విజయాల దేవి అది పరాశక్తి - Dasara

విజయాల దేవి అది పరాశక్తి

‘దసరా’ పండుగ శక్తి ఆరాధకులకు ఎంతో ప్రశస్తమైంది. శరత్కాలంలో వచ్చే ఈ పండుగను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. చివరి రోజైన ‘దశమి’ తిథితో కలుపుకుని మొత్తం పది రోజులు దసరా పండుగ జరుపుకుంటాం. పవిత్రమైన ఈ పుణ్యదినాల్లో వరకు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తాం. కాబట్టి, ఈ పండుగను ‘దేవీనవరాత్రులు’ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాల్లో చెప్పబడింది.
దుర్లభం సర్వజన్తూనాం దేవీపూజా ఫలాధికా
దుర్గాలకీ మహాదేవ్య: పూజనీయా: ప్రయత్నత:
ఆశ్వయుజాస్మి సంప్రాపె్తై ప్రతిపచ్చుభవాసరే
తదారభ్య ప్రయత్నేన నవరాత్రి పూజయేత్‌
అంటే, శరన్నవరాత్రులలో దేవికి చేసే పూజ ఎంతో పుణ్య ఫలాన్నిస్తుంది. ఈ రోజుల్లో అమ్మ వారికి పూజ చేసే అవకాశం ఎంతో పుణాత్ములకు మాత్రమే దక్కుతుంది. కాబట్టి శరన్నవ రాత్రులలో దుర్గ, లక్ష్మి, సరస్వతీ స్వరూపిణియైన దేవిని పూజించాలని పెద్దలు చెప్పారు. ఒక వేళ తొమ్మిది రోజుల పాటూ అమ్మవారిని పూజించలేనివారు, కనీసం ముఖ్యమైన నాలుగురోజులైనా పూజించాలి. ఆ ముఖ్యమైన నాలుగు రోజులు...
1. మూలానక్షత్రం : ఇది అమ్మవారి జన్మనక్షత్రం. కాబట్టి, ఆరోజు తల్లిని మహా సరస్వతీదేవిగా భావించి అర్చించుకోవాలి.
2. దుర్గాష్టమి : ఆ తల్లి దుర్గమాసుర సంహారం చేసిన రోజు. కాబట్టి, దుర్గాదేవిగా ఆ తల్లిని అష్టమి తిథినాడు పూజించాలి.
3. మహర్నవమి : లోకకంటకుడైన మహిషాసురుడిని వధించి, ఆ తల్లి మహిషాసురమర్ధినిగా వెలసిన రోజు కాబట్టి, నవమి తిథినాడు దుర్గమ్మను మహిషాసురమర్ధినిగా పూజించాలి. ఈరోజునే ఆయుధపూజ కూడా చేసుకోవాలి.
4. విజయదశమి : దేవీ శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజు విజయదశమి.
ఆశ్వినస్వసితే పక్షే దశమ్యాంతరకోదయే
సకాలో విజయోనామ సర్వకామార్థ సాధక :
అంటే ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిరోజు నత్ర దర్శనకాలం (సాయంత్రం) ఏదైతే ఉందో ఆ కాలానికి ‘విజయం’ అని పేరు. మన పనులన్నింటిలో విజయాన్ని ప్రసాదించే ఆ కాలం పేరు మీదుగానే, ఈ తిథికి ‘విజయదశమి’ అనే పేరు వచ్చింది. అందుకే విజయాలను చేకూర్చే అమ్మవారిని శరన్నవరాత్రుల నమయంలో వివిధ రూపాలతో ఆలంకరించి. అర్చించి, ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఇలా అమ్మవారిని అలంకరించడం వెనుక ఎంతో అర్థం పరమార్థముంది. తొలిరోజు పాడ్యమినాడు దుర్గాదేవిగా పూజించి, ఆశ్వయుజ శుద్ధ విదియతో ఈ అలంకరణ మహోత్సవం ఆరంభమై ఆశ్వయుజ శుద్ధ దశమితో, తొమ్మిది రోజుల పాటూ మహా వైభవంగా జరుగుతుంది. బాలా త్రిపురసుందరి, లలితా త్రిపురసుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి, దుర్గాదేవి, మహిషాసుర మర్ధని, రాజరాజేశ్వరీ దేవి అంటూ అమ్మవారు తొమ్మిది రూపాలతో భక్తులకు సాక్షాత్కరించి, కరుణిస్తుంది.
శ్రీ బాలాత్రిపురసుందరీదేవి

శరన్నవరాత్రులలో రెండవ రోజైన ఆశ్వ యుజ శుద్ధ విదియ నాడు, అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకరి స్తారు. త్రిపురాత్ర యంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. అందుకే శ్రీ విద్యోపాసకులకు ముందుగా బాలా మంత్రాన్నే ఉపదే శిస్తారు. బాలా మంత్రో పదేశం లేని వారు శ్రీ చక్రార్చన చేయడా నికి అనర్హులు. ఎందుకంటే మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీ చక్రంలో మొదటి అమ్నాయంలో ఉం డే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా ఈ బాలాదేవి అనుగ్రహం పొందిన తరువాతే, మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహానికి పాత్రులమవుతాం. ఆ తల్లి అనుగ్రహం అర్చకులకే కాదు. అర్చన చేయించేవారికి కూడా కావాలి కదా! అందుకే ఆ దేవి స్వరూపం ఎలా ఉంటుందో భక్తు లందరికీ తెలియడం కోసం ఈ అలంకారం చేస్తారు. అంతేకాదు. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. అందుకే బాలాత్రిపుర సుందరిని క్రింది శ్లోకంతో ధ్యానించాలి.
అరుణ రణజాలై రంజితాసావకాశా
విధృత జపపుటీకా పుస్తకా భీతిహస్తా
ఇతరవర కరాఢ్యా పుల్లకల్హర సంస్థా
నివసతుహృదిబాలా నిత్య కల్యాణశీలా
ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయైనమ:
 శ్రీ లలితా త్రిపురసుందరీదేవి

మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు, అమ్మవారిని లలితా ప్రతిపురసుందరీ దేవిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయంలో రెండవశక్తి ఈమె. త్రిమూర్తుల కంటె ముందునుంచి ఉన్న శక్తి కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబ డుతోంది. ఈ తల్లి శ్రీ చక్ర అధిష్టాన శక్తి గా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవత గా, తనను కొలిచే భక్తులను అనుగ్రహి స్తోంది. శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూ డా ఈ లలితాత్రిపుర సుందరీదేవే. ఘోర మైన దారిద్య్ర బాధల నుంచి విముక్తి కలిగించి, మనకు మహదైశ్యర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాదేవి.
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో లలితాదేవి ఆలంకారాన్ని, లలితా సహస్రనామ స్తోత్రం లో వర్ణించినట్లుగా ‘‘సచామర రమావాణీ విరాజితా’’ అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటు నిలుచుని, లలితా పరాభట్టారికని వింజామరలతో సేవిస్తున్నట్లుగా అలం కరిస్తారు. మధ్యలోనున్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చెరకుగడను ధరించి, శివుడి వక్షస్థలం మీద కూర్చుని, అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. శ్రీ లలితా త్రిపురసుందరీదేవిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.
ప్రాత:స్మరామి లలితా వదనారావిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యాం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌
ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతాయైనమ:
శ్రీ గాయత్రీ దేవి

నాలుగవ రోజైన ఆశ్వయ శుద్ధ చవితినాడు, అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొందిన గాయత్రీదేవి, ముక్తా విద్రు మహేమ నీలధవళ కాంతులతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావం దన అదిష్ఠాన దేవత, గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. గాయత్రీ మంత్రం రెండు విధాలు. ఒకటి లఘు గాయత్రీ మంత్రం, రెండవది బృహద్గాయత్రీ మంత్రం. ప్రతి రోజూ త్రికాలం సంధ్యావందనం చేసి, ఆ గాయత్రీదేవి మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే, ఆ తల్లి అనుగ్రహంతో పాటూ వాక్సుద్ధి కలుగుతుంది.
‘‘గాయంతాం రయతీతి గాయత్రి’’ అంటే (తన రూపాన్ని) గానం చేసేవారిని రక్షించేది అని అర్థం. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో ‘వాగ్వైగాయత్రీ’ అని చెప్పబడింది. అంటే మనం మాట్లాడే వాక్కే గాయత్రి. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలమైన దేవతగా, ఆ తల్లి మంత్రంతో అన్ని దేవతామంత్రాలకు అనుబంధం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మం త్రాలతో గాయత్రిని చేర్చి, రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణుగాయత్రి అని గాయత్రీ మం త్రాన్ని కలిపి చెబుతారు. సమస్త దేవతలకు నివేదన చేయ బోయే పదార్థాలన్నీ గాయత్రీ మం త్రంతో సంప్రోక్షణచేయబడిన తర్వాతే ఆయా దేవుళ్ళకు నివేదన చేయబడతాయి. అంతటి మహత్తర శక్తి కలిగిన గాయత్రీదేవి శరన్నవరాత్రులలో ఐదు ముఖాలతో, వరదాభయ హస్తా లతో, కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. ఆ మాతను క్రింది శ్లోకంతో ధ్యానం చేయాలి.
ఓం బ్రహ్మస్త్ర కుండికా హస్తాం
శుద్ధ జ్యోతి స్వరూపిణీం
సర్వతత్త్వమరుూం వందే
గాయత్రీం వేదమాతరమ్‌
ఓం శ్రీ గాయత్రీదేవతాయైనమ:
శ్రీ అన్నపూర్ణాదేవి

ఐదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమినాడు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వ జీవాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూ ర్ణ. నిత్యాన్న దానేశ్వరిగా, నిటలాక్ష ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి సకల జీవరాశు లకు ఆహారాన్ని ప్రసాదిస్తోంది. జీవకోటికి ఆహారాన్నందించే అన్నపూర్ణాదేవి నిజ అవాసం ఆది స్మశానమైన వారణా సి క్షేత్రం. ఆ క్షేత్రాధిష్ఠాన దేవుడైన ఆదినాథుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆమెనే కాశీ అన్నపూర్ణేశ్వరీ అని పిలుస్తారు. అన్నపూర్ణాదేవి కూడ అమ్మవారి దివ్వ స్వరూపాల్లో ఒకటి.

సాక్షాత్‌ తన భర్త అయిన పరమేశ్వరుడే అదిభిక్షువుగా యాచనకు వస్తే, అన్నపూర్ణమ్మ ఆయనకు భిక్షము ప్రసాదిస్తుంది. ఆకలితో యాచించిన తన భర్తకే అన్నాన్ని సమర్పించిన ఆ తల్లి, సమస్త జీవులకూ తల్లిగా కడుపునింపుతోంది. అందుకే అన్నార్తులై వచ్చే వారందరినీ మనం సాక్షాత్‌ శివ స్వరూపంగా భావించాలి. మనం అలా భావించిన మరుక్షణం, అన్నార్తుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలమవుతాం. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదంటారు. ఈ సత్యాన్ని మనకు సుబోధకపరిచేందుకు అమ్మవారికి అన్నపూర్ణా దేవిగా అలంకరణ. ఆ తల్లిని క్రింది శ్లోకంతో ధ్యానించాలి.
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
ప్రాయాచల వంశ పావనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ
ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయై నమ:
శ్రీ సరస్వతీదేవి

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మూలానక్షత్రం నాడు, అమ్మవారిని సరస్వతీదేవిగా ఆలంకరిస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి, త్రిశక్తులలో ఒక శక్తియైన సరస్వతి, మానవులకి సకల విద్యలను ప్రసాదించి జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి. చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, మహాసరస్వతి అనే ఏడు రూపాల్లో ఉంటుందని ‘మేరు తంత్రం’లో చెప్పబడింది. ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి అనే రూపాల్లో గోచరిస్తుంది. దసరా పది రోజుల్లో వేసే అన్ని అలంకారాలకన్నా, శ్రీ సరస్వతీదేవి అలంకారానికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే, అమ్మవారి జననక్షత్రమైన మూలానక్షత్రం రోజున ఈ అలంకారం చేస్తారు. ఆ తల్లిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.
సరస్వతీ సమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమేసదా
ఓం శ్రీ సరస్వతీ దేవతాయై నమ:
శ్రీమహాలక్ష్మీ దేవి

ఏడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా ఆలంకరిస్తారు. దుర్గాసప్తశతి అంతర్గతమైన దేవీ చరిత్రలో ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మీ మహాసరస్వతి అనే రూపాలను ధరించి దుష్ట సంహారం చేసినట్లు చెప్పబడింది. ఈ మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అపరిమితమైన పరాక్రమాన్ని చూపించి, మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి, మహిషాసుర మర్ధినిగా ప్రసిద్ధి పొందింది. తలచినంతనే అష్ట రూపాలతో సాక్షాత్కరించి, ఈ శరన్నవరా త్రులలో అష్ట సిద్ధులను ప్రసాదించే మహాలక్ష్మీదేవి, తన రెండు చేతుల్లో కమలాలను ధరించే వరదాభయహస్తాలతో, గజరాజు తనను కొలుస్తుండగా, కమలాసీనురాలుగా దర్శనమిస్తుంది. ఐశ్వర్య ప్రదయైన ఆ తల్లిని స్తుతించే శ్లోకాన్ని క్రింది విధంగా ప్రార్థించండి.
సిందూరాభాంద పద్మస్థాం పద్మప్రపంచ దర్పణం
అర్ఘ్యప్రాపంచ దధతీం సద్భార మకుటాన్వితాం
నానా దాసీ పరివృతాం కాంచీ కుండల మండితాం
లావణ్య భూమికాం వందే సందరాంగద బహుకాం
ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమ:
శ్రీ దుర్గాదేవి

ఎనిమిదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమినాడు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. ‘దు:ఖేన గంతుంశక్యతే ఇది దుర్గా’ అని అన్నారు. అంటే, దుర్గతులను దూరం చేసేది దుర్గాదేవి. అటువంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి తిథిరోజున రురుకుమారుడైన దుర్గముడైన రాక్షసుడిని సంహరించింది. ఈ దుర్గాదేవి ఆదిప్రకృతి. పంచ మహా స్వరూపాల్లో మొదటిది. ఈ తల్లి శక్తి అనంతం. అందుకే వివిధ మంత్ర, తంత్రం గ్రంథాల్లో, వివిధ రకాల దుర్గా దేవి స్వరూపాలు మనకు గోచరిస్తాయి. వీటిలో ఏ రూపాన్ని ధ్యానించినా, ఆ తల్లి మనలను అనుగ్రహిస్తుంది.
మనలను సమస్త దుర్గతుల నుండి రక్షించే దుర్గాదేవి మంత్రాన్ని నిత్యం వినయపూర్వకంగా జపిస్తే, సమస్త గ్రహ బాధలు, దుష్టగ్రహ బాధలన్నీ తొలగుతాయి. ఈ శరన్నవరాత్రుల్లో శార్దూల వాహినిగా, చేతిలో త్రిశూలాన్ని ధరించిన శక్తి స్వరూపిణిగా, శ్రీ దుర్గాదేవిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.
దుర్గేస్మృతాహరసిభీతి మశేషజంతో:
స్వస్థై: స్మృతామతిమతీవ శుభాందదాసి
దారిద్య్ర దు:ఖ భయహారిణి కాత్వదాన్యా
సర్వోపకార కరణాయ యధార్థ చిత్తా
ఓం శ్రీ దుర్గాదేవతాయై నమ:
శ్రీ మహిషాసుర మర్థిని

తొమ్మిదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమినాడు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్ధినిదేవిగా అలంకరిస్తారు. శరన్నవరాత్రులలో ఆఖరి రోజ నవమి. దీనినే మహర్నవమి అని అంటారు. చండీసప్తశతిలో మహలక్ష్మి రూపిణి అయిన దుర్గాదేవి అష్టభుజాలతో, దుష్టరాక్షసుడైన మహిషాసురుడిని చంపి లోకాలన్నింటికీ మేలు చేసింది. నవమి రోజున ఆ తల్లి రాక్షసుడిని సంహరించింది. కాబట్టి, మహర్నవమి అని అన్నారు. సింహవాహినియైన శక్తి వికటాట్టహాసం చేసి, మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కలుడు, బిడాలుడు వంటి రాక్షసులందరినీ సంహరించింది. మహిషాసుర మర్ధినీదేవి శరన్నవరాత్రి అలంకారాల్లో సింహవాహనంపై అలీఢ పాద పద్ధతిలో ఒకచేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంతో దర్శనమిస్తుంది. ఆ తల్లి ధ్యానం.
అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింద్య విరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే
ఓం మహిషాసుర మర్ధిని దేవతాయైనమ:
శ్రీ రాజరాజేశ్వరీదేవి

పదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ దశమినాడు, అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు. షోడశ మహా విద్యా స్వరూపిణీ, మహాత్రిపుర సుందరీ, శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరీదేవి. దేవీనవరాత్రులు ముగిసిన తరువాత జరుపుకునే విజయదశమి, అపరాజితాదేవి పేరుమీద ఏర్పడిందని పండితులంటారు. ఆది ప్రకృతి స్వరూపిణియైన దురా ్గదేవి, వివిధ కల్పాలలో వివిధ రాక్షసులను, వివిధ రూపాలు ధరించి సంహరించి లోకాలను రక్షించింది. ఇలా ఆమెకు ఎక్కడా ఆపజయం లేదు. కాబట్టి అపరాజితాదేవి అయింది. అత్యంత మహిమోపేతమైన శ్రీచక్ర అధిష్టాన దేవత. శ్రీ లలితాదేవే శ్రీ రాజరాజేశ్వరి. శ్రీ మన్మణిద్వీప శ్రీనగరస్థితి చింతామణి గృహం ఆ తల్లి నివాసం. అక్కడ సమస్తాంగా యుధావరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా, శ్రీ మహాకామేశ్వరుడి అంకాన్ని నిలయంగా చేసుకుని ఉంటుంది. అటువంటి ఆదిపరాశక్తి మహాత్రిపుర సుందరి శ్రీరాజ రా ేశ్వరి పరాభట్టారికాదేవి. పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడను చేతిలో ధరించి, ఒక చేత అభయ ముద్రతో దర్శనమిస్తుంది. అది ప్రకృతి రూపిణి అయిన ఆ తల్లి ధ్యానం.
అంబా శాంభవి చంద్రమౌళి అబలా అపర్ణా ఉమాపార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవ్వనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవతాయైనమ:
శుక్రవారం నుండి దసరా ప్రారంభం. దేవీ నవరాత్రులలో ఆయా దినాలలో వచ్చే నక్షత్రాలను అనుసరించి కొందరు అమ్మవారిని సంబంధిత రూపంలో అలంకరిస్తుంటారు. ఇలా శరన్నవరాత్రులలో అమ్మవారిని అలంకరించి సకల శుభాలను పొందుతారు భక్తులు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top