ప్రకృతిచికిత్సలో మసాజ్ థెరపీకి ఉన్న ప్రాధాన్యత(బాడీ మసాజ్‌)

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పుట్టిన బిడ్డ ఎముకలు గట్టిపడటానికి మొదలుకొని ఎన్నో కీలక సమస్యలలో మర్దనను ఒక చికిత్సా ప్రక్రియలా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలలో అనేక తైలాలతో మర్దన చేయడం ఆయుర్వేద విధానంలో ఒక మార్గం. అయితే ఇది కేవలం ఒక ఆయుర్వేదానికే పరిమితం కాదు. ఆధునిక వైద్య చికిత్సతో పాటు మరెన్నో చికిత్సా ప్రక్రియల్లోనూ అవసరాన్ని బట్టి మర్దనను ఉపయోగించడం పరిపాటి. ఈ మర్దననే బాడీ మసాజ్‌గా అభివర్ణించవచ్చు. అనేక రుగ్మతల సమయంలో ప్రకృతిచికిత్సలో మసాజ్ థెరపీకి ఉన్న ప్రాధాన్యతను తెలిపేదే ఈ ‘ముందుజాగ్రత్త’. 

బిడ్డ పుట్టి ఎదిగే క్రమంలో స్నానం చేయించే ముందర కాసేపు మాలిష్ చేసినట్లుగా మర్దన చేయడం అనుభవం ఉన్న మాతృమూర్తులు చేసే పనే. తొలిచూలు మహిళలకు, బాలెంతలకూ ఈ విషయం ప్రాధాన్యాన్ని ఇంట్లోని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని బోధపరుస్తారు. ఇదీ మర్దన ప్రాధాన్యం. అంటే బిడ్డ ఆరోగ్యమైన ఎదుగుదలకు ప్రతిబంధకాలు ఎదురుకాకుండా చూసే ‘ముందుజాగ్రత్త’ విధానంగా భావించవచ్చు.  


ప్రకృతిచికిత్స - మర్దనం: 
స్పర్శ ఉపయోగం మనకు తెలిసిందే. దుఃఖం కలిగే సమయంలో ఊరడింపునకు, అనునయానికి స్పర్శ ఉపయోగపడుతుంది. ఈ స్పర్శతో కలిగే ప్రయోజనాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ద్వారా మర్దన చికిత్సను నిపుణులు వైజ్ఞానికంగా అభివృద్ధి చేశారు. దాంతో మర్దన చికిత్స (మసాజ్ థెరపీ) అన్నది ఒక శాస్త్రంగా రూపొందింది. మర్దనప్రక్రియ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను ప్రత్యేకంగా అధ్యయనం చేసిన ఆయుర్వేదం, ప్రకృతి వైద్య విధానం దీన్ని ఒక వైజ్ఞానిక చికిత్స పద్ధతిగా ఇంకాస్త అభివృద్ధి చేశాయి. కేవలం చిన్నతనంలోనే కాదు... పెద్దయ్యాక అనేక శరీరక శ్రమలతో శరీరంలోని కండరాలు అలసటకు గురైనప్పుడు, ఆ కండరాలను సేదదీర్చడానికి మర్దన చాలామట్టుకు ఉపయోగపడుతుంది. దీన్నే ‘బాడీ మసాజ్’ థెరపీగా పేర్కొనవచ్చు.

మన దేశ సంప్రదాయంలో శరీర దారుఢ్యాన్ని పెంపొందించడానికి దండీలు, కుస్తీల వంటి సంప్రదాయ వ్యాయామాలతో పాటు మర్దనాన్ని కూడా ఎన్నో ప్రామాణిక వైద్యగ్రంథాల్లో ఉటంకించారు.

మర్దనలో జాగ్రత్తలు

మర్దనచికిత్సను చేసే నిపుణులు శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు శరీర నిర్మాణాన్ని తెలుసుకోకుండా చేసే మర్దనతో నొప్పి మరింత పెరగవచ్చు. కాబట్టి శరీర నిర్మాణ తత్వాన్ని అనుసరించి మర్దన చేయడం ఈ చికిత్స ప్రక్రియలో అవసరం.

ఏయే ఆరోగ్య సమస్యల్లో...
కొన్ని రకాల పెరాలసిస్‌లు: 

కొన్ని రకాలపైన పక్షవాతాల్లో చచ్చుబడిన శరీర భాగాలను మళ్లీ పునరుజ్జీవింపజేయడానికి మర్దన చికిత్స చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద చికిత్స ప్రక్రియల్లో స్నేహస్వేద ప్రక్రియల్లో ధన్వంతరి తైలం, క్షీరబలాతైలాలతో మర్దన చేయాల్సి ఉంటుంది. 
నరాల నొప్పులకు: 
నరాలు నొక్కుకుపోవడం వల్ల పాకినట్లుగా వచ్చే సయాటికా వంటి కొన్ని నొప్పులలో నరాన్ని, నరం వెళ్లే మార్గాన్ని ఉత్తేజితం చేసినట్లుగా మర్దన చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన మహానారాయణ తైలం వంటి తైలాలను రుద్ది, ప్రకృతిచికిత్స నిపుణులు ఈ మర్దన చేస్తారు.

మాడు నొప్పి, తలనొప్పి: 

తలకు సంబంధించి తరచూ వచ్చే చాలా నొప్పులకు స్వచ్ఛమైన కొబ్బరినూనెతో తలపై మృదువుగా మర్దన చేయాలి. ఇలాంటి నొప్పులలో పడుకోబోయే ముందర మర్దన అవసరమవుతుంది. ప్రకృతి చికిత్సకులు, ఆయుర్వేద నిపుణుల సహాయం తో శరీరానికంతటికీ మసాజ్, ధారాచికిత్స అవసరమవుతుంది.

ఉబ్బసం, ఆయాసం: అలర్జీ వల్ల వచ్చే కొన్ని రకాల ఆయాసాలకు ఆయుర్వేద చికిత్సా విధానంలో కర్పూరతైలం, సైంధవలవణం కలిపిన నువ్వుల నూనెను ఛాతీపెనా, వీపు మీద మర్దన చేసినట్లుగా రుద్ది ఆ తర్వాత వేడినీళ్లతో కాపడం పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

కాలి మడమల నొప్పులకు: 
కాలిమడమల వద్ద గుచ్చినట్లుగా వచ్చే నొప్పులకు ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా మేరకు పిండతైలం, మహానారాయణ తైలాలను సమాన భాగాల్లో కలిపిన తైలంతో నొప్పి వచ్చే భాగంలో దాదాపు అరగంట పాటు మర్దన చేసి, ఆ తర్వాత కాపడం పెట్టుకోవాలి.

కండరాల్లో నొప్పులు: 

బాగా అలసట వల్ల వచ్చిన కొన్ని రకాల కండరాల నొప్పులు ఉపశమించేందుకు మర్దన చికిత్స ఉపయోగపడుతుంది.

కీళ్ల వాతం: 

కీళ్లు బిగుసుకుపోయినట్లుగా అయినందున వచ్చే సమస్యలు... ముఖ్యంగా చికన్‌గున్యా వంటి వ్యాధుల్లో కీళ్ల వాపు, నొప్పి, బిగుసుకుపోవడం వంటి సమస్యలకు మర్దన చికిత్సతో ఉపశమనం ఉంటుంది.

నిద్రలేమి: 

ఇటీవల పెరిగిన నిద్రలేమికి మర్దన చికిత్స సమర్థంగా ఉపయోగపడుతుంది. స్లీపింగ్ పిల్స్ వంటివి వాడకుండానే ఆరోగ్యకరమైన ప్రకృతి చికిత్సామార్గంలో క్రమం తప్పకుండా నిద్రపట్టేలా చేయడం, ‘స్లీప్ సైకిల్’ను క్రమబద్దీకరించేందుకు మసాజ్ థెరపీ ఉపయోగపడుతుంది. 
అధిక బరువు నియంత్రణ: 
ఇటీవల శారీరకమైన శ్రమ చేయడం తగ్గిపోవడం అన్నది మారుతున్న జీవనశైలిలో మనకు అలవడ్డ దురలవాటు. దీనివల్ల బరువు పెరగడం, పొట్ట పెరగడం ఒకసమస్య. అయితే ఇది బయటకు కనిపించే సమస్య కాగా... అజీర్ణం, పొట్టపెరగడం, గ్యాస్, పుల్లటి తేన్పులు, అసిడిటీ, మలబద్దకం వంటిని అంతర్గతంగా వచ్చే అనుబంధ సమస్యలు. కొన్ని రకాల మర్దన ప్రక్రియలతో ఈ సమస్యలకూ మర్దన చికిత్స ఉపయోగపడుతుంది. 
మర్దనతో ప్రయోజనాలు 
శారీరకంగా, మానసికంగా రిలాక్సేషన్ లభిస్తుంది.

చర్మం కాంతివంతం అవుతుంది. ముఖ్యంగా మసాజ్ చేసిన చోట చర్మరంధ్రాలు బాగా తెరుచుకుని చెమటను బయటకు పంపడం వల్ల శరీరంలో మాలిన్యాలు బయటకు వెళ్తాయి.

రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

శరీర కండరాలు సేదదీరుతాయి.

రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే సమస్యలైన కీళ్లనొప్పులు, నడుము, వెన్నెముక, మెడ నొప్పులకు మర్దన చికిత్సతో మంచి ఉపయోగం ఉంటుంది.

చేయకూడని సందర్భాలు...
మానసిక సంతులన లేనివారికి, గర్భణీ స్త్రీలకు పొట్ట మీద మసాజ్ చేయకూడదు.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top