పిగ్మెంటేషన్ సమస్య ఎందుకు ఎదురవుతుంది.. నివారణా చర్యలు

చాలామందిని వేధించే చర్మ సమస్యల్లో.. పిగ్మెంటేషన్‌ ఒకటి. చర్మం రంగు ముదురు చాయలోకి మారినా.. లేదా మెరుపు పూర్తిగా తగ్గి మచ్చలు పడినా తేలిగ్గా తీసుకోకూడదు. దాన్ని పిగ్మెంటేషన్‌గా పరిగణించాలి. ఈ సమస్య ప్రధానంగా మూడు రకాలుగా వేధిస్తుంది.
* చర్మం ముదురు రంగులోకి మారడాన్ని హైపర్‌ పిగ్మెంటేషన్‌ అంటారు.

* అక్కడక్కడా తెల్ల మచ్చలు పడితే.. హైపో పిగ్మెంటేషన్‌గా పరిగణిస్తారు.

* పూర్తిగా రంగు తగ్గిపోతే.. అది డీ పిగ్మెంటేషన్‌గా గుర్తించాలి.

హైపర్‌ పిగ్మెంటేషన్‌:
దీనికి ప్రధాన కారణం చర్మంపై ఎండ ప్రభావం. ఆ తరవాత తలకు వేసుకునే రంగులు, పసుపు, చందనం కలిపి తీసుకునే చికిత్సలు, హైడ్రోక్వినాన్‌ ఆధారిత క్రీంలు దీర్ఘకాలంగా వాడటం.. వాటికి తోడు ఎండ ప్రభావం వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోతుంది. ముదురు వర్ణంలోకి మారుతుంది. ఒత్తిడి కూడా పిగ్మెంటేషన్‌కి దారితీస్తుంది. ఇక, మొటిమలు వచ్చి తగ్గాక, గాయాలు మానాక, ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గాక, శస్త్ర చికిత్స తరవాత, దోమకాటు వల్ల మచ్చలు పడుతుంటాయి. ఇవన్నీ హైపర్‌ పిగ్మెంటేషన్‌లో భాగమే.

ఇతర కారణాల్లో హార్మోన్ల అసమతూకం కూడా ఉంటుంది. దానివల్ల మంగులాంటి మచ్చలు వస్తాయి. ఇవి సీతాకోక చిలుక ఆకృతిలో ఉంటాయి. ఇలాంటివి సాధారణంగా చెక్కిళ్లు, ముక్కు, నుదురు, పై పెదవి మీద వస్తాయి. ఎండ వల్ల ఇవి ఇంకా పెరుగుతాయి. గర్భధారణ సమయంలో, మెనోపాజ్‌ దశలోనూ ఇవి బాధిస్తాయి.

ఈ సమస్యల్ని నివారించాలంటే.. చర్మంపై ఎండ పడకుండా చూసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే నిపుణుల సలహాతో సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. తలకు రంగు వేసుకునే వారు బయో రంగులు వాడాలి. ప్రత్యేకంగా చికిత్స తీసుకోవాలనుకుంటే జెల్స్‌, పీల్స్‌, లేజర్లు, క్రీంలు వంటివి అందుబాటులో ఉన్నాయి.

వైద్యుల్ని సంప్రదిస్తే అసలైన కారణాన్ని గుర్తించి చికిత్స నిర్థారిస్తారు. కొన్నిసార్లు రెండురకాల చికిత్సలు కలిపి కూడా చేస్తారు. సమస్యను బట్టి స్కిన్‌ లైటనింగ్‌ క్రీంలు వాడితే సరిపోతుంది. గంధం, పసుపు కలిపి చేసే క్రీంలు వాడుతుంటే మానేయాలి.
హైపో పిగ్మెంటేషన్‌: 
ఇది కూడా చాలా రకాల్లో వేధిస్తుంది. ముఖ చర్మంమీద తెల్లని మచ్చలు వస్తుంటాయి కొందరికి. ఈ సమస్య సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి పోషకాహార లోపం అనుకుంటారు కొందరు. ఆ కారణం చాలా తక్కువగానే ఉంటుంది. వాడేసబ్బుల వల్ల చర్మం పొడిబారి మచ్చలు పడటం దీనికి ప్రధాన కారణం. అయితే కొన్నిసార్లు జింక్‌, విటమిన్ల సప్లిమెంట్లు ఇవ్వాల్సి రావచ్చు. అలాగే నిపుణుల సలహాతో ఫేస్‌వాష్‌, మాయిశ్చరైజర్‌.. ఇతర క్రీంలు వాడితే సరిపోతుంది.
కొందరిలో తెల్ల, నల్ల మచ్చలు కలిపి లేదా ఒకే రంగు మచ్చలు కూడా ఉంటాయి. వాటిని శోభి మచ్చలంటారు. అది కూడా హైపో పిగ్మెంటేషన్‌గానే పరిగణించాలి. దీన్ని నివారించాలంటే.. యాంటీ ఫంగల్‌ క్రీంతోపాటు మాత్రలు వాడాలి. ఇలాంటి మచ్చలు చుండ్రు వల్ల కూడా వస్తాయి కాబట్టి దాన్ని నివారించేందుకు షాంపూలు వాడి ఆ సమస్యను కూడా అదుపు చేయాల్సి ఉంటుంది. కుష్టువ్యాధి మచ్చలూ పిగ్మెంటేషన్‌లో భాగమే. దానికి ప్రత్యేక చికిత్స తీసుకోవాలి.
 డీ పిగ్మెంటేషన్‌: 
ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జన్యుపరంగా వచ్చే ఆల్బినిజం. అది జన్మతః వస్తుంది కాబట్టి.. దానివల్ల వచ్చే ఇతర సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. రెండోది బొల్లి మచ్చలు. దీనికి కుటుంబ చరిత్ర ఒక కారణం మాత్రమే. ఎలాంటి కారణాలు లేకుండా కూడా వస్తుంది కొందరికి. దీన్ని నివారించేందుకూ కొన్ని చికిత్సలు ఉన్నాయి. నిపుణుల సలహాతో తీసుకోవచ్చు.
 
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top