స్టెంట్‌లతో గుండెకు రక్షణ

గుండె జబ్బు అనగానే బైపాస్ సర్జరీయే మార్గం అని చాలా మంది అనుకుంటారు. కానీ అందరికీ బైపాస్ సర్జరీ అవసరం ఉండదు. నిజానికి బైపాస్ సర్జరీ అవసరాన్ని చాలా వరకు తగ్గించింది యాంజియోప్లాస్టి. అయితే ప్రాథమిక దశలోనే గుర్తించినపుడు మాత్రమే యాంజియోప్లాస్టి ఉపకరిస్తుంది. అందుకే 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ గుండెకు సంబంధించిన పరీక్షలు విధిగా చేయించుకోవాలి.

గుండె జబ్బులు బారిన పడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇటీవల యుక్తవయస్కుల్లోనూ గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. అప్పటివరకు బాగానే ఉన్న వ్యక్తులు హఠాత్తుగా గుండె నొప్పి అంటూ కుప్పకూలిపోతున్నారు. గుండెపోటు వచ్చిన వారిలో సగం మంది ఆసుపత్రికి తరలించేలోగానే చనిపోతున్నారు. మిగతా సగం మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నా అందులో పది శాతం మంది సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా ఏడాదిలోపే చనిపోతున్నారు. దీనికి ప్రధానకారణం సమస్యను నిర్లక్ష్యం చేయడమే. యుక్తవయస్కుల్లో గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం స్మోకింగ్.

తెలుసుకొనేదెలా...?
30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవాలి. బి.పి, డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబసభ్యుల్లో ఎవరైనా గుండెపోటుతో చనిపోయి ఉంటే వారి వారసులకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సి.టి యాంజియోగ్రామ్ పరీక్ష చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా సులభమైన పరీక్ష. ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా కరోనరీ అర్టరీల్లో బాక్స్ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు.

ఎలా ఏర్పడుతుంది?
రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటమనేది ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనో జరగదు. క్రమంగా ఏర్పడుతుంది. రక్తనాళాల లోపలి గోడల్లో పగుళ్లు ఏర్పడి కొలెస్ట్రాల్ బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల రక్తం అక్కడ గడ్డ కట్టిపోతుంది. పది, పదిహేనేళ్ల సమయంలో రక్తసరఫరాను అడ్డుకునే విధంగా బ్లాక్ తయారవుతుంది. జీవనవిధానం మార్చుకుని, వ్యాయామం చేయడం అలవర్చుకుంటే బ్లాక్స్ ఏర్పడటం ఆలస్యమవుతుంది.
 
మందులతో...
బ్లాక్స్‌ను ప్రాథమిక దశలో గుర్తించినట్లయితే మందుల ద్వారా తగ్గించే వీలుంది. రక్తనాళాలలో వచ్చే పగుళ్లను కూడా మందులతో అరికట్టవచ్చు. బ్లాక్స్ పెరగకుండా చూసుకోవచ్చు. తద్వారా హార్ట్ ఎటాక్‌ను నివారించవచ్చు. ఒకవేళ బ్లాక్స్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గుర్తిస్తే మందుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. రక్తనాళంలో 30 శాతం వరకు అడ్డంకి ఉన్నా మందులతో నయం చేసుకోవచ్చు. అలాకాకుండా అంతకంటే ఎక్కువ బ్లాక్ ఉంటే యాంజియోప్లాస్టి చేసి స్టెంట్ వేయాల్సి ఉంటుంది.

యాంజియోప్లాస్టి
తొడ లేదా భుజంలోని రక్తనాళం నుంచి ఒక ట్యూబ్‌ను పంపించి స్టెంట్‌ను అమర్చడాన్ని యాంజియోప్లాస్టి అంటారు. బ్లాక్ ఏర్పడినచోట స్పింగ్(స్టెంట్)లాంటి దాన్ని అమర్చడం జరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్ మెటీరియల్‌ను అంతా నెట్టేస్తుంది. దీనివల్ల రక్తనాళం అంతా క్లియర్ అవుతుంది. కొందరు ఛాతీ నొప్పి వచ్చాక ఆసుపత్రికి వస్తారు. పరీక్షచేస్తే మూడు రక్తనాళాల్లో బ్లాక్స్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటాయి. అటువంటప్పుడు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రాథమిక దశలో గుర్తించినట్లయితే రెండు, మూడు బ్లాక్స్ ఉన్నా కూడా బైపాస్ సర్జరీకి వెళ్లకుండా యాంజియోప్లాస్టి ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. గతంలో గుండెపోటు వచ్చిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువస్తే ఐసియులో పెట్టి క్లాట్ కరగడంకోసం మందులు ఇచ్చేవారు. క్లాట్ కరిగే వరకు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యాంజియోప్లాస్టిలో ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. రక్తనాళం గుండా ట్యూబ్‌ను పంపించి క్లాట్‌ను వెంటనే బయటకు లాగేయవచ్చు. దీనివల్ల రోగికి మళ్లీ గుండెపోటు రాకుండా నివారించే వీలు కలిగింది.

డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్
స్టెంట్‌ల్లో కోబాల్ట్ క్రోమియం, ప్లాటినం, డ్రగ్ కోటెడ్ స్టెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్‌లో మెడికేషన్ ఉంటుంది. ఇది మళ్లీ బ్లాక్ ఏర్పడటాన్ని నివారిస్తుంది. మామూలు స్టెంట్ వేసినపుడు ఆ ప్రదేశంలో రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రదేశంలో కణాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల మళ్లీ బ్లాక్ ఏర్పడుతుంది. కానీ డ్రగ్ కోటెడ్ స్టెంట్‌లో ఉండే యాంటీ క్యాన్సర్ మందులు కణాలు పెరగడాన్ని నిరోధిస్తాయి.

ఎంతవరకు సేఫ్?
యాంజియోప్లాస్టి చేసినంత మాత్రాన మళ్లీ క్లాట్స్ ఏర్పడకుండా ఉండాలని లేదు. స్టెంట్ అమర్చిన చోట కాకుండా మరో చోట క్లాట్స్ ఏర్పడవచ్చు. కాబట్టి స్టెంట్స్ వేసిన తరువాత కూడా మందులు వాడుతూ ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. జీవన విధానం మార్చుకోవాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి. డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top