గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనం రుచి అద్భుతంగా ఉంటుంది. అదే కమ్మదనం, అదే రుచితో ఇంట్లో కూడా దద్దోజనాన్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. వేసవిలో చలువ చేసే ఈ దద్దోజనం రెసిపీని చేసుకోండి.
కావలసిన పదార్థాలు
మెత్తగా ఉడికించిన అన్నం - 1 కప్పు
తాజా పెరుగు - 1.5 కప్పులు
కాచి చల్లార్చిన పాలు - అర కప్పు
నెయ్యి లేదా నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)
శనగపప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్ (కచ్చాపచ్చాగా దంచినవి)
జీడిపప్పు - 10 పలుకులు
కరివేపాకు - 2 రెమ్మలు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
సన్నగా తరిగిన కొత్తిమీర - కొద్దిగా
దానిమ్మ గింజలు - 2 టేబుల్ స్పూన్లు (ఆప్షనల్)
ముందుగా ఒక గిన్నెలో మెత్తగా ఉడికించిన అన్నం వేసి, వేడిగా ఉన్నప్పుడే గరిటెతో మెత్తగా మెదుపుకోవాలి.
అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో తాజా పెరుగు వేసి మొత్తం మిశ్రమం క్రీమ్ లాగా అయ్యేలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు కలపడం వల్ల దద్దోజనం త్వరగా పులవకుండా కమ్మగా ఉంటుంది.
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి లేదా నూనె వేడి చేయాలి.
నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించాలి.
పప్పులు వేగాక జీడిపప్పు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, మిరియాల పొడి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.
చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, దానిమ్మ గింజలు చల్లుకుంటే ఎంతో రుచికరమైన గుడి స్టైల్ దద్దోజనం రెడీ.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

