మనోహరం... ధనుర్మాసం


శ్రీరంగనాథుడిని మనోరథునిగా భావించిన పరమభక్తురాలు గోదాదేవి. గొప్ప ప్రేమతో, ఆరాధనతో ఆ స్వామిని తన స్వామిని చేసుకున్న ప్రేమమూర్తి ఆమె. కలియుగం ప్రారంభంలో భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి మార్గశిరమాసంలో శ్రీరంగని కోసం ఆచరించిన వ్రతమే ధనుర్మాసవ్రతం. భక్తి, ఆరాధన మార్గాలే కాదు ప్రేమమార్గం ద్వారా కూడా ఆ పరంధాముడిని చేరుకోవచ్చని నిరూపించింది గోదాదేవి. ఈ నెల 16నుంచి ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా...

               వేదాల్లో సామవేదం, మాసాల్లో మార్గశిరం తనకు అత్యంత ప్రీతిపాత్రమైనవంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. సూర్యుడు వృశ్చికరాశి నుంచి ధనూరాశిలోకి ఈ మార్గశిర మాసంలోనే మారతాడు. ఈ ప్రత్యేకతలతో మార్గశిరం పుణ్యమాసంగా వాసికెక్కింది. సూర్యభగవానుడు ధనూరాశిలో ప్రవేశించిన నాటినుంచి 30రోజుల కాలాన్ని ధనుర్మాసం, ధనుస్సంక్రమణ కాలం అని పిలుస్తారు. మాధవునికి మనోహరమైనది ఈ ధనుర్మాసం. ఈ మాసంలోనే శ్రీరంగనాథుని భర్తగా పొందడానికి గోదాదేవి ధనుర్మాస వ్రతం చేసింది. శ్రీ రంగనాథుని ప్రసన్నం చేసుకుంది.

ఆముక్తమాల్యద
కర్కటే పూర్వ ఫల్గుణ్యాం - తులసీ కాననోద్భవామ్
పాణ్డే విశ్వంభరాం గోదాం - వందే శ్రీరంగనాయకీమ్.
పుష్పమాల కైంకర్య తత్పరులైన పెరియాళ్వారులు అనే మహాత్ములు శ్రీవిల్లిపుత్తూరులో తులసీ వనంలో మొక్కలకు పాదులు అమర్చడానికి మట్టిని తవ్వుతున్నారు. అప్పుడు ఆ భూమి నుంచి భూదేవి అంశతో శ్రీఆండాళ్ అయోనిజగా అవతరించింది. కలియుగారంభం నలనామ సంవత్సరం ఆషాఢమాసం పుబ్బా నక్షత్రంతో కూడిన రోజున ఆమె జన్మించింది. ఆ బిడ్డను ఆళ్వారులు తన పుత్రికగా భావించి 'గోదా' అని నామకరణం చేశారు. గోదా అనే పేరు ఎన్నో శుభలక్షణాలతో కూడినది.
 

                 గో శబ్దానికి స్వర్గం, కిరణం, వజ్రం, నేత్రం, దిక్కు, వాక్కు, భూమి, నీరు, పశుసంపద అనే నానార్థాలున్నాయి. గాందదాతీతి - గోదా అను వ్యుత్పత్తిని బట్టి గో శబ్దములనన్నింటిని కూడా ఈమెయే ప్రసాదించేది. కాబట్టి ఆమె సార్థకనామధేయురాలైంది. దినదిన ప్రవర్థమానంగా పెరుగుతున్న గోదాదేవి నానా రకాల పరిమళభరితమైన పుష్పాలను తులసీమాలలో మేళవించి అందమైన తోయమాలికలుగా అల్లేది. ఆ మాలను ముందుగా తాను ధరించేది. చూసుకొని మురిసిపోయేది. ఆపైన ఆ మాలను తన మనోహరుడైన స్వామికి అర్పించేది. ఆమె తాను ధరించి ఇచ్చిన మాలను శ్రీరంగనాథునికి అర్పించడం చేత దాన్ని ఆముక్తమాల్యద అన్నారు.

పరమపద సోపానం


భగవంతుని చేరడానికి అత్యంత సులువైన సోపానాలు గోదాదేవి స్వయంగా రచించి, గానం చేసిన తిరుప్పావై పాశురాలు (పాటలు). అశువుగా రోజుకొక పాశురం చొప్పున 30 పాశురాల ద్వారా తన అంతరంగాన్ని ఆమె స్వామికి నివేదించింది. అత్యుత్తమమైన ఫలాన్ని పొందింది. తాను పొందిన ఫలాన్నిమన అందరికీ కూడా భావించి, కలియుగారంభంలో గోదాదేవిగా అవతరించింది. 11వ శతాబ్దంలో శ్రీ భగవద్రామానుజుల వారిచే తాను ఆచరించిన వ్రతాన్ని ఈ ప్రపంచానికి అందించింది.

                భగవదారాధనలో దీని అధ్యయనాన్ని ఒక ప్రధానాంగంగా పాటించడం చేత విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులైన శ్రీభగవద్రామానుజులు 'తిరుప్పావైజీయరు' అనే పేరుతో ప్రసిద్ధిచెందారు. భగవద్గీతను ఉపనిషత్తుల సారంగా ఆదరించడాన్ని మనం చూస్తూ ఉంటాం. గీతలో తిరుప్పావై ప్రబంధానికి సమానార్థాలు గల ప్రమాణ శ్లోకాలు అనేకం కనిపిస్తాయి. శ్రీమద్రామానుజులు సిద్ధాంతం చేసిన ప్రపత్తి, శరణాగతి, అనన్యభక్తి అనే మూడు సూత్రాలపై శ్రీవైష్ణవ ధర్మంగా విశిష్టాద్వైత సంప్రదాయానికి మూలస్తంభమై నిలిచింది. శ్రీవైష్ణవ ఆళ్వారాచార్యుల దివ్య పరంపరలో శ్రీరంగనాయకి చరిత్రము నాయకమణి వంటిది.


                   ఆమె రచించిన తిరుప్పావైలోని పాశురాలు వేదమంత్రాలతో సమానస్థాయిని పొందాయి. గోదాదేవి భక్తి పారవశ్యంలో గానం చేసిన పాశురాలను నిత్యార్చనా భాగంగా ధనుర్మాసం నెలరోజులు వైష్ణవాలయాలలో బ్రహ్మ ముహూర్తంలోనే సుప్రభాత సేవగా ఆలపిస్తారు. స్వామివారికి శోడషోపచార పూజావిధులు నిర్వహించి, ద్రవిడ ప్రబంధం తిరుప్పావై పారాయణం చేసి, స్వామికి ఆరగింపుగా బెల్లం పొంగలి నివేదించి, తీర్థప్రసాదాల్ని అందజేస్తారు.

పాశురాల సారం
1 నుంచి 5 వరకు ఉన్న పాశురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు గల పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్ర లేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16 నుంచి 17, 18 పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొల్పడం, 23వ పాశురంలో మంగళాశాసనం చేయడం, 25, 26 స్వామికి అలంకారాలైన ఆయుధాలను 'పర' అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. 27వ పాశురంలో పరమాత్మకు జీవాత్మకు గల సంబంధాన్ని 'కూడారై' ప్రసాదంతో పోల్చి వివరించింది. 30వ పాశురం ఫలశ్రుతిలో భగవంతునికి, మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పనిలేదని స్వతంత్రించి భగవంతుడిని అడిగి పొందవచ్చని తెలియజేసింది గోదాదేవి.
 

 వ్రత నియమాలు
శ్రీవైష్ణవ సంప్రదాయానుయాయులకు తిరుప్పావై వ్రతం ముఖ్య వ్రతం. నియమ, నిష్ఠలతో కూడిన దాన్నే వ్రతం అంటాం. ఈ వ్రతాన్నిచేయదలచినవారు విలాసవంతమైన జీవనాన్ని వదిలిపెట్టి నిరాడంబరంగా ఉండాలి. నిష్టగా, నిష్కల్మషంగా పూజావిధానాన్ని పాటిస్తూ, రంగని నామం జపిస్తూ ఇతరుల మనసులు కష్టపడే పనులు చేయకుండా, చేతనైన దానం చేయాలి. పెద్దలను సేవిస్తూ పెరుమాళ్ల యందు భక్తి ప్రపత్తులతో శరణాగతి చేస్తూ మన దైనందిన కార్యక్రమాలు నెరవేరుస్తూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు.

             2వ పాశురమైన 'వైయత్తువాళ్ వీర్‌గాళ్...'వ్రత నియమాలను గురించి ఇలా చెబుతుంది... క్షీరసముద్రంలో మెల్లగా నిద్రిస్తున్న శ్రియఃపతి పాదాలను ప్రీతితో గానం చేసే విధాన్ని స్మరించాలి. పేదలకు దానధర్మాలు, పూజ్యులకు శక్తి కొలది భిక్షను దానం చేస్తాము. పాలను, నెయ్యిని భుజింపము. భోగ్యవస్తువులను తాకము. అలంకరణ సామగ్రిని అంటుకోము. పాపకార్యాలను చేయము. కఠినపు మాటలు మాట్లాడము. శ్రియఃపతి పాదస్మరణకు చేయదగిన పనులనే చేస్తాము అంటూ వివరిస్తుంది.

               పరమ పురుషుడు అవతరించి చేయలేని పనులను తాను చేస్తూ, చేతనులను ఆ మార్గంలో పరమపదం చేర్చడానికి గోదాదేవి అవతరించింది. సృష్టి ప్రారంభంలోనే చేతనను ఉజ్జీవవింపచేసేందుకు పరమాత్మ సంకల్పించిన మూడు అర్థములను తాను ఆచరించింది. అంతేకాకుండా అందరిచే ఆచరింపచేయడం కోసమే పెరియాళ్వారుల పుత్రికగా జన్మించింది. శ్రీవైష్ణవ సంప్రదాయాలకు 12 మంది ఆళ్వారులు మణిపూసల వంటి వారైతే ఈమె కొలికిపూసయై తన జీవితాన్ని స్వామికే తోమాలికగా సమర్పించింది. సశరీరంగా రంగనిలో ఐక్యమొందిన పరమ భక్తురాలు గోదాదేవి. అందుకే ప్రతి వైష్ణవాలయంలో స్వామితో సమానంగా పూజలందుకొంటున్నది.

 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top