గర్భాశయ సమస్యలకు, సంతాన లేమి, ఆలస్యంగా గర్భధారణ వంటి సమస్యలకు గాయోలో పరిష్కా రాలు

బద్ధకోణాసనం
మందంగా ఉన్న దుప్పటిని మడత పెట్టి రెండు అంగుళాల ఎత్తు వచ్చేట్టుగా చేసి దానిపై స్థిరంగా కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి రెండు కాళ్లని సాధ్యమైనంత వరకు దగ్గరకు తీసుకొని.. పాదాలని దగ్గరగా తీసుకోవాలి. కుడి మోకాలిపై కుడి చేతిని ఎడమ మోకాలిపై ఎడమ చేతిని ఉంచి కింది వైపునకు ఒత్తిడి  తీసుకురావాలి. అలా వీలైనంత సేపు ఉంచాలి. నెమ్మదిగా మామూలు స్థితికి రావాలి. ఇలా ఐదుసార్లు చెయ్యాలి. ఇలా చేస్తే అండాశయాలు, గర్భాశయం దృఢం అవుతాయి. అండాశయాల్లో లోపాలు తగ్గి వాటికి బలం చేకూరుతుంది. తరచూ గర్భస్రావాలు అయ్యేవారికి ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది.
సేతు బంధాసనం 
వెల్లకిలా పడుకొని రెండు మోకాళ్లని మడిచి పిరుదులకు దగ్గరగా ఉంచాలి. రెండు చేతులతో కాలి మడమలని పట్టుకోవాలి. ఇప్పుడు సాధ్యమైనంత వరకు నడుమును పైకి లేపి ఉంచాలి. తలను అతిగా కదిలించకూడదు. కాస్త పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో పది నుంచి ఇరవై సెకన్ల వరకు ఉండాలి. శ్వాస మామూలుగా తీసుకోవాలి. నెమ్మదిగా సమస్థితిలోకి రావాలి. తిరిగి మరల ఇదే విధంగా చెయ్యాలి. ఇలా ఐదారుసార్లు మూడేసి నిమిషాల పాటు చెయ్యాలి. ఈ ఆసనం చెయ్యడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తొలగి.. సంతాన సాఫల్యత పెరుగుతుంది. పిరుదుల దగ్గర పేరుకొనే కొవ్వు తగ్గుతుంది.
ఉపవిస్త కోణాసనం
మందపాటి దుప్పటిని మడతపెట్టి దాని మీద కూర్చోవాలి. రెండు కాళ్లనీ సాధ్యమైనంత దూరంగా పెట్టాలి. రెండు అరచేతులని రెండు కాళ్ల మధ్యలో పెట్టి మెల్లగా రెండు చేతులని సాధ్యమైనంత ముందుకు జరుపుతూ పెట్టాలి. ఈ స్థితిలో పది నుంచి ముప్ఫై సెకన్లపాటు ఉండాలి. మెల్లగా రెండు చేతులని వెనక్కి జరుపుతూ సమస్థితికి రావాలి. ఇలా నాలుగైదు సార్లు చెయ్యాలి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు మోకాళ్లని పైకి లేపకూడదు. ఈ అభ్యాసంతో కటివలయ ఇబ్బందులు తొలగుతాయి. అండాశయాలు ఆరోగ్యంగా ఉంటాయి. నెలసరి సమస్యలు, సంతానలేమి సమస్యలు తొలగుతాయి.
పద్మాసన ముద్ర
ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ఎడమ పాదాన్ని కుడి తొడపై, కుడిపాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉంచి రెండు చేతుల చివరి వేళ్లని కలపాలి. ఇలా కలిపినప్పుడు నాలుగు వేళ్లు కిందకి బొటనవేళ్లు పైకి ఉండాలి. అన్ని వేళ్ల చివర్లు కలిపి ఉంచాలి. ఇలా చేసినప్పుడు మధ్యలో రావి ఆకులాంటి ఆకృతి కనిపించాలి. రెండు చేతులు నాభి దగ్గర ఉంచి కళ్లు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. చేతులు పొట్టకి తాకించకూడదు. ఇలా ఐదు నిమిషాలు చెయ్యాలి. దీనిని యోని ముద్ర అనీ అంటారు. పద్మాసనంలో చెయ్యలేని వారు సుఖాసనంలో చెయొచ్చు. ఈ ముద్ర గర్భాశయ, అండాశయ లోపాలని సరిచేస్తుంది. నాడులన్నీ ఉత్తేజితం అవుతాయి.
విపరీత కర్ణి
సంతాన లేమితో బాధపడేవారు విపరీతకర్ణిని విభిన్నంగా వేయాల్సి ఉంటుంది. గోడకి ఒక దిండు లాంటి దాన్ని వేసుకొని పిరుదులని దిండుపై ఉంచి కాళ్లని నిటారుగా గోడకి తాకించాలి. నడుం, భుజాలు, తల నేలపై ఉండాలి. రెండు చేతులు తలకి ఇరువైపులా విశ్రాంత స్థితిలో ఉండాలి. కళ్లు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. ఒక పెద్ద జలపాతం.. పై నుంచి కిందకి నీరు ప్రవహిస్తున్నట్టుగా వూహించుకొంటూ ఈ ఆసన స్థితిలోకి వెళ్లాలి. దీనివల్ల శరీరం మొత్తానికి రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. పిరుదుల నుంచి గుండెకు అక్కణ్నుంచి మెదడుకి రక్తం చేరుతున్నట్టుగా వూహించుకోవాలి. ఈ స్థితిలో మూడు నిమిషాల వరకు ఉండాలి. ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థకి విశ్రాంతి స్థితి లభిస్తుంది. అధిక ఒత్తిడిదూరమవుతుంది. గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. హార్మోన్ల లోపం ఉన్నవారికి, ఫెల్లోపియన్‌ ట్యూబుల్లో ఇబ్బందులున్న వారు ఈ ఆసనం వేయొచ్చు.        
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top