ఎలా వండాలో చెప్పే కోర్సులతోపాటు ఎలా వడ్డించాలో నేర్పడానికి కూడా పాఠాలు

ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన నేపథ్యంలో మన సంప్రదాయ విధానాలకు, పాశ్చాత్య విధానాలు తోడయ్యి కొన్ని కామన్ స్టాండర్డ్స్ రూపొందాయి. మొదటిది... ఆతిథ్యం ఇచ్చే వారు(హోస్ట్) ముందుగా అతిథుల్లో మహిళలను విష్ చేయాలి.

1.హోస్ట్ దగ్గర ఉండి అతిథులను టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి, కుర్చీ వెనక్కు లాగి కూర్చోవలసిందిగా కోరాలి. 


2.మంచినీటి గ్లాసును గెస్ట్‌కు కుడివైపుగా ఉంచి నీటిని పోయాలి (అతిథి కావాలంటే ఎడమవైపుకు మార్చుకుంటారు). నీటిగ్లాసును మూడు వంతుల కంటే నింపకూడదు. భోజనం పూర్తయ్యే వరకు గమనిస్తూ ఖాళీ అయిన వెంటనే నింపుతుండాలి. వాటర్ జగ్గు కింద నాప్‌కిన్ ఉంచితే నీళ్లు జార్ అంచు నుంచి కిందకు కారవు. ఒకరికి సర్వ్ చేసిన తర్వాత మరొకరి కోసం కుడి పక్కకు వెళ్లాలి తప్ప, మనిషి మీద నుంచి వంగి సర్వ్ చేయకూడదు.

3.కోక్, కాఫీ, టీ, హార్లిక్స్ వంటి నాన్‌ఆల్కహాలిక్ బేవరేజ్‌లను అతిథికి కుడివైపు, ఆల్కహాలిక్ బేవరేజ్‌లను ఎడమవైపు సర్వ్ చేయాలి. అలాగే సర్వింగ్ ఆర్డర్ కూడా కుడివైపుకే సాగాలి.

4.సూప్ బౌల్ కింద సాసర్ ఉంచాలి. ప్లేట్‌కు ఎడమవైపు ఫోర్క్, కుడివైపు స్పూను, నైఫ్ ఉండాలి. నైఫ్ అంచుకు దగ్గరగా వాటర్ గోబ్లెట్(మంచినీటి గ్లాసు) ఉండాలి. ఉప్పు, మిరియాల పొడి టేబుల్ మధ్యలో ఉంచాలి. సూప్‌తోపాటు, సలాడ్, స్టార్టర్స్ సర్వ్ చేయాలి. అవి పూర్తయిన వెంటనే ఆ ప్లేట్లు తీసి మెయిన్ కోర్సుకు వేరే ప్లేట్లు పెట్టాలి.


5.భోజనం ప్లేట్‌కు ఎడమ వైపు చిన్న ప్లేట్ ఉండాలి. ఫ్రూట్స్, కేక్, స్వీట్ వంటివి లేదా ఎముకలు, ముళ్లు వంటి వాటిని ఉంచడానికి... ఎలాగైనా వాడుకోవచ్చు.

6.ముందుగా గ్రేవీ, రోటీ, తర్వాత రైస్ ఐటమ్స్‌లోకి రావాలి. ఒక ఐటమ్ నుంచి మరో ఐటమ్‌లోకి మారేటప్పుడు సెకండ్ సర్వ్ ఆఫర్ చేయడం మర్చిపోకూడదు. రైస్‌లలో పులావ్... వాటి కాంబినేషన్, ప్లెయిన్ రైస్, కూరల తర్వాత పెరుగు, ఊరగాయ వడ్డించాలి. పెరుగు వడ్డించేటప్పుడు పాత్ర కింద నాప్‌కిన్ ఉండాలి.

7.మెయిన్ కోర్సు పూర్తయిన తర్వాత మరో చిన్న ప్లేట్‌లో డెజర్ట్ వడ్డించాలి. అందరి భోజనం పూర్తయిన తర్వాత డెజర్ట్ సర్వ్ చేయాలి.

8.వినడానికి వింతగా అనిపిస్తుందేమో కానీ... ప్లేట్లు తీసేటప్పుడు కూడా ఆర్డర్ పాటించాలి. ప్లేట్‌ను కుడిచేత్తో తీసి ఎడమ చేతిలో పెట్టుకోవాలి. డెజర్ట్ అందరి భోజనం పూర్తయిన తర్వాత మాత్రమే ఇవ్వాలని చెప్పాను, ప్లేట్‌లను మాత్రం నలుగురిలో ఒకరి భోజనం పూర్తయితే వెంటనే దానిని తీసేయాలి. మిగిలిన వారు పూర్తి చేసే వరకు ఆగాల్సిన పనిలేదు.





9.అందరూ స్పూన్లు, ఫోర్కులు వాడరు కాబట్టి గోరు వెచ్చని నీటిలో చిన్న నిమ్మచెక్క వేసి ఫింగర్ బౌల్ ఉంచాలి. చివరగా పాన్ ఆఫర్ చేస్తే చాలు. మీ ఆతిథ్యం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ను గుర్తు చేస్తుంది.

మరికొన్ని

లిక్విడ్స్‌ను సర్వ్ చేసే ట్రేలో గ్లాసుల కింద డాలే పేపర్ వేస్తే, ఒలికిన ద్రవాలను పేపర్ పీల్చుకుంటుంది. టేబుల్ క్లాత్, నాప్‌కిన్‌లు, ప్లేట్లు శుభ్రంగా ఉండాలి. కొంతమందికి ప్లేట్‌ను వాళ్లు తుడుచుకుంటేనే తృప్తి. అందుకోసం నాప్‌కిన్‌ను చక్కగా మడతపెట్టి ప్లేట్‌లోనే ఉంచాలి. వండిన పదార్థాలు, తర్వాత అవసరమయ్యే ప్లేట్లు, కట్లరీ వంటివాటిని సైడ్ టేబుల్ మీద అమర్చాలి.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top