శ్రీరాముని జన్మ విశేషాలు

ప్రస్తుతం నడుస్తున్న ఏడవవైవస్వత మన్వంతరంలో 24వ మహాయుగంలో, త్రేతాద్వాపర యుగ సంధికాలంలో 1,68,53,000 సంవత్సరాల క్రితం శ్రీరాముడు అవతరించాడు. శ్రీవాల్మీకి రామాయణం ప్రకారం, చైత్రమాసం, పునర్వసు నక్షత్రం(నాల్గవపాదం) నవమి తిథి నాడు, చంద్రునితో కూడిన బృహస్పతి కలిసి ఉన్న కర్కాటక లగ్నంలో, సూర్య, కుజ, గురు, శుక్ర, శని అనే ఐదు గ్రహాలు తమ తమ ఉచ్ఛస్థానాలైన మేష, మకర, కర్కాటక, మీన, తులా రాశుల్లో విలసిల్లుచున్నప్పుడు ఇక్ష్వాకు వంశవర్థనుడైన శ్రీరాముడు జన్మించాడు.

ఆయన కర్కాటక లగ్నంలో జన్మించడం వల్ల సజ్జన ప్రీతి, దుర్జనులపై తీవ్రబుద్ధి, జలక్రీడాసక్తత, గుణశీల సంపద, ఉదారత కలిగి ఉన్నాడు. శ్రీరాముడు మధ్యాహ్న వేళలో జన్మించడం చేత తేజస్వి, సుందర నేత్రుడు, శ్రీమంతుడు, అందరికి అభిమాన పాత్రుడుగా వాసిగాంచాడు. పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించడం వల్ల శాస్త్ర నైపుణ్యం, అధిక సంఖ్యలో స్నేహితులు, రత్నభూషణాలు, దానగుణం కలవాడు అయ్యాడు. నవమినాడు జన్మించడం వల్ల దేవతలను ఆరాధించే వాడుగా, పుత్ర సంతానవంతుడుగా, శ్రీమంతుడుగా, సుగుణనిధిగా కీర్తిమంతుడై నాడు. తొమ్మిది సంఖ్య అనేక విధములలో విశిష్టమైనది. శుక్షపక్షంలో జన్మించడం వల్ల, శ్రీరాముడు చిరాయువు, అందమైన శరీరం కలవాడు, ధీమంతుడు, సత్పురుషులకు ఆనందం కలిగించేవాడు అయ్యాడు.

చైత్రమాసంలో జన్మించడం వల్ల ఉత్తమ కార్యసాధకుడు, విద్యావినయశాలి, మధురాన్నభోక్త, లోక కల్యాణ కారకుడు అయ్యాడు. వసంత ఋతువులో జన్మించడం వల్ల శ్రీరాముడు, ' పుంసాం మోహన రూపాయ' అన్నట్లుగా మన్మ«థుడి కంటే అందగాడు, ప్రతాపవంతుడు, సుగంధ ద్రవ్య ప్రియుడు అయినాడు. ఉత్తరాయణంలో జన్మించినందువల్ల శ్రీరాముడు ప్రసన్నుడు, సదాచార సంపన్నుడు, నిష్ఠాపరుడు అయ్యాడు. అయోధ్యలో శ్రీరాముడు జన్మించడం, ఆ నగరానికి ఎనలేని కీర్తిని కలిగించింది. శ్రీరాముని జన్మవేళా విశేషం ఇది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top