మాయాద్వీపంలో మాంత్రికుడి కోట లా ఉండే ఇల్లు(స్మార్ట్‌హోమ్స్) గురించి తెలుసుకుందామా.....


మీ కారు రాగానే మెయిన్ గేటు దానంతట అదే తెరుచుకుంటుంది. అక్కడ్నించి పార్కింగ్ స్లాట్‌లోకి వెళ్లే వరకు దారి పొడవునా లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతూ మీకు దారి చూపిస్తాయి. మీరు కారు పార్క్ చేసి వచ్చి మీ ఫ్లాట్‌లోకి అడుగు పెట్టగానే.. మీ అడుగుల సవ్వడికి హాల్లోని లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. స్ల్పిట్ ఏసీ నిశ్శబ్దంగా ఆన్ అయి చల్లటి గాలిని వెదజల్లి మిమ్మల్ని సేద తీరుస్తుంది. మీరు హాల్లోంచి బెడ్ రూమ్‌లోకి వెళ్లగానే హాల్లోని లైట్లు ఆరిపోయి, బెడ్‌రూమ్‌లోని లైట్లు వెలుగుతాయి. బెడ్‌రూమ్‌లోంచి బాత్‌రూమ్‌లోకి వెళ్లగానే బెడ్‌రూమ్‌లోని లైట్లు ఆరిపోయి, బాత్‌రూమ్‌లోని లైట్లు వెలుగుతాయి.
 
ఇంట్లో మీరు ఏ గదిలో ఉంటే ఆ గదిలో వీనుల విందైన సంగీతం మంద్రస్థాయిలో వినిపిస్తూ ఉంటుంది. ఉదయం పూట బయట ఎండ మొదలవగానే మీ ఇంట్లోని విండో కర్టెన్లు వాటంతట అవే మూసుకుంటాయి. సాయంత్రం బయట వాతావరణం చల్లబడగానే తిరిగి తెరుచుకుంటాయి.

మీ ఇంటికి ఎవరైనా వస్తే.. ఆ వచ్చింది ఎవరన్నది మీ హాల్లోని ఎల్‌సిడి స్క్రీన్ మీకు చూపిస్తుంది. మీరు ఓకే బటన్‌పై ప్రెస్ చేస్తేనే ముఖద్వారం తెరుచుకుంటుంది... ఇదంతా చదివాక 'అబ్బ.. ఇదేదో మాయాద్వీపంలో మాంత్రికుడి కోట లా ఉందే..' అని మీరనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇదంతా 'హోమ్ ఆటోమేషన్' మాయాజాలం. ఇలాంటి అధునాతన సదుపాయాలు ఉన్న ఇళ్లనే 'స్మార్ట్‌హోమ్స్' అని పిలుస్తున్నారు. అచ్చ తెలుగులో 'సాంకేతిక గృహాలు'గా చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లూ ఇలాంటి స్మార్ట్‌హోమ్స్ విదేశాలకే పరిమితం.. కానీ ఇప్పుడు మన దేశానికే కాదు, రాష్ట్రానికీ వచ్చేశాయి. ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలని భావించేవారు మరి కాస్త అదనంగా ఖర్చు చేయగలిగితే ఈ 'స్మార్ట్‌హోమ్'ను సొంతం చేసుకోవచ్చు.

ఏమిటీ 'ఈ' మాయ?
ఇది మాయ కాదు, ఇందులో ఎలాంటి మర్మం లేదు. ఎలక్ట్రానిక్స్ బాగా అభివృద్ధి చెందడంతో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఇది. ఈ హోమ్ ఆటోమేషన్ విధానంలో ఎనర్జీ సేవింగ్ ఫీచర్స్, సెక్యూరిటీ ఫీచర్స్, ఈజీ లైఫ్ ఫీచర్స్.. మీ జీవితాన్ని మరింత సౌఖ్యంగా మార్చుతాయి. ఎనర్జీ సేవింగ్ ఫీచర్స్ అనేవి ముఖ్యంగా ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ మిషన్‌కు సంబంధించినవి. ఈ విధానంలో ప్రతి గదిలో ఉండే లైటు, ఫ్యాను, బెడ్‌రూమ్‌లోని స్ల్పిట్ ఏసీ వద్ద ఎలక్ట్రానిక్ సెన్సర్లు అమర్చుతారు. ఫలితంగా గదిలోకి ఎవరైనా ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్‌గా లైట్లు వెలగడం, ఫ్యాన్లు తిరగడం, ఏసీ ఆన్ అవడం వంటివి జరుగుతాయి.

అదే విధంగా గదిలోంచి బయటికి వెళ్లిపోగానే లైట్లు, ఫ్యాన్లు, ఏసీ.. అన్నీ వాటంతట అవే ఆరిపోతాయి. కావాలనుకుంటే ఏ లైటు ఎన్ని గంటలకు వెలగాలో, ఎన్ని గంటలకు ఆరిపోవాలో కూడా ముందుగానే టైం సెట్ చేసుకోవచ్చు. ఈ విధానంలో విద్యుత్తు చాలావరకు ఆదా అవుతుంది. ఇక సెక్యూరిటీ అంశాల విషయానికొస్తే.. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారెవరన్నది ముందుగానే మీ ఇంట్లోని ఎల్‌సిడి ప్యానల్ మీకు చూపించడం, మీకిష్టమై ఓకే బటన్ ప్రెస్ చేస్తేనే ముఖద్వారం తెరుచుకుంటుంది. అలాగే ఆదివారం పూట మీరు వంటింట్లో బిజీగా ఉన్నప్పుడు కూడా ఎల్‌సిడి స్క్రీన్ ద్వారా సెల్లార్‌లో ఆడుకుంటున్న మీ అబ్బాయిని ఓ కంట కనిపెడుతూ ఉండొచ్చు.

అందరూ కలిసి ఏదైనా పిక్నిక్ ప్రోగ్రాం వేసుకుని బయటికి వెళ్లినప్పుడు ఇంటిని గురించి బెంగ పడనక్కర్లేదు. మళ్లీ మీరొచ్చి మీ దగ్గర ఉండే ఐడి కార్డు చూపించే వరకు మీ ఇంటి మెయిన్‌డోర్ తెరుచుకోదు. ఒకవేళ మీరు ఇంట్లో లేనప్పుడు బలవంతంగా ఇంటి తలుపుగాని, కిటికీలుగాని తెరవాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. వెంటనే సైరన్ మోగడంతోపాటు మీరెక్కడ ఉన్నా మీ సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. ఇలాంటి అధునాత ఫీచర్లు ఎన్నో సెక్యూరిటీ ఆప్షన్‌లో ఉంటాయి. లైఫ్ ఈజీ ఫీచర్స్ అంటే.. మీరు ఏ గదిలోకి వెళ్తే ఆ గదిలో సంగీతం వినిపిస్తుండడం, సాయంత్రం అవగానే మీరు తెరవాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోని అన్ని కిటికీల కర్టెన్లు వాటంతట అవే తెరుచుకోవడం వంటివి.

ఎక్కడున్నాయి?
ఇన్నాళ్లూ విదేశాలకే పరిమితమైన హోమ్ ఆటోమేషన్ విధానం ఇప్పుడు మన దేశానికీ, రాష్ట్రానికీ వచ్చేసింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలలో ఇప్పటికే ఈ తరహా ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలోని మదీనాగూడలో 'నైల్‌వ్యాలీ' పేరుతో జనప్రియ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లలో ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో ఫుల్లీ ఆటోమేషన్, సెమీ ఆటోమేషన్ ఫ్లాట్లు ఉన్నాయి.

వీటి ఖరీదు రూ.27-31 లక్షల మధ్య(ఎమినిటీస్, రిజిస్ట్రేషన్ ఖర్చులు కాకుండా) ఉంటుంది. అలాగే 'ఏలియన్స్ స్పేస్‌స్టేషన్' పేరుతో షేక్‌పేట్‌లో నిర్మితమవుతున్న అపార్ట్‌మెంట్లలో కూడా ఈ హోమ్ ఆటోమేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఇండిపెండెంట్ ఇళ్లలో కూడా ఇలాంటి అధునాతన సదుపాయాలు కల్పించుకుంటున్నారు. విద్యుత్తును చాలావరకు ఆదా చేయగలగడమే కాకుండా సెక్యూరిటీ ఫీచర్స్ ఉండడం, ఒకే ఒక్క రిమోట్ సాయంతో ఇంట్లో ఎన్నో పనులు చేసుకునే వీలు ఉండడంతో ఈ హోమ్ ఆటోమేషన్ విధానం పట్ల ఎంతో మంది మక్కువ చూపుతున్నారు.

బాగా ఖరీదేమో?
కానే కాదు. ఈ రోజుల్లో హైదరాబాద్ వంటి నగరంలో ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.20-40 లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సిందే. ఇక బాగా ఖరీదైన జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.40-80 లక్షల రూపాయల వరకు పెట్టాల్సిందే. ఇంత డబ్బు పోసి ఇల్లు కొనేటప్పుడు..

సొంత ఇంటిని మరింత సౌఖ్యంగా మార్చివేసే 'హోమ్ ఆటోమేషన్'కు కనీసం రూ.2-3 లక్షలు ఖర్చు చేయలేరా? కచ్చితంగా చేయగలం అంటూ సంపన్న, ఎగువ మధ్యతరగ తి వర్గాల వారు ముందుకు రావడం వల్లే ఇప్పుడు మన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలలోనూ స్మార్ట్ హోమ్స్ హవా మొదలైంది. ఈ హోమ్ ఆటోమేషన్ కేవలం అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్‌లో మాత్రమే కాదు, ఇండిపెండెంట్ ఇళ్లకూ చేయొచ్చు.

ఈ హోమ్ ఆటోమేషన్ విధానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రూ.1000 ప్యాకేజి ప్రారంభించారు. ఈ ఖర్చుతోనే ఐ-రిమోట్ అనే పరికరం ద్వారా ఇంట్లోని నాలుగు లైట్లు, ఒక ఫ్యానుకు సంబంధించి ఆటోమేషన్ జరిగిపోతుంది. ఏడాది వరకు ఉచిత రీప్లేస్‌మెంట్ వారెంటీ కూడా అందజేస్తున్నాం. సౌకర్యవంతంగా ఉండడంతో ఈ ఆటోమేషన్‌కు హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాలలో కూడా మంచి డిమాండ్ ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top