ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే....తీసుకోవలసిన జాగ్రత్తలు


ప్రెగ్నెన్సీలో 1-3 నెలలు ఫస్ట్ ట్రైమిస్టర్ అని, 4-6 నెలలు సెకండ్ ట్రైమిస్టర్‌గా, 7-9 నెలలు థర్డ్ ట్రైమెస్టర్‌గా డాక్టర్లు పరిగణిస్తారు.
1 - 3 నెలల వరకు...
సాధారణంగా ఈ నెలలో విపరీతమైన అలసట, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, కాళ్ల నొప్పులు, ఛాతి నొప్పి, ఆకలి, అరుగుదల తక్కువ, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలు మరీ భరించలేనివిగా ఉన్నప్పుడు మాత్రమే అడ్మిషన్, ట్రీట్‌మెంట్ అవసరం. ఈ సమస్యలన్నీ పిండాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం పెరిగే హెచ్.సి.జి, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్ల వల్ల కలుగుతాయి. అందువల్ల అసౌకర్యంగా ఉన్నా ఈ బాధలను ఎంతో కొంత తట్టుకోక తప్పదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం మితంగా ఎక్కువ సార్లు తీసుకోవడం, నూనెలు, కారాలు, మసాలాలు తక్కువగా వాడటం వంటి జాగ్రత్తలు ఉపశమనాన్ని ఇస్తాయి. డాక్టర్ సూచనలమేరకు ఫోలిక్‌యాసిడ్ మాత్రలు అవసరాన్ని బట్టి హార్మోన్ ఇంజెక్షన్లు లేదా మాత్రలు, వాంతులు వికారం తగ్గడానికి, జీర్ణశక్తి పెరగడానికి సిరప్‌లు అవసరం పడవచ్చు. ప్రెగ్నెన్సీ ముందు నుంచి ఇతర సమస్యలకై మందులు వాడుతున్న స్ర్తీలు డాక్టర్ని కలిసి, ఆ మందులు కొనసాగించగలిగినదీ, ప్రెగ్నెన్సీకి నష్టం చేకూర్చని మందులు మొదలుపెట్టవలసినదీ తెలుసుకోవడం మంచిది. 

4 - 6 నెలలో...
పై మూడు నెలల్లో ఉన్న సమస్యలన్నీ ఈ నెలల్లో తగ్గుముఖం పడతాయి. తల్లి బరువు పెరగడం, ఆకలి పెరగడం, కడుపులో బిడ్డ పెరగడం, ఆరవ నెల నుంచి బిడ్డ కదలికలు తెలియడం వంటివి ఈ నెలలో ముఖ్యమైనవి. కొన్ని సందర్భాలలో బి.పి., షుగర్ వంటివి పెరగడం, కాళ్లకు నీరు పట్టడం, నడుం నొప్పి వంటివి గమనిస్తాం. ఈ నెలల్లో చేసే టిఫా స్కానింగ్ ఎంతో ముఖ్యమైనది. ఈ నెలలో పిండం అన్ని అవయవాలు ఏర్పడతాయి. ఇక ఇప్పటి నుంచి పిండం పరిమాణంలో పెరగడమే తప్ప అవయవాలేవీ ఆరవ నెల తర్వాత ఏర్పడవు. అందుచేత ఈ నెలల్లో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డ అన్ని అవయవాలు ఏర్పడిందీ లేనిది తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఇచ్చే టి.టి ఇంజెక్షన్ 4-6 వారాల వ్యవధితో రెండు డోసులు ఈ నెలలోనే ఇవ్వాలి. రెగ్యులర్‌గా బరువు, బి.పి., చెక్ చేయించుకోవాలి. రక్త, మూత్ర పరీక్షలు, బ్లడ్ గ్రూప్ పరీక్షలు ఈ నెలల్లో చేయించుకోవాలి. ఐరన్, క్యాల్షియం, బి-కాంప్లెక్స్ వాడాలి. చాలామంది ఈ మాత్రలు వేసుకోవడం వల్ల బిడ్డ బరువుగా పుడతుందని, అందువల్ల సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. అందువల్లే గర్భిణీ స్ర్తీలను ఈ మాత్రలు వాడవద్దని సలహాలు ఇస్తుంటారు. కాని కేవలం ఈ మాత్రలు వాడటం వల్ల బిడ్డ బరువు పెరగదని, ఆరోగ్యంగా మాత్రమే పుడుతుందని అర్థం చేసుకోవాలి.
   
7 - 9 నెలలో...
ఈ నెలలో గర్భిణీ బరువు పెరగడం, బిడ్డ వల్ల భారంగా ఉండటం, నడుం నొప్పి, నీరసం, అలసట వంటివి కలుగుతుంటాయి. బి.పి., షుగర్ ఎక్కువవడం, ఉమ్మనీరు తగ్గడం, బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, కాళ్లకు వాపులు రావడం, కొద్దిగా తిన్నా కడుపు నిండిపోవడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఈ నెలలో ఉత్పన్నం అవుతుంటాయి. పదిహేను రోజులకోసారి డాక్టర్ చెకప్‌కు వెళ్లి, విపులంగా డాక్టర్‌తో మాట్లాడటం, అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. తొమ్మిదవ నెల దగ్గర పడినకొద్దీ డెలివరీకి అవసరమైన జాగ్రత్తలు గురించి డాక్టర్‌తో చర్చించి తగిన సూచనలు పొందాలి. నడుం నుంచి కడుపులోకి వచ్చే నొప్పులు, ఉమ్మనీరు కారిపోవడం, బ్లీడింగ్ అవడం, బిడ్డ కదలికలు తగ్గడం... వంటివి ఈ నెలల్లో వెంటనే హాస్పిటల్‌కి వెళ్లవలసిన సందర్భాలు. క్యాల్షియం, బి-కాంప్లెక్స్ మాత్రలు డెలివరీ దాకా వాడి, డెలివరీ తర్వాత డాక్టర్ సూచనమేరకు మరో మూడు నుంచి ఆరు నెలల వరకు వాడటం తల్లీబిడ్డలిద్దరికీ శ్రేయస్కరం. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top