అద్భుత అందాలకు నిలయం అంబర్ కోట


రాజస్థాన్ పర్యాటకులకు స్వర్గ్ధామం. అక్కడ అడుగడుగునా రాజపుత్రుల వైభవానికి ప్రతీకలుగా నిలిచే కోటలు కనిపిస్తాయి. ప్రతి దానికీ ఓ చారిత్రక నేపథ్యం ఉంది. అలాంటి వాటిలో అంబర్ కోట ఒకటి. రాష్ట్ర రాజధాని జైపూర్‌కు ఉత్తరంగా ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారిపై 11 కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వతాలు చుట్టూ ఆవరించి ఉన్న మధ్యకాల భారతీయ చరిత్రకు చెందిన కోట ఇది. రాజపుత్రులు, మొగలుల వాస్తు శిల్పమే కాకుండా హిందూ, ముస్లింల వాస్తు సంపదకు ఇది నిదర్శనం కూడా. 1592లో ఒకటవ మాన్‌సింగ్ ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభిస్తే అతని ఉత్తరాధికారి అయిన ఒకటవ జైసింగ్ దీన్ని పూర్తి చేసాడు. ఇప్పుడు రాజులు, రాచరిక వైభవాలు లేనప్పటికీ వాటిని కళ్ల ముందు నిలపగలిగే ఉత్తమ స్థితిలో ఉన్న ఈ అంబర్ కోటను, రాజసౌధాన్ని చూడకపోతే రాజస్థాన్ పర్యటన పూర్తి అయినట్లు కాదు.

రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని 16వ శతాబ్దంలో అయోధ్యకు చెందిన ఇక్ష్వాకు వంశీకుడైన అంబరీషుడు కనుగొన్నాడని, అందుకే ఈ ప్రాంతానికి ‘అంబర్’ అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. 16వ శతాబ్దం దాకా కూడా అంబర్ రాజధానిగా అత్యంత వైభవోపేతంగా వెలుగొందింది. ‘మొత్తం భారత దేశంలో కొండపై ఉన్న అత్యంత సుందరమైన కోట’ అన్న కీర్తికి పాత్రమైంది ఈ కోట. ఇక్కడి అద్భుతమైన రాజసౌధం చిత్రకళ, శిల్పకళ, వర్ణరంజితమైన సభామంటపం. సరోవరాలు ఎవరి మనసునైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. రాజమందిరానికి చెందిన వైభవోపేతమైన భవన సముదాయంలోకి అడుగుపెట్టగానే ముందుగా పురాతనమై కాళీమాత ఆలయం కనిపిస్తుంది. ఉగ్రరూపి అయిన నల్ల శిలతో చెక్కిన కాళీ మాత విగ్రహం ఇక్కడ ఉంది. ఈ ఆలయాన్ని దాటితే ఎదురుగా విశాలమైన ఆవరణ కనిపిస్తుంది. చలువ రాయి, ఎర్రటి శాండ్‌స్టోన్ (ఇసుకరాయి)తో నిర్మాణమైన ఈ ఆవరణ రాజమందిరానికి మరింత వన్నె తెచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడే అప్పట్లో రాజులు ప్రజా దర్బారు నిర్వహించే వారు. దర్బారు హాలుకు ఎదురుగా చలువరాతితో నిర్మించిన ఒక అంతస్థు కట్టడాల మధ్యలో అద్భుతమూ, అంతే నయన మనోహరమూ అయిన ‘గణేశ్ పూల్’ ఉంది. ఇది మొగలుల శైలిలో నిర్మాణమైంది. దీని బయటి గోడలనిండా వాటర్ కలర్స్‌తో చిత్రించిన అద్భుతమైన చిత్రాలున్నాయి. శతాబ్దాలు గడిచిపోయినప్పటికీ ఒకింత కూడా మాసిపోకుండా ఇప్పటికీ కొత్త చిత్రాలుగా మెరిసిపోతూ చూసే వారికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. వివిధ జాతుల ఆకులు, పూలు, పండ్లు, కూరగాయలతో రంగులను తయారు చేసి అచ్చుల ద్వారా ఈ చిత్రాలను చిత్రీకరించారు.


దీనికి కుడి వైపున ‘సుఖ నివాస్’ ఉంది. ఇది ఉద్యానవనం. దీనికి ఎదురుగా ఉండే అద్భుత కళా లోకమైన దివాన్-ఎ-ఖాస్ (అంతఃపురం) రాజుల వైభవానికి సాక్షీభూతంగా ఉంటుంది. దీనే్న ‘శీష్ మహల్’(అద్దాల మహల్) అని కూడా అంటారు. కళాకృతమైన ముఖద్వారం మంటపం ముందుంటుంది. తెల్లటి చలువరాతితోను, ఎర్రటి సైకత శిలలతో నిర్మాణం ఈ మందిరానికి మరింతగా మెరుగులు అద్దింది. ఎంతో కళాత్మకంగా ఉండే ఈ భవనం నిండా రంగురంగుల రాళ్లు, గాజు ముక్కలు, నగిషీలు చెక్కిన అద్దాలతో అమోఘంగా నిర్మించబడి కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. ఇక్కడి చిన్న గదిలోకి పర్యాటకులను చేర్చి వాకిలి మూసివేసి గాఢాంధకారాన్ని సృష్టించి హటాత్తుగా ఒకటి రెండు కొవ్వొత్తులను వెలిగించి పైకి, కిందికి ఆడిస్తే మొత్తం గది వర్తులాకారపు నక్షత్ర లోకంలాగా మెరిసిపోతుంది. ఇది ఓ మరుపురాని మధురానుభూతి. కొవ్వొత్తుల వెలుగుకు అద్దాలు, గాజుముక్కలు కళ్లు మిరుమిట్లు గొలిపే రంగుల్లో ధగధగా మెరిసిపోతుంటాయి. ఇక ఆయుధాగారంలో ఆ కాలంలో ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్పబడే 58 టన్నుల బరువుండే ఫిరంగిని చూడవచ్చు. దీనినుంచి ప్రయోగించే ఫిరంగిగుండు 20 కిలోమీటర్ల దూరం దాకా పోయేదట.
మధ్యకాలపు భారతీయ రాజులు, మహరాజుల చరిత్రలో మొక్కవోని ధైర్య సాహసాలకు పెట్టిన పేరయిన రాజపుత్రులకు ప్రత్యేక స్థానం ఉంది. ఢిల్లీ మొగలాయి చక్రవర్తుల పాలనలో వీరు అత్యంత ప్రముఖ స్థానం సంపాదించారు. భిన్నమతాలకు చెందిన ఈ రెండు వంశాల వారి మధ్య రాజకీయ సంబంధమే కాకుండా వైవాహిక సంబంధాలు కూడా ఉన్నాయి. మొగలాయి చక్రవర్తుల్లో ప్రసిద్ధుడయిన అక్బరు పాదుషా జైపూరుకు చెందిన రాజా తోడరమల్ కుమార్తె అయిన జోధాబాయిని వివాహం చేసుకుని, ఆమెను పట్టమహిషిగా చేసుకోవడమే కాక ఆమెకు పుట్టిన సలీమ్ (జహంగీర్)ను తన వారసుడిగా చేసాడు. ‘జోధా అక్బర్’ సినిమా కథ ఇదే. రాజా బాహర్ మల్లు మునిమనుమడైన రాజా మాన్‌సింగ్ అక్బరుకు ఆప్తమిత్రుడుగానే కాకుండా మొగల్ సైన్యంలో ప్రముఖ సర్దారుగా ఉన్నాడు. ఇతనే అంబర్ కోటకు, రాజమందిరానికి పునాది వేసాడు.


మోతా సరోవరం మధ్యలో ఉండే కట్టడం పైభాగాన తేలియాడే ఉద్యానవనం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొత్తం కోట విహంగ దృశ్యం పార్శ్వ భాగం ఈ సరోవరంలో ప్రతిబింబిస్తుంది. ఇక్కడినుంచి రాజప్రాసాదానికి రహస్య మార్గముంది. ఏనుగుపై కూర్చుని కోటను చుట్టి రావడం ఇక్కడి మరో విశేషం. అలా ఏనుగుపై కూర్చుని కోటను చుట్టి వచ్చేటప్పుడు జైపూర్ నగర విహంగ వీక్షణం చేయవచ్చు. విదేశీ పర్యాటకులు చాలా మంది ఏనుగుపై కూర్చునే కోటను చుట్టి వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న అంబర్ కోట రాష్ట్ర రాజధాని జైపూర్‌కు కూతవేటు దూరంలోనే ఉండడంతో ఇది ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top