గంగానది పుష్కరాలు - గంగమ్మ పుట్టిల్లు చూద్దాం రండి

భారతీయ జీవన వాహిని... పరమపావని గంగానది. హిమాలయాల్లో పుట్టి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బంగాళాఖాతంలో సంగమించే వరకు గంగమ్మ ప్రస్థానం మహాద్భుతం. మంచుముత్యాల సరం ఉత్తరాంచల్ గంగమ్మ పుట్టినిల్లు. హిమవంతుడిని వదిలి, మంచులా కరిగి గంగమ్మ మనల్ని పునీతం చేసేందుకు దివి నుంచి భువికి దిగివస్తుంది. బదరీనాథ్ నుంచి తాత్త్విక చింతనను, కేదారనాథ్ నుంచి ఆధ్యాత్మిక తరంగాలను మోసుకువచ్చి భారతీయులకు సుసంపన్న జీవనాన్ని అందిస్తుంది. 

ఉత్తరాంచల్‌లోని దేవప్రయాగలో భాగీరథి, అలకనందలు సంగమించిన చోట గంగమ్మ ప్రయాణం మొదలౌతుంది. అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరం సుందరమైన కొండకోనల నుంచి ప్రయాణించి రుషీకేశ్ మీదుగా హరిద్వార్‌లో భూమి మీద కాలుపెడుతుంది. గంగమ్మ అడుగు పడిన నేలంతా పచ్చదనాల ఏరువాక. తను ప్రవహించిన అణువణువునూ సస్యశ్యామలం చేస్తూ, సంస్కృతిని సుసంపన్నం చేస్తూ ముందుకు సాగుతుంది గంగమ్మ. ఉత్తరాంచల్, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిబెంగాల్ రాష్ట్రాలలో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారతీయులకు జీవనాడిగా నిలుస్తున్నది. 40 కోట్ల మంది భారతీయులను కన్నతల్లిలా ఆదరిస్తున్నది. అన్ని కోట్ల మందికి జలాలను, సంస్కృతిని పంచుతున్న నదుల్లో గంగానది ప్రపంచంలోని అతి పెద్ద నదుల సరసన స్థానం దక్కించుకుంది.

పుష్కరశోభ
ఎన్నో మహిమలు, మరెన్నో మేలిమలుపులతో సాగే గంగమ్మ ఈ రోజు నుంచి కొత్తశోభతో అలరారనుంది. మన దేశంలోని 12 పుణ్యనదులకు ఏటా ఒక నదికి పుష్కరాలు వస్తాయి. అలాంటి పుణ్య నదుల జాబితాలో కూడా గంగమ్మదే అగ్రస్థానం. రాశులలో మొదటిదైన మేషరాశిలో గురువు ప్రవేశించిన సందర్భంగా మన దేశంలోని నదులల్లో పరమపవిత్రమైన గంగానదికి పుష్కరాలు వస్తాయి. ఈ రోజున గంగానది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. 19 తేదీ వరకు ఉత్తరాంచల్ నుంచి ప్రయాగ వరకు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో గంగానది పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి.

కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలు, పుష్కర క్రతువులు, హారతులతో గంగమ్మ పులకించనున్నది. గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్, పంచప్రయాగలు, హరిద్వార్, గంగాసాగర్, కాశీ, త్రివేణీ సంగమాల్లో పుష్కర స్నానాలు, క్రతువుల నిర్వహించడం వల్ల విశేషపుణ్యఫలం లభిస్తుందని పురాణ ప్రవచనం. పుణ్యఫలాల సంగతి పక్కన పెడితే మనకు జీవాన్ని, ఉనికిని, సంస్కృతిని ఇచ్చిన గంగమ్మను జీవితంలో ఒకసారయినా చూడాలి. ఆ పవిత్ర జలాలను స్పృశించాలి.

హరిద్వార్ నుంచి కోల్‌కతా వారకు గంగమ్మ ప్రయాణం ఒక ఎత్తయితే తన పుట్టినిల్లయిన ఉత్తరాంచల్‌లో గంగమ్మ గలగలలను ఆనందించడం మరో ఎత్తు. స్వచ్ఛ, గంభీర గంగా ప్రవాహాల వెంట యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్‌లను కలుపుతూ సాగే చార్‌ధామ్ యాత్ర చేస్తే మది పులకిస్తుంది. దైవారాధనతో పాటు, ప్రకృతి ఆరాధన చేయాలనుకొనే వారికి చార్‌ధామ్ యాత్రకు మించినది లేదు. గంగానది పుష్కరాల సందర్భంగా పుణ్యంతో పాటు పురుషార్థం సంపాదించాలనుకొనే వారికి చార్‌ధామ్ యాత్ర బెస్ట్ చాయిస్.

పుణ్యం.. పురుషార్థం
  •  ఈ రోజు నుంచి 19 వరకు గంగానది పుష్కరాలు జరుగుతున్నాయి. రుషీకేశ్, హరిద్వార్, కాశీ, ప్రయాగలలో గంగమ్మకు పూజలు చేయడం పుణ్యప్రదం.
  •   అలాకాకుండా ప్రకృతి సోయగాలకు, పుణ్యక్షేత్రాలకు నెలవైన ఉత్తరాంచల్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్‌లు చుట్టివస్తే పుణ్యం.. పురుషార ్థం.
  • మంచుపర్వతాల నుంచి జాలువారి కొండకోనల మీదుగా సాగే గంగను పలకరిస్తూ, ఈ నాలుగు క్షేత్రాలు చూసేందుకు కనీసం పదిరోజుల సమయం పడుతుంది.
  •  హైదరాబాద్‌లోని సదరన్ ట్రావెల్స్, ఉత్తరాంచల్ ప్రభుత్వ విభాగం అయిన ఘర్వాల్ మండల్ వికాస్ నిగం కార్యాలయాలను సంప్రదిస్తే వసతి,రవాణా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లోని ఘర్వాల్ నిగమ్ ప్రతినిధి కైలాశ్ కొఠారి ఫోన్:94939 82645

చార్‌ధామ్ యాత్ర
యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్‌ను కలుపుతూ చేపట్టే యాత్రను చార్‌ధామ్ యాత్ర అంటారు. ప్రతిఒక్క భారతీయుడు కాశీక్షేత్రాన్ని దర్శించాలనుకుంటాడు. అక్కడి గంగలో స్నానం చేసి, కాశీ విశ్వేశరుడిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భావిస్తారు. అలానే ఉత్తరాది వారంతా ఈ నాలుగు క్షేత్రాల యాత్ర, చార్‌ధామ్ యాత్ర చేస్తారు. ఢిల్లీ నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంది యమునోత్రి. ఇది యమునానది పుట్టిన స్థలం. ఈ క్షేత్రంలో యమునాదేవి ఆలయం ప్రకృతి అందాల మధ్య ఠీవీగా కనిపిస్తుంది.

హనుమాన్ చెట్టి నుంచి 14కిలోమీటర్లు కాలినడకన లేదా గుర్రాల మీద వెళ్లి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడికి కిలోమీటరు దూరం నిఠారుగా పైకి ఎక్కితే యమున పుట్టిన చోటు దర్శనం ఇస్తుంది. ఇక గంగోత్రి గంగమ్మ పుట్టిల్లు. ఇక్కడి నుంచి 19 కిలోమీటర్లు కాలినడకన వెళితే గోముఖ్ వద్ద గంగమ్మ జన్మస్థానాన్ని చూడవచ్చ. అది కాస్తకష్టంతో కూడుకున్న పనే అయినా సాహసయాత్రికులకు ఆ ప్రయాణం మధురమైన అనుభూతినిస్తుంది. గంగోత్రిలో గంగామాత ఆలయం ఉంది. ఇక్కడ భాగీర థి నది ప్రవహిస్తుంది. అది మరింత కిందకు వెళ్లాక, దేవ ప్రయాగ వద్ద అలకనందతో కలిసి గంగగా మారుతుంది. జోషీమఠ్‌కు చేరువలోని కేదార్‌నాథ్ యాత్ర మరచిపోలేని అనుభవాన్ని ఇస్తుంది.

ఇక్కడ హిమాలయాల మధ్య ఉన్న కేదారనాథుని ఆలయం రమణీయంగా ఉంటుంది. శంకరాచార్యులు ఇక్కడే కైవల్యం పొందారు. సుమారు పది కిలోమీటర్ల దూరం కాలినడకన లేదా పోనీల మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పాట్నా నుంచి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది. బదరీనాథ్ ప్రయాణం మరింత అందంగా ఉంటుంది. సరస్వతి, గంగా నదుల చెంత ఉన్న బదరీనాథుని ఆలయం వరకు వాహనం వెళుతుంది. అక్కడ వ్యాసుడు నివశించిన గుహను చూడవచ్చు. చార్‌ధామ్ యాత్ర కేవలం ఆధ్యాత్మిక జీవులకే కాదు... సాహసయాత్రికులకు సైతం గొప్ప అనుభూతినిస్తుంది.

పుష్కర సంరంభం
పుష్కరాల సందర్భంగా వారణాసి, అలహాబాద్‌కు సమీపంలోని త్రివేణిసంగమాలలో భారీఏర్పాట్లు చేస్తున్నారు. చార్‌ధామ్ యాత్రకు ఎక్కువ రోజుల సమయం అవసరం. అంత తీరిక లేని వారు వారణాసి లేదా అలహాబాద్ వెళ్లి గంగకు నివాళులు అర్పించవచ్చు. 64 స్నానఘట్టాలతో నిరంతరం కిటకిటలాడే వారణాసిలో మణికర్ణిక స్నానఘట్టాన్ని పరమపావనంగా భావిస్తారు. గంగా స్నానం, కాశీవిశ్వేశ్వరుని దర్శనం, గంగా హారతిని చూడడం రమణీయ అనుభవం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top