పెళ్లి కూతుళ్లకూ ఓ కోర్సు ఉంది మీకు తెలుసా? అయితే ఇది చూడండి.


'బ్రైడల్ మేకోవర్ గ్రూమింగ్ కోర్సు పది రోజుల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది. మీకు నచ్చిన, అవసరమైన విషయాలను నేర్చుకోవచ్చు ఇక్కడ. ఈ కోర్సులో చేరాలనుకునే అమ్మాయిల తల్లిదండ్రులకు మొదట కౌన్సిలింగ్ ఇస్తాం. ఒక్కోసారి పెళ్లికొడుకు తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ సమయంలో వస్తుంటారు. కౌన్సిలింగ్‌లో వాళ్లకి ఏం కావాలి? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఆచారవ్యవహారాలు, ఆహారపు అలవాట్ల వంటి వివరాలను తెలుసుకుంటాం. ఈ ప్రోగ్రామ్‌లో లైఫ్‌స్టయిల్, భాష, బాడీ లాంగ్వేజ్, ఆయా ప్రాంతాల కల్చర్, సోషలైజింగ్ టెక్నిక్స్ వంటి విషయాలను నేర్పిస్తాం. పది రోజుల కోర్సులో బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. అన్ని విషయాల పట్ల అవగాహన కావాలంటే మాత్రం కనీసం రెండు నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ అవసరమవుతుంది. మేము తయారుచేసిన ప్రోగ్రామ్ కాలవ్యవధి మూడు నెలలు. ఇప్పటివరకు ఆరు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. మార్చిలో ఇంకో బ్యాచ్ మొదలవ్వబోతోంది.

 ఇలా మొదలవుతుంది...
ఉదయం ఆరుగంటలకు యోగతో రోజు మొదలవుతుంది. ఒక వారం యోగ, ఒక వారం మెడిటేషన్ ఉంటాయి. వాళ్ల చాయిస్‌ను బట్టి చేస్తుంటారు. కొందరు ఒక రోజు యోగ, ఒక రోజు మెడిటేషన్ కూడా చేస్తుంటారు. ఒక గంట చేశాక గ్రీన్‌టీ సేవనం. పాలతో తయారుచేసే కాఫీ,టీలు నిషిద్ధం ఇక్కడ.

ఆ తరువాత వంట శిక్షణ మొదలవుతుంది. తొమ్మిది నుంచి పదిగంటల వరకు ఈ శిక్షణ ఉంటుంది. పది తరువాత సెల్ఫ్ మేకప్ మొదలవుతుంది. ఒక రోజు చీర, ఒకరోజు వెస్ట్రన్ డ్రస్, మరోరోజు కాజువల్స్ వేసుకుంటారు. వాళ్లు వేసుకున్న డ్రస్‌కి తగ్గట్టుగా మేకప్, యాక్సెసరీస్, చెప్పులు వంటివన్నీ కరెక్ట్‌గా వేసుకోవాలి. ఇదికూడా శిక్షణలో భాగమే. కూరగాయలు ఎలా కోయాలి, ఏ నూనెలు, ఫ్లవర్ డెకరేషన్, గిఫ్ట్ ర్యాపింగ్ వంటి వంటకి, ఇంటికి సంబంధించిన విషయాలు నేర్పిస్తాం. ఇంటికి అనుకోకుండా అతిధులు వస్తే అప్పటికప్పుడు మైక్రోఒవెన్‌లో నిమిషాల్లో తయారయ్యే వంటలు నేర్పిస్తాం.

విదేశాలకు వెళ్లేవాళ్లకి వైన్ కల్చర్ తెలిసి ఉండాలి. అలాగని తాగమని కాదు. అక్కడ వైన్ ఎక్కువగా వాడతారు కాబట్టి ఏ రకం వైన్‌కి ఎలాంటి ఆహారాన్ని సర్వ్‌చేయాలి? ఏ ఫుడ్‌ను ఏ ప్లేట్‌లో సర్వ్ చేయాలి? ఎలా అలంకరించాలి వంటి అంశాలను నేర్పిస్తాం. వెజిటబుల్ కార్వింగ్ నుంచి సర్వింగ్ వరకు అన్ని విషయాలు వచ్చేస్తాయన్నమాట. ముంబయి నుంచి ఒక చెఫ్ వచ్చి విదేశీ వంటకాలను నేర్పిస్తారు. ట్రెడిషనల్ వంటకాలను హైదరాబాద్ చెఫ్ నేర్పిస్తారు.

నవ్వు కూడా నేర్పుతారు
టాప్ టు బాటమ్ కేర్ గురించి ఉంటుంది ఈ ప్రోగ్రామ్‌లో. తలనుంచి మొదలుపెట్టి పెడిక్యూర్ వరకు అన్ని విషయాల పట్ల అవగాహన వస్తుంది. నెయిల్ పాలిష్ వేసుకోవడం దగ్గరినుంచి, చర్మం, జుట్టు కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకుంటారు. టోటల్ బాడీ కవర్ చేస్తాం. వీటన్నింటితో పాటు సెల్ఫ్ రిలాక్సింగ్ మసాజ్ కూడా నేర్పిస్తాం. ఇందులో భాగంగా వాళ్లంతట వాళ్లు స్క్రబ్స్ తయారుచేసుకోవడం, బాడీ పాలిష్ తయారుచేసుకోవడం నేర్చుకుంటారు. అలాగే నవ్వు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పేందుకు డెంటల్ సర్జన్ ఉంటారు. మామూలుగా నవ్వడం వేరు. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం వేరు. ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అలాగే స్మైల్ కరెక్షన్స్ ఉన్నా ఆ డాక్టర్ సూచిస్తారు.

చీరకట్టులో తెలుగుదనం
చాలామంది అమ్మాయిలకు చీర కట్టుకోవడం సరిగా రాదు. చీరకట్టులో 60 నుంచి 80 రకాలు ఉన్నాయి. అవన్నీ నే ర్పిస్తాం. చీర కట్టుకోవడం వేరు, చుట్టుకోవడం వేరు. శరీరాకృతిని బట్టి చీర ఎలా కట్టుకోవాలి, ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి. ఏయే రంగులు నప్పుతాయి వంటి విషయాలు తెలియచేస్తాం. వేసుకున్న వస్త్రధారణకు తగ్గట్టుగా నగలు ఎలాంటివి వేసుకోవాలి, చెప్పులు ఎలా ఉండాలి, హెయిర్‌స్టయిల్ ఏంటి అనే విషయాలు కూలంకషంగా వివరిస్తాం. వీటన్నింటితోపాటు సమయానికి తగ్గట్టు ఎలాంటి మేకప్ వేసుకోవాలో నేర్పిస్తాం.

కోపాన్ని, ఒత్తిడిని జయించేందుకు. . .
రకరకాల ఒత్తిళ్ల నుంచి బయటపడటం ఎలా? కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి? టైం మేనేజ్‌మెంట్ చేయడం కూడా కోర్సులో భాగమే. వీటితో పాటు ఆస్ట్రలాజికల్ అరోమాథెరపీ, డైట్ ఎలా ఉండాలో కూడా చెప్తాం. రాశిని బట్టి రాళ్లు పెట్టుకుంటుంటారు కదా! అలానే సన్‌సైన్, పుట్టినరోజు, సమయం బట్టి ఎటువంటి ఫర్‌ఫ్యూమ్స్ వాడాలో, ఎటువంటి ఫుడ్ తినాలో చెప్తాం. ఈ విద్యను నేను థాయ్‌లాండ్‌లో నేర్చుకున్నాను.

దీనివల్ల శరీరంలో ఉండే పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను బాలెన్స్ చేసుకోవడం సులభమవుతుంది. ఎందుకంటే అమ్మాయిలు ఒక జీవితం నుంచి మరో జీవితంలోకి వెళ్తుంటారు కాబట్టి ఎంతోకొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. దాన్నుంచి బయటపడేందుకు ఇది బాగా ఉపకరిస్తుంది. మొత్తంమీద కాబోయే పెళ్లికూతుళ్లకి ఏమి అవసరమో వాటన్నిటిలో శిక్షణ లభిస్తుంది ఇక్కడ. మా కోర్సులో డ్రైవింగ్ కూడా భాగమే. ఈ కోర్సు ఫీజు పదిహేను వేల రూపాయల నుంచి మొదలవుతుంది. నేర్చుకునే అంశాలను బట్టి ఫీజు ఉంటుంది.
 
కంప్లయింట్ బాక్స్
బ్రైడల్ ప్రోగ్రామ్‌లో ఫిర్యాదుల బాక్స్ ఉంటుంది. అందులో అమ్మాయిలు వాళ్ల ఫిర్యాదుల్ని వేస్తుంటారు. మొదటిరోజు చేసిన ఫిర్యాదు కోర్సు ముగిసేటప్పటికి వాళ్లకే సిల్లీగా అనిపిస్తుంది. ఫ్యాన్ స్పీడ్ దగ్గర్నించీ... సెల్‌ఫోన్ రింగ్‌టోన్ వరకు ఎన్నో కంప్లయింట్స్ ఉంటాయి వాటిలో. భిన్నమైన వ్యక్తిత్వాలు, భిన్నమైన ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక గూటికింద ఉంటున్నప్పుడు ఇవన్నీ సహజమే. మొదటి వారం రోజులు ఎన్నో అంశాల్లో ఒకరికి ఒకరికి పడదు. కానీ, పదిహేను రోజుల తరువాత మంచి స్నేహితులయిపోతారు. అప్పటినుంచీ వాళ్ల మధ్య షేరింగ్ మొదలవుతుంది.

ఈ ట్రైనింగ్ కొత్త ఇంటికి, కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అడ్జస్ట్ అవ్వడాన్ని నేర్పిస్తుంది. మా ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న వాళ్లకి కాంప్లిమెంటరీగా బ్రైడల్ మేకప్ చేస్తాం. దాంతోపాటు వాళ్ల ఫిర్యాదులన్నిటినీ ఒక దగ్గర చేర్చి ఫైల్‌గా ఇస్తాం. ఒకావిడయితే కంప్లయింట్ల ఫైల్‌ను బౌండ్ చేయించుకుని భద్రంగా దాచుకున్నాని చెప్పింది. బహుశా తనకెప్పుడన్నా అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాటిని చూసుకుంటుంది కాబోలు. ఇలా చేయడం వల్ల అడ్జస్ట్‌మెంట్ సమస్యలు, మనస్పర్ధలు వచ్చినపుడు విడాకుల వరకు వెళ్లకుండా ఉండాలనేదే మా ఉద్దేశం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top