ఆర్థరైటిస్‌ - Arthritis



ఆరోగ్యకరమైన జీవనంతో ఆర్థరైటిస్‌దూరం

డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తే ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఆల్కహాల్ మానేయడం చేయాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మూలంగా మంచి ఫలితం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పులు వ్యాయామం వల్ల తగ్గుతాయి.
వయసు పైబడిన వారిలో కనిపించే సాధారణ సమస్య ఆర్థరైటిస్. ఇటీవలి కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య కూడా ఇదే. ఒక్కసారి ఆర్థరైటిస్ బారిన పడితే జీవితాంతం నొప్పులు వేధిస్తూనే ఉంటాయి.

అయితే క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తే ఆర్థరైటిస్ ఉన్నా హాయిగా జీవనం సాగించవచ్చంటున్నారు సీనియర్ రుమటాలజిస్ట్ డాక్టర్ ఎ.ఎన్. రాయ్. ఈ నెల 12న వరల్డ్ ఆర్థరైటిస్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఆ వ్యాధికి సంబంధించిన వివరాలు ఆయన మాటల్లోనే...

జాయింట్లలో ఏర్పడే వాపు, తీవ్రమైన నొప్పినే ఆర్థరైటిస్ అంటారు. జాయింట్లలో నొప్పితో ప్రారంభమై కాళ్లు, చేతులు కదల్చలేని స్థితికి దారితీస్తుంది. ఆర్థరైటిస్‌లో చాలా రకాలున్నాయి. ఇప్పటికే 100 రకాల ఆర్థరైటిస్‌లను గుర్తించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇందులో కొన్ని రకాల ఆర్థరైటిస్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

వంశపారపర్యంగా, ఇతర ఇన్‌ఫెక్షన్ల మూలంగా, వ్యాధి నిరోధక శక్తి అతిగా స్పందించడం వల్ల వచ్చేది రుమటాయిడ్ ఆర్థరైటిస్. కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల ఆస్టియోఅర్థరైటిస్ ఏర్పడుతుంది. దీనిమూలంగా తీవ్రమైన నొప్పి, కూర్చోవడం, నడవటం కష్టంగా మారుతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం మూలంగా కీళ్లవాతం (గౌట్) వస్తుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్
జాయింట్లలో వచ్చే తీవ్రమైన నొప్పినే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది చేతులు, పాదాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకలు, కండరాలు, లిగ్మెంట్‌లపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. నొప్పి, వాపు, నొప్పి ఉన్న చోట ఎర్రగా మారడం, కీళ్లు బిగుసుకుపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇది అటోఇమ్యూన్ వ్యాధి.

అస్టియోఆర్థరైటిస్
జాయింటుల్లోని కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఇది. మధ్య వయస్కుల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఎక్కువగా తుంటి, వెన్నెముక, పాదం, చేతుల్లోనూ, వేళ్లలోనూ, మోకాలి జాయింటుల్లోనూ ప్రభావం చూపిస్తుంది. కీళ్లు బిగుసుకుపోవడం, మోకాళ్లపై ఒత్తిడి భరించలేకపోవడం, విపరీతమైన నొప్పి, వాపు, కదల్చలేకపోవడం, నడవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

కీళ్లవాతం
శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కీళ్లవాతం వస్తుంది. శరీర కణజాలాల్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల తీవ్రమైన కీళ్లనొప్పులు మొదలవుతాయి. ముఖ్యంగా జాయింట్స్ దగ్గర చిన్న స్పటికాల మాదిరిగా యూరిక్ యాసిడ్ పేరుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ పేరుకుపోతుందో జాయింట్‌లో నొప్పి, వాపు ప్రారంభమవుతుంది.

ఎస్.ఎల్.ఇ(సిస్టెమిక్ ల్యూపస్ ఎరిథెమటోసస్) ఇది అటో ఇమ్యూన్ వ్యాధి. శరీరంలో వివిధ రకాల కణాల మూలంగా నొప్పి ఏర్పడుతుంది. శరీరంలోని కణాలు రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, జాయింట్లపై కూడా ఉంటుంది.

అంకైలోజింగ్ స్పాండిలైటిస్
వెన్నులో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. దీర్ఘకాలం పాటు ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే వెన్ను దెబ్బతింటుంది. వెన్ను కదలలేని స్థితి ఏర్పడుతుంది.

నివారణ
రక్తపరీక్షలు, ఎక్స్‌రే ద్వారా ఆర్థరైటిస్‌నుగుర్తించవచ్చు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారు తరుచుగా చెకప్ చేయించుకోవడం మూలంగా మంచి ఉపయోగం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు క్రమంతప్పకుండా మందులు వాడటం ద్వారా వ్యాధి లక్షణాలను తగ్గించుకోవచ్చు.

బరువు నియంత్రణలో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఆల్కహాల్ మానేయడం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మూలంగా మంచి ఫలితం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పులు వ్యాయామం వల్ల తగ్గుతాయి. స్విమ్మింగ్, వ్యాయామం వల్ల ఎక్కువ శక్తి, మంచి నిద్ర లభిస్తాయి.

ప్రస్తుతం ఆర్థరైటిస్‌కు మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకే ఇంజక్షన్ ద్వారా అస్టియోఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులను దూరం చేసే వీలుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ సలహా మేరకు మందులు వాడితే ఆర్థరైటిస్ ఉన్నా హాయిగా జీవనం సాగించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top