రొటీన్ పల్లీ, కొబ్బరి చట్నీ బోర్ కొట్టిందా? ఈ 'మినపప్పు పచ్చడి' ట్రై చేయండి.. రుచి అదిరిపోద్ది!

Urd Dal Chutney
మన ఇంట్లో ఇడ్లీ, దోశ, వడ లాంటి టిఫిన్స్ అనగానే.. కచ్చితంగా పల్లీ చట్నీ, కొబ్బరి పచ్చడి లేదా టమాటా చట్నీ ఉండాల్సిందే. రోజూ అవే తిని నాకైతే బాగా బోర్ కొట్టేసింది. 

అసలు మినపప్పును మనం దేనికి వాడతాం? కేవలం ఇడ్లీ, దోశ పిండి రుబ్బుకోవడానికో, పోపులో (తాలింపు) వేయడానికో, లేదంటే సున్నుండలు చేసుకోవడానికో వాడతాం కదా. కానీ అదే మినపప్పుతో ఎప్పుడైనా చట్నీ చేశారా?

మొన్నామధ్య కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని నేను ఈ 'ఆంధ్ర స్టైల్ మినపప్పు చట్నీ' చేశాను. నిజం చెప్తున్నాను.. దీని ముందు కొబ్బరి పచ్చడి కూడా పనికిరాదు! 

ఇడ్లీ, అట్టు లాంటి టిఫిన్స్ లోకే కాదు, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే.. ఆ రుచే వేరు. మళ్లీ మళ్లీ తినాలనిపించేంత టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. పైగా ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు అస్సలు పాడవదు.

ఇంతకీ ఈ అద్భుతమైన చట్నీ నేను ఎలా చేశానో చూసేయండి!
దీనికోసం కావాల్సిన పదార్థాలు:
నల్ల మినుములు – అర కప్పు
ఎండుమిర్చి – 8 (మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు)
జీలకర్ర – 1 టీస్పూన్
మెంతులు – 1 టీ స్పూన్
చింతపండు – చిన్న నిమ్మకాయ సైజులో
బెల్లం – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 4-5
ఉప్పు – తగినంత
ఆవాలు, కరివేపాకు – తాలింపు కోసం
నూనె – 2 టేబుల్ స్పూన్స్

నా స్టైల్ తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి పాన్ (కడాయి) పెట్టుకుని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో నల్ల మినుములు వేసి మంచి సువాసన వచ్చే వరకు మంట తగ్గించి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

ఇప్పుడు అదే పాన్‌లో మరో స్పూన్ ఆయిల్ వేసుకుని.. మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. ముందుగా వేయించిన మినుములు, ఎండుమిర్చి మిశ్రమం అందులో వేసుకోవాలి. అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కాస్త బెల్లం, తగినంత ఉప్పు, నానబెట్టిన చింతపండు (లేదా చింతపండు పేస్ట్) వేయాలి.

ఇవన్నీ వేసి కొద్దిగా వేడినీళ్లు పోసుకుంటూ పచ్చడిని బరకగా (కొంచెం పలుకుగా ఉండేలా) గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్‌లా చేయకూడదు, అప్పుడే రుచి బాగుంటుంది.

చివరిగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి, కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకుతో గుమగుమలాడే తాలింపు పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మినప చట్నీని ఆ తాలింపులో వేసి కలుపుకుంటే చాలు.

అంతే.. ఘుమఘుమలాడే స్పైసీ 'మినపప్పు చట్నీ' రెడీ! రేపు ఉదయం టిఫిన్‌లోకి మీరూ ఈ చట్నీని ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్లంతా ఫిదా అవ్వడం ఖాయం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top