తలనొప్పి రావడానికి కారణాలు, తలనొప్పిలో రకాలు, వాటి నివారణ

తలనొప్పిగా ఉంటే అదే పొతుందిలే అని ఊరుకుంటాం. మరీ ఎక్కువయితే చేతికందిన టాబ్లెట్ వేస్తాం. నిజానికి కొన్ని తలనొప్పులు ప్రాణాంతకంగా మారతాయని, న్యూరోఫిజీషియన్ సలహాతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవచ్చు.

నిత్య జీవితంలో మనకు తరచూ తలనొప్పి వస్తోంది. సాధారణంగా వచ్చే తలనొప్పి కదా అని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. అదే తగ్గిపోతుందిలే అని మనం డాక్టర్ సలహా కోసం వెళ్లకపోవడం సర్వసాధారణం. కానీ సాధారణంగా వచ్చే తలనొప్పి కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. తలనొప్పి రాగానే వెంటనే న్యూరో ఫిజిషీయన్‌ను సంప్రదించి, సత్వర చికిత్స చేయించుకోవాలి.

పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. తలనొప్పికి కారణాలేవైనా వాటి నివారణకు సత్వర చికిత్స చేయించుకోవాలి. లేకుంటే కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదముంది. తలనొప్పి రావడానికి కారణాలు, తలనొప్పిలో రకాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలేమిటో చూద్దాం.
 

బాధించే మైగ్రేన్
తలనొప్పిలో అనేక రకాలున్నాయి. ఇందులో మైగ్రేన్ (పార్శపు నొప్పి), టెన్షన్‌టైపు, క్లస్టర్, ప్రీ ఎమినల్ న్యూరాలియా తలనొప్పులు సాధారణంగా వస్తుంటాయి. ఏ తలనొప్పి వచ్చినా మనం స్కూలు, కళాశాల, లేదా కార్యాలయాలకు వెళ్లలేం. ఆ బాధతో రోజువారీ కార్యక్రమాలు సజావుగా చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. చాలా మందిలో మైగ్రేన్ తలనొప్పి సర్వసాధారణం. కండరాల ఒత్తిడి కారణంగా ఈ నొప్పి వస్తుంది.

పనిలో ఒత్తిడితోపాటు అవిశ్రాంతంగా, ఎక్కువ సేపు పనిచేయడం, నిద్రలేమి వల్ల ఈ నొప్పి వస్తుంది. నుదుటికి ఒకవైపు వచ్చే ఈ నొప్పికి కారణాలను న్యూరో ఫిజీషీయన్ ద్వారా తెలుసుకొని సత్వరం చికిత్స చేయించుకోవాలి. ఈ నొప్పి వల్ల రోగికి వాంతులు కూడా అయ్యే అవకాశముంది. సకాలంలో న్యూరో ఫిజిషీయన్‌ను సంప్రదించటం ద్వారా ఈ నొప్పిని మందుల ద్వారా సులభంగా నివారించవచ్చు.
 

టెన్షన్‌తో వచ్చే తలనొప్పి
నిత్య జీవితంలో ఎదురయ్యే టెన్షన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఒక దశలో ఇది భరించలేనంతగా పెరిగిపోతుంది. ఈ నొప్పి తలభాగం మొత్తం ఉంటుంది. ఎక్కువగా టెన్షన్ పడిన సమయంలో లేదా రోజంతా కూడా ఇలాంటి తలనొప్పి రావచ్చు. టెన్షన్ పెరిగినకొద్దీ ఈ నొప్పి మరింత తీవ్రమవుతోంది. ఇలాంటి తలనొప్పి సకాలంలో వైద్యుని సలహా తీసుకొని మందులు వాడితే తగ్గుతుంది. మూడవది క్లస్టర్ తలనొప్పి. ఈ క్లస్టర్ తలనొప్పి తక్కువగా వస్తుంది. ఈ నొప్పి నుదుటికి కుడి లేదా ఎడమ ఒక వైపు మాత్రమే వస్తుంది. తీవ్రంగా వచ్చే ఈ క్లస్టర్ తలనొప్పికి జన్యుపరమైన సమస్యలు ప్రధాన కారణం. దీన్ని న్యూరో ఫిజిషీయన్ సలహాపై మందులు వాడి నివారించవచ్చును.

నరాలపై ఒత్తిడితో...
నలభై ఏళ్ల వయసు దాటిన వారిలో నరాలపై పడిన ఒత్తిడి వల్ల వచ్చే నొప్పిని ప్రీ ఎమినల్ న్యూరాలియా అంటారు. ఈ నొప్పి సాధారణంగా నరాల మీద అధిక ఒత్తిడి పడినపుడు వస్తుంది. రోగి ముఖం పై భాగం లేదా కింది భాగం మొత్తం ఈ నొప్పి వస్తుంది. ఈ నొప్పి కరెంట్ షాక్‌లా ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పడు తట్టుకోవడం చాలా కష్టం.
 

ఇలాంటి నొప్పి వచ్చినపుడు రోగి తినడం, మంచినీళ్లు తాగడం, షేవింగ్ చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఆలా చేయడం వల్ల నొప్పి మరింత పెరుగుతోంది. ఇలాంటి నొప్పి వచ్చినపుడు రోగిని వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లి నొప్పి తీవ్రతను బట్టి మందుల ద్వారా కాని లేదా అవసరమైతే సర్జరీ ద్వారా చికిత్స చేయించాలి. కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా కూడా మారతాయి. మెదడు సంబంధ వ్యాధుల వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఆకస్మాత్తుగా అధికంగా వచ్చే తలనొప్పిని వైద్య పరిభాషలో సబ్ ఎరక్‌నాయడ్ హెమరేజ్ అంటారు.

మెదడులో రక్తనాళం చిట్లినందువల్ల ఈ తరహా తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి వచ్చినపుడు రోగి సృహ తప్పి పడిపోవచ్చు. ప్రమాదవశాత్తు మెదడుపై దెబ్బ తగిలినపుడు ఈ నొప్పి వస్తుంది. ఈ నొప్పి వచ్చిన వెంటనే రోగి ఆసుపత్రిలో చేరి మెడిసిన్ ద్వారా లేదా కొన్నిసార్లు అవసరాన్ని బట్టి సర్జరీ చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు.

ఇది కాకుండా బ్రెయిన్ ఫీవర్, బ్రెయిన్ ట్యూమర్‌ల వల్ల కూడా తలనొప్పి రావడానికి ఆస్కారం ఉంది. మెదడులో ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇన్‌ఫెక్షన్‌తో బ్రెయిన్ ఫీవర్ వచ్చినపుడు రోగికి తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి వల్ల రోగి సృహ కోల్పోయే ప్రమాదముంది. అందువల్ల రోగిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి సత్వర చికిత్స చేయించుకోవటం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చును.
Share on Google Plus