Gongura Pachadi : గోంగూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోంగూర దాదాపుగా సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. గోంగూరతో పప్పు,పచ్చడి వంటి వాటిని చేసుకుంటారు. ఈ రోజు గోంగూరతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్దాలు
తాజా గోంగూర ఆకులు – 2 కప్పులు
ఎండుమిరపకాయలు – 5
జీలకర్ర – 1/2 స్పూన్
ఇంగువ – చిటికెడు
ధనియాలు – 2 స్పూన్స్
పసుపు – 1/2 స్పూన్
ఉల్లిపాయ -1
వెల్లుల్లి – 10 రెబ్బలు
ఉప్పు – తగినంత
నూనె – 5 స్పూన్స్
తయారి విధానం
ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి ఎండుమిరపకాయలు,ధనియాలు,జీలకర్ర వేగించి పొడి చేయాలి. దీనిలోనే చివరగా వెల్లుల్లిని కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సి చేయాలి. అంటే వెల్లుల్లి పొడిలో కనపడుతూ ఉంటుంది.
అదే ప్యాన్ లో రెండు స్పూన్స్ నూనె వేసి గోంగూర ఆకులు, పసుపు వేసి బాగా మగ్గించాలి. గోంగూర ఆకు బాగా ఉడికిన తర్వాత పైన తయారుచేసుకున్న మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి.
ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక ఇంగువ వేయాలి.ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు వేగించాలి. దీనిలో గోంగూర ముద్ద వేసి బాగా కలిపితే ఆంధ్రులకు ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి రెడీ. దీనిలో కొంచెం నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుంది.