ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఈ మాసంలోని ముప్ఫైరోజులూ పర్వదినాలే!

కార్తిక శుద్ధపాడ్యమి... తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి, ‘నేను చేయదలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించ’మని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

విదియ:
ఈ రోజు సోదరి ఇంటికెళ్లి ఆమె చేతిభోజనం చేసి, కానుకలు ఇచ్చినవారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.

తదియ:
పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ధి.

చవితి కార్తీక శుద్ధ చవితి:
నేడు నాగుల చవితిసందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరనికి పుట్టలో పాలు పోయాలి.

పంచమి:
దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామి ప్రీత్యర్థం అర్చనలు, అభిషేకాలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుందని ప్రతీతి.

షష్ఠి:
నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సహా ఎర్రగళ్ల కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.


సప్తమి: ఈరోజు ఎర్ర వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడంవల్ల ఆయుష్షు వృద్ధి అవుతుందని శాస్త్రోక్తి,

అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.

నవమి: నేటినుంచి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు రాత్రివిష్ణుపూజ చేయాలి.

దశమి: నేడు విష్ణుసహస్రనామ పారాయణ చేసి, గుమ్మడికాయను, ఉసిరికాయను దానం చేయాలి.

ఏకాదశి: ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్త్తమగతులు కలుగుతాయి.

ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం తులసికోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికీ, ఉసిరికీ కళ్యాణం చేయించడం సకల పాపాలనూ క్షీణింప చేస్తుందని ప్రతీతి.

త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానంచేయడం వల్ల సకల కష్టాలూ దూరమవుతాయని శాస్త్రోక్తి.

చతుర్దశి: నేడు శనైశ్చర ప్రీత్యర్థం ఇనుము, నువ్వులు, పత్తి, మినుములు మొదలైనవాటిని దానం చేయడం వల్ల శని సంతృప్తి చెంది శుభదృష్టిని ప్రసాదిస్తాడు.

కార్తిక పూర్ణిమ: మహా పవిత్రమైన ఈరోజు నదీస్నానం చేసి శివాలయంవద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వ ల్ల పాపాలన్నీ పటాపంచలవుతాయని శాస్త్రోక్తి.

కార్తిక బహుళ పాడ్యమి: ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం.

విదియ: వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది.


తదియ: పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించడంవల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.

చవితి: పగలంతా ఉపవసించి, సాయంత్రంవేళ గణపతిని గరికతో పూజ చేసి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సంపదలు కలుగుతాయి.

పంచమి: చీమలకు నూకలు చల్లడం శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.

షష్ఠి: గ్రామదేవతలకు పూజ జరిపించడం వల్ల వారు సంతుష్ఠులై, ఏ విధమైన కీడూ కలుగకుండా కాపాడతారు.

సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి..

అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి, కాలభైరవానికి (కుక్కకు) సమర్పించడంవల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

నవమి: వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.

దశమి: నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరతాయని పురాణోక్తి.

ఏకాదశి: విష్ణ్వాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణవిశేషఫలదాయకం.  



ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం

త్రయోదశి:
నవగ్రహారాధన చేయడంవల్ల గ్రహదోషాలు తొలగుతాయి.

చ తుర్దశి:
ఈ మాస శివరాత్రినాడు ఈశ్వరార్చన, అభిషేకం చేయడం వల్ల అపమృత్యుదోషాలు, గ్రహబాధలు తొలగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని పురాణోక్తి.

అమావాస్య:
ఈరోజు పితృదేవతల సంతృప్తికోసం ఎవరినైనా పిలిచి వారికి భోజనం పెట్టాలి. లేదా పండితులకు, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. పగలు ఉపవాసం ఉండటం మంచిది. శివకేశవ ప్రీత్యర్థం దీపారాధన చేసి, కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి.

ఉత్తమమైనది ఉత్థాన ఏకాదశి

ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది ఉత్థానఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అని పేరు.

విశిష్ఠ ఫలప్రదం తులసీకళ్యాణం

క్షీరాబ్ధి ద్వాదశినాడు ముప్ఫై రెండు మంది దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనంలో ఉంటాడని చెప్తారు. పూర్వం కృతయుగంలో దేవదానవులు క్షీరసాగరమథనంచేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అనే పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికిన కారణంగా చిల్కు ద్వాదశి అని కూడా పిలుస్తారు. స్త్రీలు ఈ రోజు వారిసౌభాగ్య సంపదల కోసం తులనీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలుచేసి షోడశోపచారాలతో తులసీ కళ్యాణం జరిపి, లక్ష్మీనారాయణులను పూజిస్తారు.


హరిహర వాసం ఈ మాసం
కార్తికమాసం హరునికి ప్రీతిపాత్రమని కొందరు, కాదు, హరికే ఆరాధ్యనీయమని మరికొందరు వాదించుకుంటూ ఉంటారు. కాని ఈ రెండూ తప్పే. హరిహరులిద్దరికీ ఇష్టమైన మాసం కేవలం కార్తికమాసమే. హరిహరులిద్దరూ పరస్పరం అభిమానించుకుంటారు, ఆరాధించుకుంటారు, పూజించుకుంటారు. హరిపూజ హరునికి ఇష్టమైతే, శివపూజ కేశవునికి ప్రీతికరం. రూపభేదం తప్పించి వారిద్దరి మధ్యా విభేదాలేమీ లేవు. అసలు అలా భేదభావంతో చూసే వారిని హరిహరులిద్దరూ మెచ్చరు. కాబట్టి ఈ భేదభావాన్ని విడనాడి ఇరువురినీ పూజించడం శ్రేయోదాయకం.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top