మంచి కొలెస్ట్రాల్ పెరిగేదెలా?

నానాటికీ పెరిగిపోతున్న గుండె జబ్బులూ, పక్షవాత సమస్యలు మానవాళిని కలవరపెడుతున్నాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు శరీర శ్రమలేకపోవడమే ఈ స్థితికి ప్రధాన కారణంగా ఉంటున్నాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగించడమే ఈ సమస్యలకు పరిష్కారం. సమస్యకు గురయ్యాక అందులోంచి బయటపడేందుకు యాతన పడేకన్నా రాకుండా నివారించుకోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.

కొలెస్ట్రాల్ అనగానే బెంబేలె త్తిపోతాం కానీ, అందులో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంది. అది మనకు మంచే చేస్తుంది. సమస్య అంతా చెడు కొలెస్ట్రాల్‌తోనే. కొలెస్ట్రాల్ ను ఉత్తత్తి చేయడం అన్నది శరీరంలోని ఒక సహజ ప్రక్రియ. అలా సహజంగానే దాదాపు 60 నుంచి 70 శాతం కొలెస్ట్రాల్ మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇది కాక 30 నుంచి 40 శాతం కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లోంచి తయారవుతుంది. నిజానికి శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఆ 70 శాతం కొలెస్ట్రాలే ఎక్కువ. అలాంటిది ఆహార పదార్థాల ద్వారా కూడా అధికంగా కొలెస్ట్రాల్ తయారయితే పరిస్థితి ప్రమాదానికి చేరువైనట్లే.


ఎందుకీ అతి ?
ఆహార పదార్థాలతో ప్రమేయం లేకుండానే కొందరిలో సహజంగానే అవసరానికి మించి కొలెస్ట్రాల్ తయారవుతూ ఉంటుంది. దీనికి జన్యుపరమైన మూలాలే ప్రధాన కారణం. తల్లిదండ్రుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే లక్షణం ఉంటే అది వారి పిల్లల్లోనూ ఉంటుంది. దానికి తోడు ఆహారపు అలవాట్లు, శరీర శ్రమ లేకపోవడం, జీవ న శైలి ఇవన్నీ ఇతర కారణాలుగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచీ దాదాపు 20 ఏళ్లు వచ్చేదాకా కొలెస్ట్రాల్ 100 నుంచీ 130 మిల్లీ గ్రాముల దాకా ఉంటుంది. అందుకే ఆ దశలో కొలెస్ట్రాల్ మూలంగా ఉండే ఏ గుండె జబ్బులూ రావు. చాలా మందిలో 20 ఏళ్లు దాటాకే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. పెద్ద వారిలో 200 మిల్లీ గ్రాముల దాకా వెళ్లవచ్చు.

ఎలా తెలుస్తుంది ?
రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు పెరిగిపోతున్నప్పుడు మామూలుగా అయితే ఏ లక్షణాలూ కనిపించవు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డుపడి, వాటి వైశాల్యం తగ్గిపోయి రక్తప్రసరణలో అంతరాయంగా మారిన తరువాతే సమస్య తెలుస్తుంది. ఒక్కోసారి గుండెపోటో లేదా పక్షవాతమో వ చ్చేదాకా ఏమీ తెలియకపోవచ్చు. అందుకే అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.



కొలిచేదెలా ?
కేవలం రక్తపరీక్ష ద్వారానే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. 20 ఏళ్లు దాటిన వారంతా ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ సాధారణ పరిమాణంలోనే ఉన్నట్లు రిపోర్టు వస్తే ఆ తరువాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటూ ఉంటే చాలు. ఒకవేళ ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే ఏటా ఒకసారి చేయించుకోవడం తప్పనిసరి. ఇలా ఏటా పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఇప్పుడున్న 75 శాతం గుండె జబ్బులు చాలా వరకు తగ్గుముఖం పడపడతాయి.

  •   సాధారణంగా 25 లేదా 30 ఏళ్ల లోపు వారిలోనే కండరాలు పెరుగుతాయి. వ్యాయామం చేసే వారైతే ఆ తరువాత కూడా కొంతమేరకు కండర కణజాలంలో ఉండే పీచుపదార్థం (సెల్ ఫైబర్) పెరుగుతుంది. వ్యాయామాలు చేయనివారిలో 30 ఏళ్ల తరువాత ఎవరైనా బరువు పెరుగుతున్నారూ అంటే ఆ పెరిగేది కొవ్వు మాత్రమే. బాగా వ్యాయామం చేసే వారు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటారు. ఆ తరువాత ఎప్పుడైనా వీరు వ్యాయామం చేయడం మానేస్తే అదే క్రమంలో తీసుకునే క్యాలరీలు కూడా తగ్గించుకోవాలి. అలా తగ్గించకపోతే తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగం కొవ్వుగా మారుతుంది. అది కొలెస్ట్రాల్‌గా రక్తంలో చేరిపోతుంది.

  •  శరీరంలోని ఏ భాగంలో కొలెస్ట్రాల్ చేరిపోతే ఆ భాగంలో రక్తనాళాలు సన్నబడతాయి. మెదడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలువైతే పక్షవాతం వస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డుపడితే గుండెపోటు వస్తుంది. కిడ్నీకి వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడితే కిడ్నీ దెబ్బ తినడంతోపాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. కాళ్లలోని రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలువైతే కాళ్ల జబ్బులు వస్తాయి.


నివారించేదెలా ?
  •   ఆహారంలో నూనె పదార్థాలు బాగా తగ్గించాలి. పిజ్జా, బర్గర్, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్ తినడం బాగా తగ్గించాలి. * గడ్డకట్టని నూనెల కన్నా గడ్డకట్టే నూనెలు ఎక్కువ ప్రమాదకరం. ప్రత్యేకించి నెయ్యి, వనస్పతి వంటి వాటిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆహారంలో వాటిని తగ్గించాలి.
  •   శాకాహారులు కొందరు తమకు ఈ కొలెస్ట్రాల్ సమస్యలే ఉండవన్న భ్రమలో ఉంటారు. నిజానికి అతిగా నూనెలు వాడే వారు శాకాహారులైనా అంతే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.
  •   కూరగాయలను సహజంగా అంటే సలాడ్స్‌గా తీసుకున్నప్పుడు ఏ సమస్యలూ ఉండవు. కానీ, వాటిని వండినప్పుడే సమస్యలు వస్తాయి. అందుకే నూనె వాడకాన్ని మొత్తంగా నివారించలేకపోయినా అతి తక్కువ నూనెతో వంట చేయడం మేలు చేస్తుంది. అయితే ఒక్కోరకం నూనెలో ఒక్కో లోపం ఉంటుంది. అందుకే నిరంతరం ఒకే నూనెను వాడకుండా వేరు వేరు నూనెలు వాడటం మేలు.
  •   మాంసాన్ని కాల్చిగానీ, నీటిలో ఉడికించి గానీ తినడం చాలా ఉత్తమం. అలా కాకుండా బాగా నూనెల్లో ఉడికించడంలోనే అసలు ప్రమాదం మొదలవుతుంది. రొయ్యల్లో తప్ప మిగతా చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. అందుకే చేపలకు ప్రాధాన్యత నివ్వడం మేలు.

వ్యాయామంతో...
చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)తగ్గడమే కాకుండా వ్యాయామంతో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) పెరుగుతుంది. అందుకే మానవ శాస్త్రం వ్యాయామానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ప్రతి నిత్యం వాకింగ్ చేసే వారు గుండె జబ్బులకు చాలా దూరంగా ఉంటారు. అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా జన్యుకారణాలతో కొందరిలో చెడు కొలెస్ట్రాల్ పెరగవచ్చు అలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి కొలెస్ట్రాల్‌ను తగ్గించే మాత్రలు వేసుకోవాలి.

వీటిని జీవితకాలమంతా వేసుకున్నా ఏ దుష్ప్రభాలూ ఉండవు. ఇవే కాకుండా తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్‌ను రక్తం గ్రహించకుండా చేసే మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్‌ను సంప్రదించి ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య సలహాలూ, చికిత్సలూ తీసుకుంటూ ఉంటే జీవిత కాలమంతా కొలెస్ట్రాల్ సమస్యలను అడ్డుకోవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top