![]() |
తెలుగు సినిమా పరిశ్రమలో ఈనెల 9న మొదలైన షూటింగ్స్ బంద్ నేటితో ఏడో రోజుకు చేరుకుంది. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు షూటింగ్‌లకు హాజరు కారాదని సినీ కార్మికుల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సాకుగా తీసుకుని, తమ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు నిర్మాతలంతా నడుం కడుతున్నారు. ఈ రోజున సినిమాలు తీస్తున్న నిర్మాతల్లో నూటికి తొంబై మంది నష్టపోతున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. నిర్మాత అనేవాడు లేకపోతే, పరిశ్రమే లేదన్న వాస్తవాన్ని గుర్తుంచుకుని హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, ఇతర ముఖ్య సాంకేతిక నిపుణులు సహకరించాలని నిర్మాతలు చేస్తున్న విజ్ఞప్తికి అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని, ఇవ్వాళ రేపట్లో సమస్యకు పరిష్కారం లభించనున్నదని తెలుస్తోంది.
![]() |
ఆస్తులు తెగనమ్ముకుని ఎంతో ప్యాషన్‌తో సినిమారంగానికి వస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రంగం చేదు అనుభవాన్నే మిగుల్చుతోందని, ఒక సినిమా తీసాక, రెండో సినిమా తీసేందుకు ఎవరూ సాహసించడం లేదని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొంచెం ఆలస్యంగానైనా గుర్తించిన హీరోలు, దర్శకులు ఈ విషయంలో తమ సంపూర్ణ సహాయసహకారాలు అందించేందుకు ముందుకు వస్తున్నారని సమాచారం అందుతోంది. మీరు కఠినంగా ఉండండి. పక్కా ప్రణాళికతో ముందుకు సాగండి. స్వయంనియంత్రణ పాటించండి. మీ సమస్యలన్నీ వాటంతటవే పరిష్కారమైపోతాయని, అందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని వారంతా అంటున్నారని తెలుస్తోంది!