నెలసరిలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టాలంటే..


నెలసరి ఓ పద్ధతిలో రాకపోవడం, ఆ సమయంలో చిరాకూ, పొత్తికడుపు నొప్పి.. వంటి సమస్యలు చాలామందిలో సహజంగానే కనిపిస్తాయి. వాటికి వైద్యులు మందులు సూచించినా.. ఆహారంపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆ సమస్యలన్నీ అదుపులోకి వస్తాయి.

హార్మోన్లను క్రమబద్ధం చేసే అద్భుతమైన గుణం నువ్వుల్లో ఉంది. నువ్వులను దోరగా వేయించి అందులో కొంచెం బెల్లాన్ని కలిపి ముద్దగా చేసుకుని ప్రతిరోజూ తినాలి. నెలసరి వచ్చేందుకు మూడోవారంలో దీన్ని తీసుకుంటే మంచిది. దీనివల్ల రక్తహీనత సమస్య కూడా ఎదురుకాదు. క్యాల్షియం కూడా సమృద్ధిగా అందుతుంది.

రోజూ ఉదయం కప్పు బొప్పాయి పండు ముక్కలను తినాలి. ఇందులో ఉండే పీచు గర్భాశయం గోడలను ఆరోగ్యంగా మారుస్తుంది. శరీరానికి విటమిన్‌ఎ పోషకం కూడా అందుతుంది.

చిన్న అల్లం ముక్కను నీళ్లలో వేసి అయిదు నుంచి ఏడు నిమిషాలు పొయ్యిమీద ఉంచి దింపేయాలి. తరవాత అందులో కాస్త చక్కెర కలిపి అల్పాహారం, మధ్యాహ్న భోజనం తరువాత తీసుకోవాలి. నెలసరిని క్రమబద్ధం చేసే గుణం అల్లానికి ఉంది. ఆ సమయంలో వచ్చే నొప్పినీ నివారిస్తుంది.

చిటికెడు దాల్చిన చెక్క పొడిని గ్లాసు వేడి పాలల్లో కలిపి రోజూ తాగితే మంచిది.

నెలసరి సమయంలో ఎదురయ్యే రకరకాల సమస్యల్ని అదుపులో ఉంచాలంటే కాఫీ, టీలు తగ్గించాలి. బదులుగా పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. హెర్బల్‌టీలు తాగాలి.గ్లాసు చెరకురసం లేదా ద్రాక్ష తీసుకుంటే మంచిది.

నెలసరి క్రమం తప్పకుండా రావాలంటే వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. దీనివల్ల బరువు అదుపులో ఉండటమే కాదు.. నెలసరి సమస్యలూ తగ్గుతాయి.

Share on Google Plus