పక్షవాతం నిమిషాల్లో మటుమాయం....

From paneer
ఉన్నట్లుండి మాట తడబడుతుంది. ఒక కాలూ, ఒకచేయీ పడిపోతుంది . మూతి వంకర పోతుంది. ఎవరో బలవంతంగా వంచేసినట్లు శరీరంలో ఒక భాగం మెలిబడిపోతుంది. ఇవన్నీ పక్షవాతానికి సంబంధించిన లక్షణాలే. రక్తనాళాల్లో ఎక్కడో కాస్తంత కొలెస్ట్రాలో, కొవ్వో అడ్డుపడిన ఫలితమిది. పక్షవాతానికి గురైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తే ఆ అడ్డంకిని ఒక పరికరం ద్వారా తొలగించే వీలుంది. ఇది పక్షవాతానికి గురైన వ్యక్తిని నిమిషాల్లోనే తిరిగి సాధారణ స్థితికి చేరుస్తుందని అంటున్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రణ్‌ధీర్ కుమార్.
మెదడు పరిధిలోని రక్త నాళంలో ఎక్కడైనా అడ్డంకి ఏర్పడితే అది పక్షవాతానికి (హెమీ పెరేసిస్) దారి తీస్తుంది. ఒక కాలు, ఒక చేయి పడిపోవడం, మూతి వంకర పోవడంతో పాటు చాలా సార్లు మాట కూడా పడిపోతుంది. అయితే కేవలం రక్తనాళంలో అడ్డంకి ఏర్పడం ఒక్కటే కాకుండా రక్తనాళాల్లో ఒక్కోసారి ఒరిపిడి కారణంగా మెదడులో రక్తస్రావం కావడం వల్ల కూడా పక్షవాతం రావచ్చు.


పక్షవాతం రావడం అన్నది హృద్రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హృద్రోగుల్లో గుండె రక్తనాళాల్లో ఉండిపోయిన కొలెస్ట్రాల్ లేదా కొవ్వు ఒక్కోసారి రక్తనాళం ద్వారా మెదడులోకి చేరుతుందింది. ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. పక్షవాతం రావడానికి ముందు కొందరిలో అతి స్వల్పమైన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మాట తడబడటం, రాస్తున్నప్పుడు చేతి కదలికల్లో ఏదో ఇబ్బంది ఏర్పడుతుంది.

అయితే ఆ తరువాత ఓ రెండు గంటల్లో అతడు మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటాడు. అప్పటికి అలా పరిస్థితి చక్కబడగానే సంతోషించి ఊరుకుంటే ప్రమాదమే. నిజానికి మునుముందు ఒక తీవ్రమైన పక్షవాతం రాబోందని చెప్పే హెచ్చరికే అది. దీన్నే (టిఐఎ)ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ అంటారు. అసలు ఆ లక్షణాలు కనిపించిన వెంటనే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు తీసుకుంటే మునుముందు తీవ్రస్థాయి పక్షవాతం ఏదీ రాకుండానే చూసుకోవచ్చు.

అందుకే అసహజమైన లక్షణాలేవైనా కనిపించినప్పుడు వెంటనే న్యూరో ఫిజిషియన్‌ను సంప్రదిస్తే యాంజియోగ్రాఫీ ద్వారా సమస్యను కనుగొంటారు. ఆ వ్యక్తికి గుండె సంబంధమైన సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా పరీక్షిస్తారు. మెదడుకు వెళ్లే ప్రధాన రక్తనాళంలో ఎక్కడైనా అవరోధం ఏర్పడుతోందా అన్న విషయాన్ని కూడా చూస్తారు.
 

నిమిషాల్లో
సాధారణంగా వయసు పైబడటం, పొగతాగడం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు స్థూలకాయం వంటి సమస్యలేవైనా ఉంటే ఇవి కూడా రక్తనాళాల పరిధిని తగ్గిస్తూ వెళతాయి. క్రమంగా ఇవి రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటానికి దారి తీస్తాయి. ఈ కారణాలతో వచ్చే పక్షవాతం (స్ట్రోక్ ) గానీ మెదడులో రక్తస్రావం (హెమరేజ్)గానీ తలెత్తినప్పుడు మూడు లేదా నాలుగు గంటల లోపే ఆసుపత్రికి చేర్చగలిగితే వెంటనే యాంజియోగ్రాఫీ చేసి ఏ రక్తనాళంలో ఎక్కడ అడ్డంకి ఏర్పడిందో తెలుసుకుంటాం
 

 ఆ తరువాత క్లాట్ రిట్రాక్షన్ సిస్టమ్ ద్వారా ఆ అడ్డంకిని బయటికి లాగేసే ఏర్పాట్లు చేస్తాం. అందుకు అతి సూక్ష్మమైన ఒక పరికరాన్ని (కాథెడ్రాల్) రక్తనాళంలోంచి అడ్డంకి ఉన్న చోటికి పంపి దాన్ని బయటికి లాగేస్తాం. ఇదే కాకుండా టిపిఎ అనే విధానంలో అడ్డంకి తొలగిపోయేలా చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే సహజ రీతిలో రక్తప్రసరణ మొదలవుతుంది. ఫలితంగా అప్పటిదాకా కనిపించిన పక్షవాత లక్షణాలన్నీ క్షణాల్లో కనుమరుగైపోతాయి. ఒకప్పటి పక్షవాత చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది ఎంతో పెద్దముందడుగు.


సమయమే ముఖ్యం
ఈ తరహా చికిత్సల్లో రోగిని ఎంత తొందరగా ఆసుపత్రికి తీసుకువస్తారన్నది చాలా ముఖ్యం. నాలుగు గంటల లోపు తీసుకువస్తే అది చాలా ఉత్తమం. అలా వీలుకాని పరిస్థితుల్లో కనీసం ఆరు లేదా ఏడు గంటలలోపైనా రోగిని ఆసుపత్రికి త రలించడం జరగాలి. ఒకవేళ ఆ వ్యవధి కూడా దాటిపోతే రక్తప్రసరణ అందని భాగంలో మెదడు కణాలు చనిపోవడం మొదలవుతుంది.

దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్తకణాలు ఉత్పన్నం కావడం కానీ, మెదడు కణాలను మార్చడం కానీ సాథ్యంకాదు కాబట్టి జరిగే నష్టం శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే నిర్ణీత వ్యవధిలో రోగిని ఆసుపత్రికి తరలించడం ఒక్కటే మెదడును కాపాడే ఏకైక పరిష్కారం. అలా అయితేనే రోగిని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడం సాధ్యమవుతుంది. అయితే కొందరిలో రక్తనాళంలో అడ్డుపడిన పదార్థం మరీ గట్టిగా ఉండి బయటికి లాగడం సాధ్యం కాకపోవచ్చు.

అలాంటి స్థితిలో ఆ భాగంలోకి ఒక బెలూన్‌ను లోనికి పంపి రక్తనాళాన్ని వ్యాకోచింప చేస్తాం. ఆ వ్యాకోచం స్థిరంగా ఉండకపోతే ఆ భాగంలో ఒక స్టెంట్‌ను కూడా అమరుస్తాం. ఈ చికిత్సల్లో అడ్డుపడిన భాగం ఒరిపిడికి గురై అందులో కొంత మెదడులోకి వెళ్లకుండా ఒక గొడుగు లాంటి పరికరాన్ని లోపల అమరుస్తాం. ఈ చికిత్సలన్నీ సకాలంలో అంటే 7 గంటల లోపే రోగిని ఆసుపత్రికి తర లిస్తేనే సాధ్యమవుతాయి.


నాలుగు గంటల లోపే తీసుకువస్తే అది మరింత శ్రేయస్కరం. ఏమైనా ఈ కొత్త విధానాలు పక్షవాత చికిత్సలో ఒక పెద్ద ముందడుగే. కాకపోతే వాటి ని వినియోగించుకోవడంలోనే ఆలస్యం జరక్కుండా చూసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top