జిడ్డు సమస్య, ముడతలకు రకరకాల క్లే (మట్టి)ప్యాక్‌లు

మట్టిని రకరకాల సౌందర్య చికిత్సల్లో వాడటం కొందరికి మాత్రమే తెలుసు. దీనివల్ల చర్మం నునుపు తేలి, మృదువుగా మారుతుంది. చర్మంపై మచ్చల్లాంటివి తగ్గి.. మంచి రంగు రావాలంటే.. ఈ క్లేలకు అదనంగా మరికొన్ని పదార్థాలు కలిపి చికిత్స తీసుకోవాలి. దీనివల్ల జిడ్డు సమస్య అదుపులో ఉంటుంది. ముడతలు మాయమవుతాయి. చర్మం బిగుతుగా మారుతుంది.
ఇవీ జాగ్రత్తలు..
 ఇలాంటి ప్యాక్‌లు వేసుకున్న తరవాత పదిహేను నిమిషాలకు కచ్చితంగా తొలగించాలి. ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు నవ్వటం, మాట్లాడటం లాంటి కదలికలు ముఖంలో ఉండకూడదు.


 నెలలో ఎన్నిసార్లు వేసుకోవాలనేది వయసును బట్టి ఉంటుంది. పదిహేనేళ్లలోపు అమ్మాయిలు అస్సలు వాడకూడదు. మరీ తప్పనిసరైతే నెలకోసారి ప్రయత్నించాలి. ఇరవైఅయిదేళ్లు దాటినవాళ్లు నెలకు రెండుమూడుసార్లు మాత్రమే ఈ పూతలు వేసుకోవాలి. ముప్ఫై అయిదేళ్లు దాటిన స్త్రీలు నెలకు నాలుగుసార్లు ప్రయత్నించవచ్చు. యాభై పైబడినవాళ్లు ఇలాంటి ప్యాక్‌లు వేసుకోకపోవడమే మంచిది.
 మొటిమలు ఉన్నచోట ఈ ప్యాక్‌ వేయకూడదు. కళ్ల అడుగున, కనురెప్పల పైన కూడా రాయకూడదు.
ప్యాక్‌లు
పూతకోసం వాడే మట్టి ముల్తానీ, చైనా క్లే, వండర్‌ మట్టి, గ్రీన్‌ క్లే, బ్లాక్‌ క్లే.. వంటి రకాల్లో దొరుకుతుంది. చర్మతత్వాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది.
జిడ్డు చర్మతత్వం అయితే.. 
 చెంచా ముల్తానీమట్టి, పావుచెంచా నిమ్మరసం, అరచెంచా తేనె, పావుచెంచా పుదీనా పొడి చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలో ఎంతో మార్పు ఉంటుంది.
చైనా క్లే ఒకటిన్నర చెంచా, గ్రీన్‌ టీ డికాక్షన్‌ చెంచా, కమలాఫలం తొక్కల పొడి, తేనె అరచెంచా చొప్పున తీసుకుని వీటన్నింటినీ రోజ్‌వాటర్‌తో మిశ్రమంలా చేసుకుని ముఖానికి పట్టించాలి. పది, పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మరీ జిడ్డుగా ఉంటే.. ఐదు రోజులకోసారి వేసుకోవచ్చు. జిడ్డు తక్కువగా ఉంటే.. నెలకు మూడుసార్లు రాసుకోవచ్చు. చర్మంలో మొటిమలు, జిడ్డు తగ్గడమే కాదు.. అందంగానూ మారుతుంది.
సహజ చర్మతత్వం ఉన్నవాళ్లు: 
ముల్తానీమట్టి అరచెంచా, పాలమీగడ లేదా పాలు అరచెంచా, గులాబీ రేకలపొడి అరచెంచా, తేనె చెంచా తీసుకుని పాలు లేదా సోయా పాలతో కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పది నిమిషాలయ్యాక తీసేయాలి.

అలాగే.. వండర్‌ క్లే బాదం పొడి చెంచా చొప్పున, పాలు రెండు చెంచాలు, మామిడిగుజ్జు చెంచా తీసుకుని వీటన్నింటినీ కలిపి చర్మానికి పూతలా రాయాలి. ఆరాక కడిగేయాలి.


 ముల్తానీమట్టి, టమాటాగుజ్జు, కీరదోస రసం చెంచా చొప్పున తీసుకుని అరచెంచా తేనె కలిపి రాసుకోవాలి. పదినిమిషాల తరవాత కడిగేస్తే చాలు.
పొడిబారిన చర్మతత్వానికి: ఈ తరహా చర్మ తత్వం ఉన్నవాళ్లు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచుకోకూడదు. ఈ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలంటే.. వండర్‌క్లే, కలబంద గుజ్జు చెంచా చొప్పున, విటమిన్‌ ఇ మాత్ర ఒకటి తీసుకుని చిక్కని పాలతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేస్తే మోము మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.


ముల్తానీమట్టి, సోయాపొడి, తేనె, చెంచా చొప్పున అరచెంచా బాదంపొడి తీసుకుని పాలతో ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. ఈ పూతను చర్మానికి వేసుకున్న ఎనిమిది నిమిషాల తరవాత తీసేయాలి.

ఈ వేసవిలో జుట్టుకు కూడా క్లేతో ప్యాక్‌ వేయవచ్చు. ముల్తానీమట్టి, కలబంద గుజ్జు కప్పు చొప్పున, మూడునాలుగు చెంచాల పుదీనాపొడి, రెండుచెంచాల వేపాకుల పొడి రెండు చెంచాలు తీసుకుని అన్నింటినీ కలిపి తలకు పట్టించాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి. తల్లో అధిక వేడి తగ్గి జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top