలు, కీళ్లు మొదలైన వాటిపై మంచి ప్రభావం చూపుతుంది. ఉత్సాహంగా లేకపోవడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం, కుదురుగా ఒకచోట కూర్చుని ఉండలేకపోవడం, భుజాల మధ్య నొప్పి, కీళ్ల వాపు నొప్పి, కండరాల నొప్పి, నడుమునొప్పి, కాళ్లు, చేతులు తిమ్మిరిగా ఉండటం, చేతి వేళ్ల చివర స్పర్శ తగ్గడం మొదలైన లక్షణాలకు ఈ మందు బాగా పనిచేస్తుంది.

రోడోడెండ్రాన్: ఇది వాతరోగం, కీళ్లు, కండరాల సమస్యలకు మంచి మందు. మతి మందగించడం, కీళ్ల వాపు, కాలి బొటన వేలు వాపు, శరీరం నొప్పులతో ఉండడం, మెడ బిగపట్టినట్టు ఉండటం, కాళ్లు ఒకదానిపై మరొకటి పెడితే కాని నిద్రించలేకపోవటం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది.



రూటా: ఇది ఎముకలు, కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే పొర, టెండాన్స్‌పై మంచి ప్రభావం చూపుతుంది. శరీరం మొత్తం నొప్పులు, సున్నితంగా ఉండటం, నీరసం, అలసట, నిరాశ, వెన్నుపూస, చేతులు నొప్పులు, కూర్చుని నిలబడినపుడు నొప్పులు, నడుమునొప్పి, కండరాల బలహీనత, మలబద్ధకం, కంటి శ్రమ తర్వాత వచ్చే తలనొప్పి, వ్రేళ్లు బిగుసుకుపోవటం, సయాటికా వంటి లక్షణాలకు ఇది బాగా పనిచేస్తుంది. బ్రయోనియా: దృఢ శరీర తత్వం కలిగి ఉన్నవారిపై ఈ మందు మంచి ప్రభావం చూపుతుంది.

యూపటోరియమ్: నడుమునొప్పి, చేతులు, కాళ్లు ఎముకల నొప్పి, చర్మం స్పర్శకి సున్నితంగా ఉండటం, మణికట్టు, మోచేయి నొప్పి, ఛాతీ నొప్పి, నోటి అంచులు పగలడం, నాలుక పచ్చగా ఉండటం, దాహం అధికంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారికి ఇది బాగా ఉపశమనం కలిగిస్తుంది. బెల్లాడోనా: చర్మం వాపు, ఎరుపుదనం, వేడి, నొప్పి, నోరు, గొంతు పొడిబారటం, నొప్పులు ఆకస్మికంగా వచ్చి తొందరగా పోవడం, నాడి బలంగా కొట్టుకోవడం, పిల్లల్లో వచ్చే మూర్ఛ మొదలైన సమస్యలకు ఇది మంచి మందు.

ఆర్నికా: గాయాల తర్వాత వచ్చే సమస్యకు ఇది మంచి మందు. వెరాట్రమ్: నీరసం, శరీరం చల్లబడటం, అలసట, చర్మం నీలి రంగులోకి మారడం వంటి లక్షణాలకు ఇది మంచి మందు. వెలేరియానా: కాళ్లు, చేతులు నొప్పులు, బరువుగా ఉండటం, నిరంతరం కదులుతుండటం, నడుమునొప్పి, కూర్చున్నపుడు మడమల నొప్పి, నిద్రలేమి, చెవి నొప్పి, గుండెలో మంట వంటి లక్షణాలకు ఇది బాగా పనిచేస్తుంది.



కాల్కేరియా కార్బ్: అధిక బరువు, స్థూలకాయం కలిగి, చెమటలు అధికంగా పట్టడం వంటి లక్షణాలకు ఇది మంచి మందు. సమస్య ఏదైనా దాని మూలాలలోకి వెళ్లి వ్యాధిని నిర్మూలించడం హోమియో వైద్య విధాన విశిష్టత. హోమియో మందుల ద్వారా తాత్కాలిక ఉపశమన కన్నా వ్యాధికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. హోమియో మందులను సొంత వైద్యంతో కాక హోమియో వైద్య నిపుణుల సూచనల మేరకు వాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top