థాయ్‌ల్యాండ్ గురించి తెలుసుకుందామా......

థాయ్‌ల్యాండ్ భారతీయులకు బాగా తెలిసిన దేశం. క్రీస్తుపూర్వం అశోకుడి కాలంలో మన దేశం నుంచి బౌద్ధం వచ్చి స్థిరపడింది. ద్రవిడ పాలకులు వచ్చారు, మనశైలి రాజరికం, పాలన వ్యవస్థతోపాటు భారతీయ సంస్కృతిని కూడా పరిచయం చేశారు. మధ్యయుగంలో వ్యాపారులు వచ్చారు. అలా తరతరాలుగా ఇండియాతో అనుబంధం పెంచుకున్న ఈ నేల ఇటీవలి కాలంలో తరచూ వెండితెర మీద కనిపిస్తోంది. థాయ్‌ల్యాండ్ అనగానే పూరీ జగన్నాథ్ సినిమాలు గుర్తొచ్చేటంతగా, పూరీ సినిమా అంటే థాయ్‌ల్యాండ్ గుర్తొచ్చేటంతగా మనకు దగ్గరైంది ఈ దేశం. 

థాయ్‌ల్యాండ్ పర్యటన అనగానే రాజధాని బ్యాంకాక్, పట్టాయా బీచ్‌లు గుర్తొస్తాయి. పర్యాటకరంగం జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న ఈదేశంలో సరికొత్తగా తెరమీదకు వచ్చిన ప్రదేశం కౌయాయ్. థాయ్ టూరిజం మ్యాప్‌లో ప్రధానంగా చోటు చేసుకున్న కౌయాయ్ నేషనల్ పార్క్ పచ్చదనాల లోగిలి. 

మన ఆలయాలే కాదు మన పండుగలు కూడ!

నకోన్ రాచసీమ రాష్ట్రంలో క్రీ.శ 11వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం ఉంది. అందులోని శివ లింగం, నంది విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అక్కడికి 15 కి.మీల దూరంలో పిమాయ్ చారిత్రాత్మక పార్కు ఉంది. 11-12 శతాబ్దాల్లో నిర్మించిన ఈ నగరం పేరు వాస్తవానికి విమయపుర తరువాత కాలంలో విమయ, పిమాయ్‌గా మారింది. హిందూఖేమర్ వంశస్థులు నిర్మించిన ఈ నగరం కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం కోరట్. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన ఆదిమానవుల అవశేషాలను ప్రదర్శనలో ఉంచారు. దేశంలో సందర్శించాల్సిన మరో నగరం ఆయుతయ. ఇది కోరట్ - బ్యాంకాక్ మధ్య చావ్ ప్రాయా నది ఒడ్డున ఉన్న ప్రాచీన నగరం. ఆయతయ... మన అయోధ్య నుంచి వచ్చిందని అభిప్రాయం. ఈ నగరంలో చాయ్‌వతనరం బౌద్ధాలయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత ప్రధానమైనది. నాలుగు గోపురాల నడుమ 35 మీటర్ల ప్రధాన గోపురం నాటి నిర్మాణ శైలిని, నైపుణ్యాన్ని కళ్ళకు కడుతోంది. థాయ్‌ల్యాండ్ పండుగల్లో సోంక్రన్, లోయ్‌క్రతాంగ్ ప్రధానమైనవి. ప్రాచీన థాయ్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరాదిన అంటే ఏప్రిల్ ఒకటోతేదీన మొదలయ్యే సోంక్రన్ మన హోలీ లాంటిదే. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ మూడురోజులపాటు ఉత్సాహంగా జరుగుతుంది. అలాగే లోయ్ క్రతాంగ్ పండుగ మన బతుకమ్మ, కార్తీక పౌర్ణమి వేడుకల్ని గుర్తు చేస్తుంది. అరటి దొప్పలో ఆకులు, పూలు, క్యాండిల్స్ అమర్చి నీటిలో వదులుతారు. 


ద్రాక్ష తోటల నిలయం!

దేశంలో వ్యవసాయానికి, పశుసంపదకు ప్రసిద్ధి పొందిన ప్రదేశం కూడా కౌయాయ్ రీజియన్ మాత్రమే. ప్రత్యేక వాహనాల్లో వైన్ యార్డు మొత్తం తిరిగి చూడవచ్చు. కౌయాయ్ డెయిరీ ఫామ్స్‌కి కూడా ప్రసద్ధి. చోక్‌చాయ్ ఫామ్ ఆసియాలోకి పెద్దది. 50 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఫామ్ గొప్ప పర్యాటక ప్రదేశం కూడ. సాధారణ పర్యాటకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు... ఏడాదికి కనీసం మూడు లక్షల మంది సందర్శిస్తారు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ బయోడీజిల్, ఐస్‌క్రీమ్ వంటి పాల ఉత్పత్తులు తయారుచేసే చోక్‌చాయ్ ఫామ్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సందర్శకుల బస కోసం అత్యాధునిక గుడారాలు, వినోదం కోసం కౌబాయ్ షోవంటి వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లు ఉన్నాయి.

పర్యాటక ప్రధానంగా వసతులు!

థాయ్‌లో పట్టాయాలో బీచ్ రిసార్టులు, హోటళ్లు ఉన్నట్లే కౌయాయ్‌లో రిసార్టులు పచ్చటి చెట్లు, పర్వత శ్రేణుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ప్రతి రిసార్ట్, హోటల్ పర్యాటకుల వినోదాల కోసం ఏదో ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. అమ్యూస్‌మెంట్ పార్కులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ ఫూల్స్, కౌబాయ్ షోలవంటి వినోద కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. అరడజనుపైగా గోల్ఫ్ మైదానాలు ఉన్నాయి. దారిపొడవునా ప్రీమియం ఔట్‌లెట్స్, లోటస్ మాల్స్ వంటి షాపింగ్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడి పాలియో షాపింగ్ మాల్‌లో ఏదీ కొనకుండా విండో షాపింగ్ చేయడమూ చక్కని అనుభవమే. కౌయాయ్ ప్రాంతంలోనే ఉన్న డాన్‌క్వియాన్ ప్రాంతం ‘పాటరీ’కి ప్రసిద్ధి. 

మరకతపు బుద్ధుడు!

థాయ్ టూర్‌లో మరో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఎమరాల్డ్ బుద్ధుడిని చూడడం. వాట్ ప్రాకయో (ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం) కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. పచ్చని గ్రానైట్ రాతితో నిర్మించిన బుద్ధుడి విగ్రహం ఇక్కడ ప్రతిష్టించారు. ఈ విగ్రహం శతాబ్దాల క్రితం భారతదేశం నుంచి కాంబోడియా, లావోస్, వియత్నాం దేశాలగుండా చేతులు మారుతూ బ్యాంకాక్ చేరింది. బౌద్ధులు జీవితంలో ఒక్కసారైనా మరకతపు బుద్ధుడిని దర్శించుకోవాలనుకుంటారు. ఈ ఆలయం బ్యాంకాక్‌లో చావ్‌ప్రాయ నది ఒడ్డున ఉంది. ఈ నదికి మరో ఒడ్డున నిర్మించిన వాట్ అరుణ్ దేవాలయం మరో అద్భుత కట్టడం. 79 మీటర్ల పొడవైన పగోడా సూర్యకాంతితో మిలమిలా మెరుస్తూంటుంది. ఇటాలియన్‌శైలిలో ఉన్న థాయ్ రాజప్రాసాదం ఆనంద సమక్రోమ్ కూడా చూసి తీరాల్సిన కట్టడమే. బ్యాంకాక్‌లో చూడాల్సిన అనేక విశేషాల్లో జిమ్ థామ్సన్ హౌస్ మ్యూజియం, సువాన్ పక్కడ్ ప్యాలెస్ మ్యూజియం ఉన్నాయి. సువాన్ పక్కడ్ మ్యూజియం ప్రాచీన థాయ్ ఇళ్ల నిర్మాణాన్ని అనుసరించి ఉంటుంది. రాజవంశస్తులు దేశ, విదేశాల నుంచి సేకరించిన అనేక వస్తువులు ఇందులో ఉన్నాయి. బ్యాంకాక్‌లో షాపింగ్ సెంటర్లలో ప్రముఖమైనది ఆసియాటిక్ షాపింగ్ సెంటర్. ఇది కూడా చావ్‌ప్రాయ నది ఒడ్డునే ఉంది. ఇందులో వందల షాపులు, అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే పహూరత్ బాంబే మార్కెట్ కూడ. ఇది థాయ్‌లాండ్‌కు వలస వెళ్లిన భారతీయులు ఏర్పాటు చేసుకున్న మార్కెట్.

థాయ్‌లాండ్‌లో వాతావరణం మన వాతావరణాన్నే తలపిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యటనకు మన వాళ్లు ప్రత్యేక దుస్తులవంటి ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. థాయ్‌లాండ్‌లో టూరిజం ముఖ్యమైన పరిశ్రమ, అక్కడి వారు టూరిస్టుల పట్ల ఆదరాభిమానాలు చూపిస్తారు. గొడవలు ఏమున్నా పార్లమెంటుకే పరిమితం. టూరిస్టులు నిర్భయంగా దేశంలో ఎక్కడైనా పర్యటించవచ్చు అని థాయ్‌లాండ్ టూరిజం అథారిటీ ప్రకటించింది. 

కౌయాయ్ 

నేషనల్ పార్కులో... పర్వతశ్రేణులు, దట్టమైన అడవులు, జలపాతాలు, సెలయేళ్లు, క్రూరమృగాల సంచారం, అరుదైన పక్షుల కిలకిలరవాలు, ఆది మానవుల అవశేషాలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంటే... అత్యాధునికతకు ప్రతీకగా హాలిడే రిసార్ట్స్, గోల్ఫ్ కోర్టులు ఉన్నాయి. టూరిస్టుల కోసం క్యాంపింగ్, నైట్ సఫారీ, ట్రెకిగ్‌కు ఏర్పాట్లు ఉన్నాయి. హనీమూన్ కపుల్‌ని అలరించే బ్యూటిఫుల్ స్పాట్‌లతోపాటు పిల్లలతో వచ్చిన కుటుంబాలు సేదదీరే సౌకర్యం ఉన్న ప్రదేశం కౌయాయ్. ఈ పార్క్ పురావస్తు పరిశోధన, ప్రాచీన కళలు, నిర్మాణం వంటి అంశాలపై ఆసక్తి ఉన్న వారికి సరైన గమ్యస్థానం కూడ. కౌయాయ నేషనల్ పార్క్ నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 

ఔషధీయ మర్దన!

బ్యాంకాక్‌లో ఏ వీధిలో చూసినా మసాజ్ సెంటర్లు కనిపిస్తాయి. ఇది వారి సంప్రదాయ వైద్యవిధానం. థాయ్‌ల్యాండ్ మసాజ్ సెంటర్ల మీద మన వాళ్లకు ఏ అభిప్రాయం ఉన్నా థాయ్ వాసులు మాత్రం దాన్ని పవిత్రంగా భావిస్తారు. మనం కేరళ ఆయుర్వేద మసాజ్‌ను గౌరవించినట్లు. 

ఇలా వెళ్లాలి!

థాయ్‌లాండ్ వెళ్లాలంటే వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. వెట్ బ్యాగ్రౌండ్‌లో తీసిన రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రెగ్యులర్ కౌంటర్‌లో 1000 బాత్‌లు లేదా తత్కాల్ కౌంటర్‌లో 1200 బాత్‌ల ఫీజు చెల్లించాలి. డబ్బును రెండుమూడు వేల బాత్‌లుగా, మిగిలినది డాలర్లుగా తీసుకువెళ్ళటం మంచిది. దేశంలో కరెన్సీ ఎక్స్చేజ్ సెంటర్లు చాలా ఉన్నాయి. డాలర్లను క్షణాల్లో థాయ్ బాత్‌లుగా మార్చుకోవచ్చు. థాయ్ బాత్ విలువ దాదాపు గా రూపాయి ఎనభై పైసలు. నాలుగు రోజుల ట్రిప్‌కు ఒక్కరికీ 20 నుంచి 25 వేల రూపాయవుతుంది. హోటల్ రెంట్ రోజుకు వెయ్యి నుండి ఆరేడు వేల వరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం థాయ్‌లాండ్ టూరిజం అథారిటీ (TAT) వెబ్‌సైట్ చూడవచ్చు. 

థాయ్ సంప్రదాయ నాట్యం లికాయ్. ఈ కళాకారులు బౌద్ధాలయాల్లో ప్రదర్శనలిస్తారు. ఈ నాట్యం చేసేటప్పుడు కళాకారుల వస్త్రధారణ, కథాంశం అన్నీ భారతీయతను పోలి ఉంటాయి. మన సంస్కృతి విస్తరించిన నేల అనిపిస్తుంది.
Share on Google Plus