పొద్దున్నే నిద్రలేవగానే ఆడవాళ్లకు ఉండే అతి పెద్ద టెన్షన్.. 'ఈరోజు లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలి?' అని. హడావిడిగా ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే ఒక్కోసారి అందులో కూరగాయలు కూడా ఉండవు. అలాంటప్పుడు రోజూ చేసే ఎగ్ రైస్, క్యారెట్ రైస్ చేస్తే ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది.
నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడల్లా నేను అప్పటికప్పుడు కుక్కర్లో ఇట్టే చేసే ఓ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ ఉంది. అదే 'ఆలూ బఠానీ పులావ్' (Aloo Matar Pulao).
ఇంట్లో కేవలం బంగాళాదుంపలు, కొంచెం పచ్చి బఠానీ ఉంటే చాలు, దీని టేస్ట్ మాత్రం బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. పైగా పిల్లల బాక్స్‌లోకి హెల్తీ కూడా. మొన్నామధ్య నేను మా ఇంట్లో వాళ్ళకి బాక్స్‌లో పెట్టి ఇస్తే, మధ్యాహ్నానికి చల్లారినా కూడా భలే గుమగుమలాడుతూ ఉందట. మార్నింగ్ హడావిడిలో చాలా ఈజీగా అయిపోయే ఆ పులావ్ ఎలా చేయాలో మీతో పంచుకుంటాను.
ముందుగా ఇవి రెడీ చేసుకోండి:
బాస్మతి బియ్యం – 1 కప్పు (గంట ముందే కడిగి నానబెట్టుకోవాలి)
నూనె – 2 టేబుల్ స్పూన్స్
బంగాళాదుంప (ఆలూ) – 1 (కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చి బఠానీ – ½ కప్పు
ఉల్లిపాయ – 1 (పొడవుగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
మసాలా దినుసులు – బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, యాలకులు 5, దాల్చిన చెక్క 1 ఇంచ్, నల్ల యాలకు 1, సాజీరా ½ టీ స్పూన్
పుదీనా, కొత్తిమీర తరుగు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – 1 1/4 కప్పు (ఒకటింపావు కప్పు)
నా స్టైల్ తయారీ విధానం:
నేను ఎప్పుడూ ఈ పులావ్ కుక్కర్లోనే చేస్తాను, పని చాలా త్వరగా అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి, అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక బిర్యానీ ఆకు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, మామూలు యాలకులు, నల్ల యాలకు వేసి సువాసన వచ్చేదాకా వేగనివ్వాలి.
ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త కలర్ మారేదాకా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆలూ ముక్కలు కూడా వేసి నూనెలో మగ్గనివ్వాలి.
ఆలూ కాస్త వేగాక, అందులో ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగితేనే పులావ్‌కి అసలైన టేస్ట్ వస్తుంది.
ఆ తర్వాత ఇందులో ఎసరు కోసం.. ఒక కప్పు బాస్మతి బియ్యానికి ఒకటింపావు (1 1/4) కప్పు చొప్పున నీళ్లు పోయాలి. ఆ నీళ్లలోనే నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, పచ్చి బఠానీలు వేసి మంట పెంచి (హై ఫ్లేమ్ మీద) మరగనివ్వాలి.
ఎసరు బాగా మరుగుతున్నప్పుడు.. మనం ముందే నీళ్లు వంపేసిన బాస్మతి బియ్యం అందులో వేసేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా చల్లుకుని కుక్కర్ మూత పెట్టేయాలి.
కరెక్ట్‌గా ఒక్క విజిల్ రానిచ్చి స్టవ్ ఆపేయాలి. బాస్మతి బియ్యం కాబట్టి ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది.
కుక్కర్ ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూస్తే.. ఇల్లంతా భలే వాసన వస్తుంది. గరిటెతో అడుగు నుంచి నెమ్మదిగా కలుపుకుంటే పొడిపొడిగా, గుమగుమలాడే 'ఆలూ బఠానీ పులావ్' రెడీ! దీన్ని చల్లని రైతాతో సర్వ్ చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. మీరూ ఒక్కసారి రేపు ఉదయం లంచ్ బాక్స్‌లోకి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.

