కులు మనాలి......మధ్యతరగతి వేసవి విడిది

కులు, మనాలి అనే రెండు ఊర్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు చిట్ట చివరగా ఉన్నాయి. మనవైపునుంచి మొదట కులు వస్తుంది. అక్కడ నుంచి 45 కి.మీ. దూరంలో మనాలి ఉంది. సిమ్లా నుంచి మనాలి 260 కి.మీ.దూరం. సుమారు తొమ్మిది గంటల ప్రయాణం. ఢిల్లీ నుంచి సరాసరి మనాలి వెళ్ళే పాకేజీ బస్సులు ఉన్నాయి. సుమారు 18 గంటల ప్రయాణం.

కులుగాని, మనాలి గాని పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి కావు. ఇవి రెండూ కేవలం వేసవి విడుదులు. కులులో రఘునాథ్ మందిర్, మనాలిలో హిడింబి ఆలయం ఉన్నాయి. ఈ రెండు ఊళ్ళు విహార యాత్రాకేంద్రాలుగానే ప్రసిద్ధి. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మొత్తం హిమాలయ పర్వత శిఖరాల నడుమనే ఉంది. అందువల్ల కులు మనాలి ఊళ్ల చుట్టూ ఎత్తయిన కొండలే. కాబట్టి వేసవి కాలంలో ఈ ఊళ్ళలో చల్లగా ఉంటుంది. చుట్టూ ఒక్క పచ్చని చెట్టు కూడా లేకుండా కేవలం నున్నటి కొండలు ఉంటాయి. వర్షాకాలం తరువాత అంటే సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ చూడముచ్చటగా ఉంటాయి. 


ఆపిల్ పళ్ళు కూడా అప్పుడే ఉంటాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ మనాలి నుంచి అటువైపు కొండలన్నీ మంచుతో నిండి పోతాయి. మనాలి నుంచి కనీసం రోహతంగ్ కనుమ దాకా వెళ్ళేందుకు కూడా వీలు లేకుండా మార్గాలన్నీ మూసుకుపోతాయి. కులు, మనాలిల అసలైన అందం నవంబరు నుంచే ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలలలో ఇక్కడ మంచుమీద చేసే స్కీయింగ్ వంటి ఆటల పోటీలు జరుగుతాయి.

ఆ మంచులో పరిగెత్తుతూ ఆడుకోవడానికి వచ్చే సాధారణ పర్యాటకులతో కులు మనాలి కిటకిటలాడుతుంటాయి. ఆ రెండు మూడు నెలలు కులు మనాలిలో హోటళ్ళలో గదులు దొరకడం కష్టం. మే, జూన్ నెలలలో వెళ్ళే పర్యాటకులు ఎక్కువమంది మధ్యతరగతి వారే. కాని మంచు కురిసే నెలలలో అంటే జనవరి, ఫిబ్రవరి నెలలలో వెళ్ళే పర్యాటకులు దాదాపు అందరూ పై తరగతి వారు అని చెప్పవచ్చు. కులులోనూ మనాలిలోనూ కూడా మన పచ్చళ్ళు, పప్పుతో చక్కని తెలుగు భోజనం దొరికే హోటళ్ళు ఒకటి రెండు ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top