వ్యాయామం చేయాలా...వద్దా?


నేడు ఆరోగ్యం మీద చాలా మందికి ఆసక్తి పెరిగింది. అందులో భాగంగా ఆహారం, వ్యాయామాల పట్ల కూడా శ్రద్ధ పెరిగింది. కానీ వీటికి సంబంధించి కొన్ని అపోహలు మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. వాస్తవాలను గమనించలేకపోతే ఈ అపోహల్లో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే శరీరం బరువును నియంత్రించడానికీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికీ కొంత ప్రత్యేక అవగాహన అవసరం అంటున్నారు నిపుణులు.

వ్యాయామం చేస్తే మాత్రం ?

రోజూ వ్యాయామం చేయాలే గానీ ఏ ఆహారం తీసుకున్నా ఒకటే అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. నిజానికి వ్యాయామం చేసేవారు కూడా ఇతరుల్లాగే అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ముఖ్యంగా ఒక ప్రత్యేక లక్ష్యంతో వ్యాయామాలు మొదలె ట్టినప్పుడు మరింత శ్రద్ధగా ఉండడం కూడా ముఖ్యమే. ప్రత్యేకించి శరీర బరువును తగ్గాలనుకునే వారికి వ్యాయామం, పోషక పదార్థాలను గురించిన సమగ్రమైన అవగాహన కావాలి. ఇవేవీ పెద్దగా తెలీకుండానే వ్యాయామం చేసినా ఎంతో కొంత ఫలితం వస్తుంది. కానీ, అది సంపూర్ణంగా ఉండదు.

  •   తీసుకుంటున్న ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, లవణాలు, విటమిన్లు సరియైన పరిమాణంలో ఉంటేనే వ్యాయామంతో సరియైన ఫలితం వస్తుంది.


  •   మూడు పూటలా తీసుకునే భోజనంతో పాటు మధ్యలో ఒకటి రెండు సార్లు అల్పాహారం కూడా చేయాలి. వాటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే జీడిపప్పు, బాదం వంటి ముడిధాన్యాలు ఉంటే మరీ మంచిది. అల్పాహారంలోని క్యాలరీలను అంత ఖచ్చితంగా లెక్కించాల్సిన పనేమీ లేదు. అల్పాహారానికి పిడికిలిని కొలమానంగా ఒక నియమంగా పెట్టుకుంటే సరిపోతుంది.

  • మన శరీరం ఒక యంత్రం. అది నడవడానికి ఇంధనంగా కావలసినన్ని పోషకాలు అన్ని వేళల్లో అందుతూనే ఉండాలి. రోజూ వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరానికి మామూలుగా కన్నా ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తే శరీరం శక్తి హీనంగా మారుతుంది. ప్రొటీన్, ఇనుము, ఇతర విటమిన్లు కావలసిన మేరకు అందకపోతే చర్మంపై ముడతలు రావడం, జుత్తు రాలిపోవడం, నీరసం నిస్సత్తువ వంటి సమస్యలు మొదలవుతాయి. దీర్ఘకాలిక ంగా ఈ సమస్యలు ఇలాగే కొనసాగితే జీవక్రియలు కూడా సజావుగా జరగవు. ఫలితంగా శరీరం రోగగ్రస్తమవుతుంది.

అతి ఎప్పుడూ నష్టమే..

  • మనం తీసుకునే ఆహార పదార్థాల పరిమితుల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవేవీ పట్టించుకోకుండా అతిగా వ్యాయామాలు చేస్తే ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పాటు కొన్ని సార్లు విరుద్ధ ఫలితాలు కూడా రావచ్చు.


  • అతి వ్యాయామం వల్ల శరీరం కఠినంగా మారడంతో పాటు మెదడు కూడా శక్తిహీనంగా మారుతుంది. దీనివల్ల వ్యాయామాలను మధ్యలోనే మానేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందుకే సాధారణ స్థాయిలో, ఎడతెగకుండా చేసే వ్యాయామాలే ఎక్కువ ఫలితాల్ని ఇస్తాయి. లక్ష్యానికి చేర్చడంలో బాగా తోడ్పడతాయి.

  •  వ్యాయామంతో శరీరంలోని కొవ్వు పదార్థాలు కరిగిపోవాలని మనం కోరుకుంటాం. కానీ అతి వ్యాయామాలతో శరీర వ్యవస్థను నిలబెట్టే కండరాలు, నీరు, లవణాలు సైతం కరిగిపోతాయి. ఇది సష్టదాయకం.


  • వృద్ధులు వ్యాయామాన్ని ప్రారంభిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అతి సాధారణ వ్యాయామాలతో శరీరాన్ని ముందు ఉత్తేజపరచాలి. ఆ తరువాతే కాస్త శ్రమ కలిగించేవి చేయవచ్చు. ఉదాహరణకు ఓ 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కినా పెద్దగా ఆయాసమేది రాలేదంటే అతని కండరాలు మరింత బలమైన వ్యాయామాలకు యోగ్యంగా ఉన్నాయని గ్రహించాలి. అంతే తప్ప ఒకే రోజు హఠాత్తుగా చాలా కఠినమైన వ్యాయామాలకు పూనుకోకూడదు.


బరువు, కొవ్వు తగ్గాలంటే ?
బరువు తగ్గాలనుకునే వారు చాలా మంది ఆహారాన్ని బాగా తగ్గించి వేస్తారు. దీని వల్ల అనుకోని నష్టాలు ఎదురవుతాయి. ఆహారాన్ని అతిగా తగ్గించడం వల్ల శరీరంలోని జీవక్రియలో వేగం తగ్గిపోతుంది. బలహీనత, అలసత్వం, అసహనం మొదలవుతాయి. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది.

  •   కఠినంగా ఉపవాసాలు చేసే వారిలో శరీరం బరువు బాగా తగ్గిపోతుంది. అయితే, ఇందులో సగం బరువు తగ్గడానికి కండరాలు కరిగిపోవడమే కారణం. కండరాలకు కొవ్వు కరిగించే శక్తి ఉంటుంది. కండరాలు బలహీనం కావడం అంటే, శరీరంలోని కొవ్వును కరిగించే ఒక పరికరం బలహీనపడటమే.


  • కొన్నేళ్ళ ఉపవాసం తరువాత ఎప్పుడైనా కాస్త క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మొదలెడితే శరీరం బరువు హఠాత్తుగా పెరిగిపోతుంది. కొవ్వును కరిగించే శక్తిని కండరాలు కోల్పోవడమే ఇందుకు కారణం. అందుకే శరీరంలోని కొవ్వును కరిగించాలంటే కండరాలు పెరగాలే గానీ, తరిగిపోకూడదు. అందుకు మంచి వ్యాయామం, బాగా పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరి.


ఎంత నీరు తాగాలి?
నిజానికి మనకు వేస్తున్న దాహం కన్నా ఎక్కువగా శరీరానికి నీరు కావాలి. ఆరోగ్యవంతమైన కండరాలు 70 శాతానికి ఎక్కువగానే నీరు కోరతాయి.

  •   మనం తీసుకున్న పోషకాలు శరీరానికంతా చేరవేసే ఒక వాహకంలా నీరు పనిచేస్తుంది. శరీరంలోని కణజాలమంతా చైతన్యవంతంగా పనిచేయడంలో నీరు కీలక పాత్ర వహిస్తుంది. నీరు తక్కువగా తీసుకున్నప్పుడు పోషకాల పంపిణీలో లోపాలు చోటుచేసుకుంటాయి.


  •   నీటి శాతం తగ్గినప్పుడు అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం మరికొన్ని వ్యర్థ పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఫలితంగా శక్తి హీనత, నిర్జీవత్వం, నిరుత్సాహం అలుముకుంటాయి. అందుకే శరీర అవసరాలకు ఏమాత్రం తగ్గకుండా నీరు తాగాలి. ఇది జీవక్రియలు సజావుగా జరిగేలా చూడటమే కాదు. ఇతరత్రా రోగ నిరోధక శక్తి నిలకడగా ఉండేందుకు తోడ్పడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top