మినప సున్నుండలు - నెయ్యి, మినుములు కూడా చాలా ఆరోగ్యం, కాబట్టి స్నాక్ ఐటమ్ గా పిల్లలకి ఇవ్వడానికి బావుంటాయి. పెద్దవాళ్ళు కూడా తింటే వెంటనే ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది.
కావలసినవి:
మినప గుళ్ళు లేక మినప్పప్పు ఒక కప్పు, రెండు tbsp బియ్యం ,రెండు యాలకులు, 3/4 cup పంచదార లేక పటిక బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి , కొన్ని జీడిపప్పు చిన్న ముక్కలు. 1/3 cup నెయ్యి.
చేసే విధానం:
ఒక బాండీలో మినపగుళ్ళని లో - ఫ్లేమ్ లో బాగా కలుపుతూ వేయించుకోవాలి .కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకోండి .ఆఫ్ చేసే ముందు రెండు టేబుల్ స్పూన్ల బియ్యంని వెయ్యండి .బియ్యం వేయడం వల్ల సున్నుండ నోట్లో చుట్టుకోకుండా ఉంటుంది. ముందుగా బియ్యం వేస్తే మాడిపోతాయి.
అందుకే ఆఫ్ చేసే ముందు వేసుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత ఒక మినుము తీసి చిదిపితే అది లోపల మీకు రెడ్ కలర్ వస్తే వేగినట్టు . మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత ఈ మినప గుళ్ళు ,రెండు యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు ,మరీ బరకగా ఉండకూడదు.
ఇప్పుడు ముప్పావు కప్పు పంచదార కానీ పటిక బెల్లం గాని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోండి. ఇది కూడా మరీ మెత్తగా ఉండకూడదు. లైట్ గా బరక గా ఉంటే బాగుంటుంది .ఈ మినప సున్ని పిండి మీద పంచదార పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు మినప్పిండి పంచదారని బాగా కలుపుకోండి.
ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో జీడిపప్పుని వేసి దోరగా వేయించుకోండి. జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకొని, ఆ తర్వాత కాగిన ఆ వేడి నెయ్యి పిండి మీద పోసేయండి .ఇప్పుడు ఒక స్పూన్ తోటి మొత్తం అంతా కలపెట్టండి.
కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం వేడి నెయ్యి ఒక కప్పులో పక్కన పెట్టుకోండి .సుమారు 1/3 కప్పు నెయ్యి అవసరం ఉంటుంది. కొద్దిగా కొద్దిగా పైన నెయ్యి వేసుకుంటూ ఉండని చుట్టుకోవాలి .ఈ జీడిపప్పు ముక్కలు క్రంచిగా తగులుతూ సున్నుండలు చాలా టేస్ట్ గా ఉంటాయి.