మీ పిల్లలు ఏ ఆహారం ఇష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి.

మీ పిల్లలు ఏ ఆహారం ఇష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. చిప్స్, కురుకురే, పాస్తా, కూల్‌డ్రింక్, నూడుల్స్, సాస్, పిట్జా, బర్గర్, చాక్లెట్స్, పన్నీర్, చీజ్‌లు ఇవే కదూ మీ పిల్లలు ఇష్టంగా తింటున్నది? వీటిలో పోషకవిలువలున్న పదార్థాలు ఒకటి రెండు ఉన్నాయి. పన్నీర్, చీజ్‌లు పరిమితంగా తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. మితిమీరి తీసుకుంటే అంతే. ఇక మిగిలిన పదార్థాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తెల్లారిలేస్తే ఏ ఛానల్ చూసినా వీటికి సంబంధించిన యాడ్స్‌తో ఊదరకొడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లల్ని అదుపుచేయడం సాధ్యమయ్యే పనేనా?


రుచిని, ఆకలిని పెంచే ఎసిజి
ఇవి తింటే ఏం నష్టం అని మీరు అడగవచ్చు. వీటిలో ఉండే కొన్ని ప్రమాదకర పదార్థాల వల్ల పిల్లలు ఊబకాయులు అవుతారని, ఫ్యాట్స్ విపరీతంగా పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందంగా ప్యాక్ చేసిన చిప్స్, కుర్‌కురేలు డజన్ల కొద్దీ ఫ్లేవర్లలో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎంతకాలం అయినా నిల్వ ఉండేందుకు వీటిలో కొన్ని ప్రిజర్వేటివ్స్, రసాయనాలు కలుపుతున్నారు. వీటికన్నా ప్రమాదకరమైన పదార్థం మోనోసోడియం గ్లాటమేట్.

దీన్ని కలిపిన పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి. మన ఆకలిని మరింతగా పెంచుతాయి. ఫలితంగా ఇవి తినే వారు ఆపకుండా ఒకటికి రెండు ప్యాకెట్లు లాగించేస్తారు. ఫలితంగా ఊబకాయం వచ్చిపడుతుంది. దీన్ని అతిగా తింటే పిల్లలు ఎత్తుపెరగరని, భవిష్యత్తులో లైంగిక సమస్యలు ఎదుర్కొంటారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనం తినే మాగీ నూడుల్స్, సూప్‌లు, మెక్‌డొనాల్డ్, కెఎఫ్‌సిల్లో దొరికే అన్ని పదార్థాల్లో ఈ మోనోసోడియం గ్లాటమేట్ (ఎంసిజి)పుష్కలంగా ఉంటున్నది. ఎంసిజి లేని పదార్థాలను లేదా సహజమైన ఆహారాన్ని తీసుకోవడం పెద్దలకు, పిల్లలకు కూడా ఎంతే మేలు.


50 గ్రాముల చక్కెరే తింటున్నారా?
ఇక శరీరంలో కొవ్వు పదార్థాల్ని విపరీతంలో పెంచే మరో నిత్యావసరం పంచదార. తెల్లగా ధగధగలాడే చక్కెరలో మరింత ప్రమాదకరం. చక్కెర ఒక మోతాదుకు మించి తింటే శరీరంలో పేరుకుపోయిన క్యాలరీలు కరగవు. పైగా చక్కెరకు ఆకలిని పెంచే గుణం ఉంది. ఇప్పుడు మార్కెట్‌లో లభించే ఫ్రూట్ జ్యూస్‌లలో చక్కెర సిరప్‌ను వాడతారు. ఇది శరీరానికి అవసరం అయిన దానికంటే ఎక్కువ కొవ్వును చేరుస్తుంది.

నిజానికి మన కు రోజుకు ఎంత చక్కెర అవసరం? ఎంత తింటున్నాం అనే లెక్క తెలియదు! చక్కెర పరిమితంగా తింటే మంచిదే. అదే మోతాదు మించితే కొంప మునుగుతుంది. రోజుకు 12 టేబుల్ స్పూన్లు, అంటే 50 గ్రాముల చక్కెర మన శరీరానికి అవసరం. అయితే మీ పిల్లలు రోజూ బ్రెడ్‌లో టమాటా సాస్ తింటున్నారనుకుందాం. అంటే వారంలో కేవలం సాస్ ద్వారానే 200 గ్రాములు షుగర్ తింటున్నారన్నమాట. ఇక స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, జ్యూస్‌లు, కూల్‌డ్రింక్‌ల ద్వారా ఎంత చక్కెర మన కడుపులోకి పొతున్నదో ఒక్కసారి ఆలోచించండి.



చూయింగ్‌గమ్, మింట్ చాక్లెట్లతో జాగ్రత్త !
ఊబకాయాన్ని మోసుకొచ్చే మరో ప్రమాదకరమైన పదార్థం చక్కెర స్థానంలో ఉపయోగించే ప్రత్యామ్నాయాలు.ఈ మధ్యకాలంలో కూల్ డ్రింక్‌ల స్థానంలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందని చెప్పుకొనే డైట్‌కోక్‌లు వచ్చాయి. షుగర్ సమస్య ఉన్న వాళ్లు కూడా ఈ డ్రింక్స్ తాగవచ్చనే ప్రచారం ఉంది. కానీ అది సరికాదు. వీటిలో ఉపయోగించే చక్కెర ప్రత్యామ్నాయాలు మన శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతాయంటున్నారు పోషకాహార నిపుణులు.

వీటితో పాటు హోటళ్లలో ఉపయోగించే ఈక్వల్, నాచురాస్వీట్ వంటి చక్కెర ప్రత్యామ్నాయాలూ మంచివి కావని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మన పిల్లలు అరగంటకు ఒకటి నమిలిపారేసే చూయింగ్‌గమ్, మింట్ చాక్లెట్ల్‌లో ఉండే చక్కెర ప్రత్యామ్నాయాలు స్థూలకాయానికి కారణం అవుతాయని వారు చెబుతున్నారు. అన్నిటికీ ఏదో ఒక వంక పెడుతున్నారు? మరేం తినాలి అంటే... సహజంగా, తాజాగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా పదికాలాల పాటు ఉండవచ్చుంటున్నారు పోషకాహార నిపుణులు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top