మంచు దుప్పటి కప్పిన నేల - ప్రపంచంలోని అతి పెద్ద దీవి గ్రీన్‌లేండ్


ప్రపంచంలోని అతి పెద్ద దీవి గ్రీన్‌లేండ్. ఆర్కిటెక్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాలకి మధ్యగల గ్రీన్‌లేండ్ విస్తీర్ణం 2,175,600 చదరపు కిలోమీటర్లు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, ఆస్ట్రియా, బెల్జియం, స్విట్జర్లాండ్- ఈ ఎనిమిది దేశాల విస్తీర్ణంతో సమానమైన విస్తీర్ణంగల గ్రీన్‌లేండ్ జనాభా కేవలం 56,000 మాత్రమే! ప్రపంచంలోని అతి తక్కువ జనసాంద్రత గల గ్రీన్‌లేండ్‌లో 85% భూభాగం సదా మంచుతో కప్పబడి ఉంటుంది. మంచు లేని సముద్ర తీరంలోనే ఈ ద్వీపం చుట్టూ ప్రజలు నివాసాన్ని ఏర్పరచుకున్నారు.
 

17వ శతాబ్దం నించి దీని పాలనా వ్యవహారాలు డెన్మార్క్ చేతిలో ఉన్నాయి. 1979లో సొంత పార్లమెంట్, 2009లో స్వంత ప్రభుత్వం ఏర్పడ్డా ఈ దేశంమీద ఇంకా డెన్మార్క్ పట్టుపోలేదు. దీని రాజధాని నూక్ పట్టణం. గ్రీన్‌లేండ్‌లో తిమింగలాలని వీధుల్లోంచి, కొన్నిచోట్ల హోటల్ గదుల్లోంచే తిలకించవచ్చు. వేసవి అంతంలో అవి సముద్రతీరానికి వస్తాయి. పడవల్లో సముద్రంలోకి తీసుకువెళ్ళి తిమింగలాలని చూపిస్తారు. బ్లూవేల్, ఫిన్‌వేల్, స్పెర్మ్‌వేల్... ఇలా అనేకరకాల తిమింగలాలు అక్కడ సముద్రంలో జీవిస్తున్నాయి. ఇంకా సీల్స్, వాల్‌రుసెల్ కూడా గ్రీన్‌లేండ్ సముద్రంలో చూడచ్చు. ఒక్క సీల్ జంతువులే ఇరవై లక్షలు ఉన్నాయని అంచనా.
 

మంచులేని ప్రాంతాల్లో రీయిండీర్ జంతువులు నివశిస్తాయి. గ్రీన్‌లేండ్‌లో విమానాశ్రయంలో దిగాక హోటల్‌కి వెళ్తూంటే అతిపెద్ద మస్క్ ఆక్స్‌లు కనిపిస్తాయి. అక్కడ అవి మూడువేల పైనే ఉన్నాయి. వీటి చర్మాలతో చేసిన దుస్తులని ధరిస్తే చలి ఆగుతుంది. తూర్పు, ఉత్తర గ్రీన్‌లేండ్‌లో (పోలార్ బీర్లు) జీవిస్తున్నాయి. వీటినికూడా గ్రీన్‌లేండ్ ట్రిప్‌లో చూడచ్చు. ఈశాన్య గ్రీన్‌లేండ్ అంతా రక్షిత జాతీయపార్కు. దీని వైశాల్యం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వైశాల్యంతో సమానం! 1946లో గ్రీన్‌లేండ్‌ని అమెరికా డెన్మార్క్ నించి పది కోట్ల డాలర్లకి కొనాలని ప్రయత్నించి విఫలమైంది. మంచుమీద కుక్కలు లాగే స్లెడ్జ్ బళ్ళమీద ప్రయాణం మధురమైన అనుభవాన్ని ఇస్తుంది. రెండు వరసల్లో, వరసకి ఆరు కుక్కలు కలిసి ఓ స్లెడ్జ్‌ని లాగుతాయి. మార్చి, ఏప్రిల్ నెలలు మాత్రమే స్లెడ్జ్ బళ్ళ రైడ్‌కి అనుకూలం. ఐతే డిస్కో ఐలాండ్‌లో ఇది సంవత్సరమంతా సాధ్యం. కొన్ని గంటల నించి కొన్ని వారాలపాటు స్థానిక టూరిస్ట్ కేంద్రాలు స్లెడ్జ్ రైడ్స్‌ని ఏర్పాటుచేస్తారు. స్నోస్కూటర్స్ ఉన్నా చాలా ప్రాంతాల్లో అవి నిషిద్ధం.
 

మరో అద్భుతం మే 25నించి జూలై 25దాకా అక్కడ సూర్యుడు అస్తమించడు! ఆ సమయంలో ఇరవైనాలుగు గంటలూ వెలుగు కనిపిస్తూనే ఉంటుంది. అర్థరాత్రి సూర్యుడ్ని చూడగలగడం కేవలం ఒక్క గ్రీన్‌లేండ్‌లోనే సాధ్యం.
చిన్న విమానాల్లో ప్రయాణిస్తూ గ్లేసియర్స్ (మంచు)ని చూడటం, గ్రీన్‌లేండ్‌కి నీటిలో క్రూజ్‌లో ప్రయాణం కూడా పర్యాటకులు మిస్ కాకూడదు. తెల్లకొండల్లా కనపడే మంచురాళ్ళ మధ్య దారిచూసుకుంటూ ఓడ జిగ్‌జాగ్‌గా ప్రయాణిస్తూ ముందుకి సాగుతుంది. ప్రయాణికులంతా డెక్‌మీదే కూర్చుని ఆ మంచు కళాఖండాలని ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తూండిపోతారు. ఈ మంచుకొండలు సముద్రంలో 3-4 ఏళ్ళు ప్రయాణించాక క్రమంగా పూర్తిగా కరిగిపోతాయి.
 

ట్రెకింగ్, వౌంటెనీరింగ్, ఏంగిలింగ్ (చేపలు పట్టడం), కయాకింగ్ (బోటింగ్) కొన్ని పర్యాటక ఆకర్షణలు. గ్రీన్‌లేండ్ రాజధాని నూక్‌కి యూరప్‌నించి విమానంలో వెళ్ళచ్చు. కొపెన్‌హేగన్ నించి ఎక్కువ విమాన సర్వీస్‌లు ఉంటాయి. కెనడానించి 140 ఏళ్ళ క్రితం చాలామంది ఇక్కడికి వలస వచ్చారు. వీరి జనాభాలో 20%మంది గ్రీన్‌లేండ్ బయటే పుట్టారు. చేపల ఎగుమతి ప్రధాన ఆదాయం. డెన్మార్క్‌నించి గ్రీన్‌లేండ్‌కి విమానంలో కాని ఓడలో కాని చేరుకోవచ్చు. నాలుగు మాండలీకాలతో గ్రీన్‌లేండిక్ భాషని ప్రజలు మాట్లాడతారు. నూక్‌లోని నేషనల్ గ్రీన్‌లేండ్ మ్యూజియాన్ని చూడచ్చు. గ్రీన్‌లేండ్‌కి వెళ్ళే పర్యాటకులు సంఖ్య చాలా తక్కువ. 1993లో 5,000 మంది వెళ్తే 2002కి అది 32,000కి పెరిగింది. మనకి విభిన్నమైన వాతావరణం, ప్రకృతిని అనుభవించాలని అనుకునే వారికి గ్రీన్‌లేండ్ మంచి ప్రదేశం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top