క్రేజీ తారలకు సెకన్లలో ఆదాయం

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది’ సామెత. అందుకే వెండితెర స్టార్స్ బుల్లితెరపై కూడా కనిపించి ఆదాయాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. వీరిలో కొందరు వ్యాఖ్యతలుగా, నటీనటులుగా సంపాదిస్తుంటే కొంతమంది సెకన్లపాటు వచ్చే యాడ్స్‌లో కనిపించి కోట్లు కూడగట్టుకుంటున్నారు. బాలీవుడ్‌లో అగ్ర హీరోలు బుల్లితెరపై కూడా నెంబర్ వన్ స్థానం కోసం, రెమ్యునరేషన్ విషయంలోనూ పోటీ పడుతున్నట్లే టాలీవుడ్‌లో కూడా జరుగుతోంది. అగ్రస్థానం, రెమ్యునరేషన్ మాట ఎలా వున్నా వీరి క్రేజ్ ఎంతవరకు ప్రొడక్ట్‌కి ప్లస్ అవుతుందనేది ప్రశ్నార్థకమే. ఈ విషయంలో 1-2 పర్సంటేజ్ మాత్రమే ప్లస్ అవుతుందనేది ట్రేడ్ వర్గాల మాట.

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈటీవీ, మాటీవీలలో దాదాపు 18 ఏళ్లపాటు పాటల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారంటేనే వాటి క్రేజేమిటో తెలుస్తుంది. అలాగే సంగీత తరహా కార్యక్రమాల నిర్వహణలో నాగూర్‌బాబు, శైలజ, కోటి, సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, సునీత, భువనచంద్ర, రమణ గోగుల వంటి ఎందరో కళాకారులు తమ క్రేజ్‌ని క్యాష్ చేసుకున్నారు, చేసుకుంటున్నారు.

‘జయప్రదం’ ద్వారా జయప్రద, ‘వావ్’ ద్వారా సాయికుమార్, ‘రాజు-రాణి-జగపతి’ ద్వారా జగపతిబాబు, ‘ఇట్స్ మై షో’ ద్వారా ప్రకాష్‌రాజ్, ‘ఇట్లు మీ లక్ష్మి’ ద్వారా మంచు లక్ష్మి, ‘అంతర్ముఖం’ ద్వారా యండమూరి, ‘బతుకు జట్కాబండి’ ద్వారా సుమలత, ఇంకా ఇలాంటి కార్యక్రమాల ద్వారా జయసుధ, రాధిక, మురళీమోహన్, ఉత్తేజ్, బ్రహ్మానందం, ధర్మవరపు, రాజీవ్ కనకాల వంటి వారెందరో సమర్థవంతంగా గడించుకోవడం జరిగింది, జరుగుతోంది.

ఈ మధ్యకాలంలో ఏ లైవ్ షోకైనా లేదా గేమ్ షోకైనా గెస్ట్‌లుగా తాజా చిత్ర యూనిట్ వారు గాని ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు రావడం బుల్లితెర పాలిట వరంగా మారింది. దాంతో ఇలాంటి షోలలో సాధారణ ప్రేక్షకుడు గెస్ట్‌గా కనిపించడం జరుగుతుంది. పార్టిసిపెంట్‌గా కనిపించడం అరుదై పోతోంది. ఎందుకంటే సెలబ్రిటీలు వస్తేనే ఆ షో టిఆర్‌పి రేటింగ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆ ఎపిసోడ్‌కి యాడ్స్ రూపంలో కలెక్షన్లు కురుస్తాయని ఆశిస్తున్నారు. వాస్తవం కూడా అంతే!
 
రోజులవారీ కాల్షీట్ల లెక్కన.. గంటల లెక్కన పనిచేసే క్రేజీ తారలకు బుల్లితెర సెకన్లలో కావల్సినంత ఆదాయాన్ని ఇస్తూ సినిమాపై ఆసక్తి కనబరచని ఎందరో వీక్షకులను దగ్గరకు చేరుస్తుంది. ఇదంతా ఒకెత్తయితే సెకన్లలోనే లక్షల నుండి కోట్లు కుమ్మరించే ‘బ్రాండ్ అంబాసిడర్’ అగ్రిమెంట్స్ వెండితెర వాసులకు వరంగా మారాయి. దాంతో క్రేజ్ మసకబారిన వెండితెర వాసుల మాటెలా ఉన్నా క్రేజీ హీరో హీరోయిన్లు మాత్రం అందిన అవకాశాలను అందిపుచ్చుకుని తమ ఖాతాలను నింపుకుంటున్నారు. ఆడవారి ఆభరణాల ప్రకటనలకు సైతం అగ్ర హీరోలు సై అంటూ ప్రచారం చేయడం జరుగుతుంది.
 
‘సువర్ణ భూమి’ ప్రకటన కోసం ‘కళాతపస్వి’ విశ్వనాథ్, బాలులు శ్రమిస్తుంటే ‘జండూబామ్’ ‘మణప్పురం గోల్డ్’ కోసం జూ.ఎన్టీఆర్, ‘ముత్తూట్ ఫైనాన్స్’ కోసం వెంకీ డబుల్ రోల్ చేస్తుంటే, ‘కల్యాణి జ్యుయెలర్స్’ కోసం నాగ్ కన్నతండ్రి పాత్రకు సై అన్నాడు. షాంపూ ప్రకటనపై అనుష్క శ్రమిస్తుంటే ‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్’తోపాటు రెండు మూడు ప్రకటనలతో జెనీలియా బిజీగా మారింది. పాల ఉత్పత్తుల కోసం రమ్యకృష్ణ, మీనాలు ఆరాటపడుతూంటే ‘మర్యాద రామన్న’ విలన్ ‘నాగినీడు’ సైతం పెస్టిసైడ్స్ యాడ్ లాగించేశాడు.
 
‘సిఎంఆర్ షాపింగ్ మాల్’కి జగపతిబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటే గతంలో థమ్స్ అప్, కోకాకోలాలకు బ్రాండ్స్‌గా ఉన్న చిరు, పవన్‌లు తప్పుకున్నా అల్లు అర్జున్ మాత్రం స్ప్రైట్‌కి యాక్ట్ చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుండి ‘ఎయిర్‌టెల్’ ప్రచారకుడిగా చరణ్ నటిస్తున్నాడు. ప్రకాష్‌రాజ్ సైతం ‘ఇండికా హెయిర్ డ్రై’తో పాటు రెండు మూడు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘ఒక్కడు’గా మహేష్‌బాబు దాదాపు 14 ఉత్పత్తులతో బిజీగా ఉన్నాడన్నది ట్రేడ్ సమాచారం. వీటిలో థమ్స్‌అప్, ఐడియాలు క్రేజీ ప్రాజెక్టులు కావడం విశేషం!

బ్రాండ్ అంబాసిడర్‌గా నెంబర్‌వన్ స్థానంతోపాటు హయ్యస్ట్ యాడ్స్ ఇన్‌కమ్ ప్లస్ యాడ్స్‌లో ట్రిపుల్ రోల్ (ముగ్గురు) చేసిన ఘనత కూడా ప్రిన్స్ మహేష్‌బాబుదే! ఈ హవా చూసిన యువ హీరోలకు కసి పెరుగుతుందనేది వాస్తవం. ఏళ్ల తరబడి సినిమాలు చేసి జయాపజయాలను ఎదుర్కోవడం కంటే యాడ్స్ చేసి సెకన్లలో కావల్సినంత మూట కట్టుకోవడం బెటరని క్రేజీ తారలు ఆలోచిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా తారలను ఒకే తాటికి కట్టి (దక్షిణాది వారిగా) యాడ్స్ చేస్తూ వాటిని డబ్బింగ్ చేసి ప్రచారం చేసుకోవడంలో కూడా కంపెనీలు సఫలీకృత మవుతాయి. వీటి వలన అదనపు మొత్తం తారలకు దక్కినా కొంత మొత్తం కంపెనీలకు ఆదా అవుతుంది. ఏదేమైనా వెండి తెర క్రేజీ తారలకు బుల్లితెర ఇచ్చే ఆదాయం ‘పాకెట్ మనీ’ అనుకుంటే పొరపాటు. వెండితెర పైనే కాదు బుల్లితెరపై కూడా తమ అభిమాన నటులు నెంబర్ వన్‌గా ఉండాలన్న తహతహలు అభిమానులలో కూడా కనిపిస్తున్నాయి. అయితే అభిమాన నటీనటులు ప్రకటించిన మాత్రాన వాటిని కొనుగోలు చేసే శక్తి, ఆసక్తి వీక్షకులకు కలుగుతుందని కంపెనీలు భావించకపోయినా కోట్లు వెచ్చించడం మామూలే!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top