పక్షవాతం అనంతరం రోగి సమస్యకు చేసే వైద్య చికిత్స

పక్షవాతం వస్తే పాక్షికంగానైనా రోగికి వైకల్యం కలుగుతుంది. పక్షవాతం అనంతరం రోగి సమస్యకు చేసే వైద్య చికిత్సతో పాటు రోగికి కలిగే ఆ వైకల్యాన్ని అధిగమించడానికి అనేక విభాగాలలో వైద్య సేవలు, చికిత్సలు, రీహ్యాబిలిటేషన్ సేవలు, ముద్దగా వచ్చే మాటలను సరిదిద్దడం వంటి అనేక ప్రక్రియలు అవసరం కావచ్చు. దాంతోపాటు సరిగా నడవలేని వారికి కొన్ని ఉపకరణాలను అమర్చడం వల్ల వారు మునుపటి విధులు నిర్వహించేలా చేయవచ్చు.


కాలు, చేయి చచ్చుబడిన వారికి : 
ఇలాంటి వారికి, చేయి పనిచేయని వారికి ఆ కండరాలు మెరుగుపడేలా నిలబడటం, నడకలో శిక్షణ ఇస్తారు.

ఇటీవల కాలు, చేయి చచ్చుబడిన వారికి మోటరైజ్‌డ్ ట్రెడ్‌మిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. గెయిట్ అనలైజర్స్ అనే నిపుణుల సహాయంతో కండరాలు మునపటి శక్తి పుంజుకునేలా బరువులు ఎత్తేలా చేసే ‘వెయిట్ బేరింగ్ గెయిట్ ట్రైనింగ్’ ఇస్తారు.


మజిల్ కంట్రాక్చర్స్‌లో :
 

కండరాలు బిగుసుకుపోయినట్లుగా అయ్యే ‘మజిల్ కంట్రాక్చర్స్’ వచ్చినవారిలోనూ, కండరాల కదలికలపై అదుపు కోల్పోయినట్లుగా అయ్యే స్పాస్టిసిటీ కేసుల్లో ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇలాంటి వారికి బొటాక్స్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కండరాల కదలికలను పరిమితం చేసేవిధంగా బిగుతుగా కట్టు కట్టినట్లుగా ‘స్ప్లింటింగ్ ఆఫ్ మజిల్’ ప్రక్రియను అవలంబించాల్సి రావచ్చు. ఇందులో ఆ కండరం చుట్టూ బిగుతుగా కట్టుకట్టినట్లుగా ఉండే ఉపకరణాలను ఉపయోగిస్తారు. 

ఆక్యుపేషనల్ థెరపీ : 
ఇందులో భాగంగా రోజు రోజుకూ చేతి పనితీరును మరింత మెరుగుపరిచేలా శిక్షణ ఇస్తూ రోగులు తమంతట తామే స్నానం, తలదువ్వుకోవడం, బట్టలు తొడుక్కోవడం, తినడం వంటి పనులకు ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించేలా శిక్షణ ఇస్తుంటారు.

కంప్యూటరైజ్‌డ్ రొబోటిక్ ఆర్మ్ :
 

పక్షవాతంలో చేయి తీవ్రంగా దెబ్బతిన్న కొందరిలో కంప్యూటరైజ్‌డ్ రొబోటిక్ ఆర్మ్ సహాయంతో పనులు చేసుకునేలా చేయవచ్చు. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధునాతన శాస్త్రవిజ్ఞానంతో సాధించినా ఈ చేయి విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని వైద్యులు పరిమితంగానే వాడుతున్నారు.
  

స్పీచ్, లాంగ్వేజ్ థెరపీ : 
పక్షవాతం కారణంగా మాట పడిపోయిన వారికి, మాట ముద్దగా వచ్చేవారికి, ఉచ్చారణ సరిగా రానివారికి స్పీచ్, లాంగ్వేజ్ థెరపిస్టులు - రోగుల మాట, భాష, ఉచ్చారణ విషయాలు మెరుగుపడేలా శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియలో భాగంగానే మింగడం కూడా మెరుగుపడేలా చేస్తారు.

ఇటీవల అందుబాటులో ఉన్న ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానంతో మాట, ఉచ్చారణ, కమ్యూనికేషన్స్‌ను మెరుగుపరచవచ్చు.


క్లినికల్ సైకాలజిస్ట్ సేవలు :
 

పక్షవాతం రోగుల్లో అంతకు ముందు వరకూ అన్ని పనులూ చేసుకోగలిగినవారు ఒక్కసారిగా కొన్ని రకాల వైకల్యాలకు లోనయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటివారిలో మానసికంగా శక్తిని ఇచ్చేందుకు మానసిక నిపుణుల సేవలు అవసరం. అంతేగాక... ఈ రోగుల్లో ఆలోచన, గ్రహింపు, జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా ఇచ్చే శిక్షణను కాగ్నిటివ్ రీ-హ్యాబిలిటేషన్ అంటారు. దీనికి మానసిక చికిత్స కూడా అవసరం. 

ఆర్థోటిక్స్ : 
పాదంలో కదలికలు లేనివారికి, మడమ వంటి భాగాలు కదల్చలేని విధంగా చచ్చుబడిన వారికి కట్టుకట్టినట్లుగా ఉండే ప్రత్యేకమైన ఉపకరణాలను అమర్చడంతో పాటు, విద్యుదుపకరణాలతో కదలికలు ఉండేలా చేసే ఈ వైద్య చికిత్సా విభాగాన్ని ఆర్థోసిస్ అంటారు. మడమ కదలికలు కొంత పరిమితంగానే ఉంటాయన్న విషయం తెలిసింది. ఇలా ఆర్థోటిక్ విభాగ సహాయంతో అవసరమైనట్లుగా మడమ కదలికలను నియంత్రిస్తారు.  


రీ-హ్యాబిలిటేషన్ నర్స్ : 
పైన పేర్కొన్న వేర్వేరు సేవా అంశాలను సమన్వయపరచే సహాయకులు ఒకరు ఉండాలి. ఆ విధులు నిర్వహించేందు దోహదపడేవారే ‘రీహ్యాబిలిటేషన్ నర్స్’. ఈమె వేర్వేరు నిపుణులందరితోనూ చర్చిస్తూ రోగికి అన్ని విభాగాలకు చెందిన సేవలు అందేలా చూస్తారు. రోగికి మానసిక స్థైర్యం కలిగే కౌన్సెలింగ్ బాధ్యతలను కూడా అందజేస్తారు.

సెక్సువల్ రీ-హ్యాబిలిటేషన్ :
 

స్ట్రోక్‌కు గురైన చాలామంది రోగుల్లో పురుషుల్లో ప్రధానంగా సెక్స్‌కు సంబంధించిన బలహీనత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి యూరాలజిస్ట్ సహాయంతో అంగస్తంభన కోసం కొన్ని చికిత్సలు, పురుషాంగంలో పెనైల్ ఇంప్లాంట్స్ అమర్చాల్సి రావచ్చు. మహిళా రోగుల్లోనూ సెక్స్ సంబంధించిన బలహీనతలు రావచ్చు. అయితే మన దేశంలోని మహిళా రోగులు ఈ విషయాన్ని నేరుగా డాక్టర్ వద్ద ప్రస్తావించడానికి, చర్చించడానికి ఇష్టపడరు. కనీసం సమీప బంధువులు, అత్యంత ఆంతరంగికుల సహాయంతోనైనా మహిళా రోగి తన ఇబ్బందిని, సందేహాలను డాక్టర్‌కు తెలియపరచడం వల్ల వైద్యపరంగా వారికి అవసరమైన చికిత్సను అందించడానికి ఆస్కారం ఉంటుంది.

పక్షవాతంలోని వివిధ లక్షణాలు

సాధారణంగా పక్షవాతం అనగానే ఒక కాలు, చేయి చచ్చుబడిపోవడం స్ఫురిస్తుంది. ఈ కండిషన్‌ను హెమిప్లీజియా అంటారు. దీని వల్ల తమ పని తాము చేసుకోలేని పరిస్థితి వస్తుంది. కానీ పక్షవాతంలో దానితో పాటు అనేక ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. మెదడులోని ఎడమవైపు భాగాలు కుడి వైపు శరీర భాగాలను, మెదడులోని కుడివైపు కేంద్రాలు శరీరంలోని ఎడమవైపు శరీర భాగాలను నియంత్రిస్తాయి. పక్షవాతంతో కుడివైపున ఉన్న కాలు చేయి లేదా, ఎడమవైపు కాలు చేయి చచ్చుబడిపోవడాన్ని హెమీప్లీజియా అంటారు.

కొందరిలో మెదడులోని ఫ్రంటల్ టెంపోరల్ భాగం దెబ్బతినడం వల్ల అర్థం చేసుకునే శక్తి, మాట్లాడే సామర్థ్యం, కమ్యూనికేషన్స్, రాత దెబ్బతింటాయి. దీన్ని అఫేజియా అంటారు.

కొన్నిసార్లు జ్ఞాపకశక్తిలో తేడా వస్తుంది. ఈ సమస్యను ఆమ్నీషియా అంటారు.

మెదడులోని ఆక్సిపెటల్ భాగంలో స్ట్రోక్ ప్రభావం వల్ల కొంతమందిలో విజువల్ లోబ్స్ దెబ్బతినడం వల్ల చూపుపై ప్రభావం పడవచ్చు. దీన్ని హెమీ అనోపియా అంటారు.
  

ఫంటల్‌లోబ్‌పై స్ట్రోక్ ప్రభావం వల్ల కొందరు విచక్షణశక్తి (జడ్జ్‌మెంట్)ని కోల్పోయే అవకాశాలున్నాయి. దీన్ని ఎగ్జిక్యూటివ్ డిస్‌ఫంక్షన్ అంటారు.

మెదడులోని ఫ్రంటల్, పెరైటల్ ప్రాంతంలో ప్రభావం పడటం వల్ల నేర్చుకున్న అంశాలపై ప్రభావం పడవచ్చు. దీన్ని ఎప్రాక్సియా అంటారు.

కొందరిలో మెదడులోని కుడివైపు ఇన్సులార్ కార్టెక్స్ అనే భాగంలో ప్రభావం పడటం వల్ల మింగడంపై ప్రభావం పడవచ్చు. దీన్ని డిస్‌ఫేజియా అంటారు.

న్యూరాలజిస్ట్ : 

పక్షవాతం వచ్చిన రోగిలో చికిత్సలు అందించే నిపుణులందరికీ నేతృత్వం వహించే బాధ్యతను న్యూరాలజిస్ట్ నిర్వహిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే రోగికి అవసరమైన అన్ని విభాగాల్లోనూ సేవలు అందించడం సాధ్యమవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top