పంచభూత లింగాలు అని వేటిని అంటారు? అవి ఎక్కడ ఉన్నాయి?

పంచభూత లింగాలు ఐదు. ఒకటి మనరాష్ట్రంలోను, మిగిలిన నాలుగూ తమిళనాడులో ఉన్నాయి. మనరాష్ట్రంలోని పంచభూత లింగ క్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ వెలసిన లింగం ‘వాయులింగం’, ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వామి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు.

ఇక మిగిలిన నాలుగు లింగాల్లో ఒకటి తమిళనాడు కంచిలో ఉన్న ‘పృథ్వీలింగం’. దీనిని మట్టిలింగం, క్షితిజ లింగం అని కూడా అంటారు. ఈ స్వామి ఏకాంబరేశ్వరుడు. ఈ లింగానికి జలాభిషేకం జరగదు. ఈ క్షేత్రం చెన్నైకి 70 కిలోమీటర్లు దూరంలో ఉంది. తిరుపతి నుంచి నేరుగా బస్సు ఉంది.


రెండవది చిదంబరంలో ఉన్న ఆకాశలింగం. ఇది కావేరీనది తీరంలో ఉంది. ఆకాశలింగం కనిపించదు, నటరాజరూపానికి ఆరాధన జరుగుతుంది. ఆకాశలింగదర్శనాన్ని రహస్యంగా భావిస్తారు. ఇక్కడ లింగదర్శనం ఉండదు. ఆ కారణంగానే చిదంబర రహస్యం అనే పదం వాడుకలోకి వచ్చింది. 


మూడవది శ్రీరంగం క్షేత్రానికి దగ్గరలోని జంబుకేశ్వర క్షేత్రం. ఇక్కడ జంబులింగం ఉంది. లింగం కిందభాగంలో ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. జలప్రవాహం ఉందని ప్రతీతి. ఈ స్వామి జంబుకేశ్వరుడు. ఇది తిరుచిరాపల్లికి పదికిలోమీటర్ల దూరాన ఉంది.

పంచభూతలింగాల్లో ఐదవది తేజోలింగం. దీనిని అగ్నిలింగం అని కూడా అంటారు. ఇది అరుణాచలం పట్టణంలో ఉంది. ఇక్కడ రమణమహర్షి ఆశ్రమం కూడా ఉంది. ఈ ప్రదేశం చెన్నై నుంచి 68 కి.మీ దూరం. విల్లుపురం- కాట్పాడి రైల్వేలైన్‌లో ఉంది. రాయవెల్లూరు నుంచి బస్సు సౌకర్యం ఉంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top