డయాబెటిస్ శరీరంలోని వేర్వేరు అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఆయా అవయవాలకు, డయాబెటిస్‌కు ఉన్న సంబంధం, దాని నివారణ

డయాబెటిస్... గుండె:
  మిగతా వారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారిలో గుండెజబ్బులు లేదా గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు రెట్టింపు. ఒకసారి గుండెపోటు వచ్చిన వారికంటే... డయాబెటిస్ ఉన్నవారికి గుండెపోటు రిస్క్ మరింత ఎక్కువ. సాధారణంగా మెనోపాజ్ రాని మహిళలకు పురుషులతో పోలిస్తే గుండెపోటు రిస్క్ తక్కువ. కానీ... డయాబెటిస్ వచ్చిన మహిళలకు ఈ సూత్రం వర్తించదు. ఒకసారి డయాబెటిస్ వస్తే మహిళలు మెనోపాజ్ రాకపోయినా గుండెపోటుకు అవకాశాలు పెరిగిపోతాయి. 


డయాబెటిస్ ఉండటం గుండెపోటు రిస్క్‌ను పెంచుతుంది. అలాగే కుటుంబంలో ఎవరికైనా 55 ఏళ్లకు ముందే గుండెపోటు వస్తే... ఆ కుటుంబంలోని మిగతావారికీ గుండెపోటు రిస్క్ ఉంటుంది. అయితే ఫ్యామిలీ హిస్టరీ అనే రిస్క్ ఫ్యాక్టర్‌ను తప్పించలేకపోయినా... డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకుంటే తద్వారా వచ్చే రిస్క్‌ను తగ్గించవచ్చు.

డయాబెటిస్... పక్షవాతం: 

డయాబెటిస్ మెదడులోని రక్తనాళాలపై చూపే దుష్ర్పభావంతో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. మెదడుకు అనేక రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి. ఆ రక్తనాళాలు బ్లాక్ అయితే స్ట్రోక్ వస్తుంది. రక్తంలో కొవ్వు పదార్థాలు పెరగడం వల్ల అవి బ్లాక్ అయితే పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కవ. డయాబెటిస్ ఉన్నవారిలో ఇలా రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ అన్నమాట. పక్షవాతంలో సాధారణంగా ఉండే కాలూ చేయి చచ్చుపడటం, అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోవడం, అయోమయం, ఒక కన్ను లేదా రెండు కళ్లు కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపించాక... అవి 24 గంటలలోపు తగ్గిపోయి రోగి మామూలుగా మారితే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’ (టీఐఏ) అని అభివర్ణిస్తారు. 24 గంటల తర్వాత కూడా రోగి కాలూ చేయి మామూలుగా మారకపోతే దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్‌గా పరిగణిస్తారు. ఈ ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్‌ను ‘మినీ స్ట్రోక్’గా చెబుతారు. పక్షవాతం వచ్చే అవకాశాలను డయాబెటిస్ పెంచుతుంది. గుండెజబ్బుల నివారణకు పేర్కొన్న సాధారణ ఆరోగ్యకరమైన సూచనలు అనుసరించడం వల్ల పక్షవాతం ప్రమాదాన్ని కూడా చాలామట్టుకు నివారించవచ్చు. 


డయాబెటిస్ - మూత్రపిండాలు:
మన మూత్రపిండాల్లో వడపోతకు ఉపయోగపడే అతి చిన్న యూనిట్‌ను ‘గ్లోమెరూలీ’ అంటారు. ఇది పూర్తి సామర్థ్యంతో పని చేసేటప్పుడు రక్తంలో నుంచి శరీరానికి అవసరమైన ‘ప్రోటీన్స్’ను కోల్పోకుండా నివారిస్తుంటుంది. అయితే హైబీపీ ఉన్నవారిలో కిడ్నీలు చెడిపోయినప్పుడు ప్రోటీన్స్ మూత్రంలోంచి బయటకు పోకుండా ఆపే నియంత్రణ ప్రక్రియ జరగదు. దాంతోపాటు శరీరంలోని బయటకు వెళ్లాల్సిన మాలిన్యాలను తీసివేయడం కూడా సక్రమంగా జరగదు. ఫలితంగా శరీరంలో అనేక మాలిన్యాలు పోగుపడతాయి. అయితే కిడ్నీ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వచ్చే లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. దీన్ని తెలుసుకోడానికి మూత్ర పరీక్ష ఒకటే మార్గం. మూత్రంలో ఆల్బుమిన్ వంటి ప్రోటీన్లు పోతున్నాయని తెలిస్తే అది కిడ్నీ సక్రమంగా పనిచేయడం లేదనడానికి ఒక సూచన. డయాబెటిస్ ఉన్నవారిలో కిడ్నీ పనితీరును దెబ్బతీనే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ (డీకేడీ) వంటివి కనిపిస్తాయి.

డయాబెటిస్‌తో మూత్రపిండాల సమస్య వస్తే: 

మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోవడాన్ని గమనించినప్పుడు దాని పనితీరును మళ్లీ మునపటిలా మామూలుగా అయ్యేటట్లు చూడటం లేదా అది సాధ్యపడకపోతే అది మరింత దెబ్బతినకుండా చూసుకోవడం చేయాలి. ఇందుకోసం రక్తంలో గ్లూకోజ్ పాళ్లను పెరగకుండా చూసుకోవాలి. ఏసీఈ ఇన్హిబిటార్స్ వంటి మందులు లేదా ఏంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్ వంటి మందులు తీసుకోవడం ద్వారా రక్తపోటును, మూత్రపిండాలు దెబ్బతినడం... ఈ రెండింటినీ తగ్గించవచ్చు. అయితే గర్భిణులు ఇవి తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా రక్త, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ కిడ్నీల పనితీరును సక్రమంగా ఉందా లేదా అన్నది తెలుసుకుంటూ ఉండాలి. 

డయాబెటిస్ - కన్ను: 
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు పెరగడం, రక్తపోటు పెరగడం... ఈ రెండు సమస్యలతో రెటీనా, విట్రియస్, లెన్స్, ఆప్టిక్ నర్వ్ దెబ్బతినవచ్చు.

డయాబెటిస్ - నరాల సమస్యలు: 

డయాబెటిస్ ఉన్నవారిలో నరాలకు సంబంధించిన న్యూరోపతి అనే సమస్య రావడం చాలా సాధారణం. అప్పుడు శరీరమంతా నరాలు దెబ్బతినవచ్చు. కొంతమందిలో దీని లక్షణాలు కనిపించకుండా ప్రమాదం నిశ్శబ్దంగా జరిగిపోతుంటుంది. మరికొందరిలో నొప్పులు, చేతుల్లో కాళ్లలో తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని ఏ భాగంలోని నరాలైనా దెబ్బతినవచ్చు. అంటే... గుండె, సెక్స్ చేయడానికి ఉపయోగపడే అవయవాలు, జీర్ణక్రియకు అవసరమైన అవయవాలు... ఇలా ఏ భాగంలోని నరాలు దెబ్బతిన్నా ఆ వ్యవస్థ కుంటుపడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్న 60%-70% మందిలో న్యూరోపతి సమస్యలు కనిపిస్తుంటాయి. డయాబెటిస్ వచ్చాక ఏ దశలోనైనా ఈ సమస్య కనిపించవచ్చు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ న్యూరోపతి వచ్చే అకవశాలు పెరుగుతుంటాయి. సాధారణంగా డయాబెటిస్ వచ్చి 25 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువ. రక్తంలో గ్లూకోజ్ పాళ్లను నియంత్రణలో ఉంచుకోని వారిలో ఇవి మరీ ఎక్కువ.

డయాబెటిస్‌తో వచ్చే కంటి సమస్యల నివారణ కోసం

రక్తంలో గ్లూకోజ్ పాళ్లను, రక్తపోటును సాధ్యమైనంతగా నియంత్రించుకొని నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి కంటి డాక్టర్‌ను కలిసి కాటరాక్ట్, గ్లకోమా వంటి సమస్యలుగానీ, డయాబెటిస్ వల్ల కంటికి వచ్చే సమస్యలు గాని ఉన్నాయేమోనని తెలుసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు కంటి డాక్టర్‌ను సంప్రదించి కంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఒకవేళ డయాబెటిస్ ఉన్నవారికి ప్రెగ్నెన్సీ వస్తే మొదటి మూడు నెలలు కంటి డాక్టర్‌తోనూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

నియంత్రణ
రక్తంలో చక్కెరపాళ్లను సాధ్యమైనంత వరకు సాధారణ స్థాయుల్లో ఉంచుకోవడం.
అదుపులోనే ఉందని తెలుసుకోవడం ఎలా:
దీన్ని ఏ, బి, సి... అన్న మూడు పరీక్షలతో తెలుసుకోవచ్చు.

ఫర్... ఏ1సి

డయాబెటిస్ ఉన్నవారు మందులు తీసుకుంటూ ఉన్నప్పుడు రక్తంలో చక్కెరపాళ్లు నియంత్రణలోనే ఉన్నాయని తెలుసుకోడానికి ఏడాదిలో రెండుసార్లు హెచ్‌బీఏ1సి పరీక్ష చేయించాలి. ఈ పరీక్ష వల్ల గత మూడు నెలల వ్యవధిలో రక్తం చక్కెరపాళ్లు నార్మల్‌గానే ఉన్నాయా లేక ఎక్కువగా ఉన్నాయా అన్నది తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ పరీక్షలో ఏ1సీ పాళ్లు 7% కంటే తక్కువగా ఉండాలి.

ఫర్... బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ టెస్ట్స్
బ్లడ్ ప్రెషర్ కొలత 130/80 ఉంటే అది సాధారణం అని గుర్తుంచుకోవాలి భోజనానికి ముందు రక్త పరీక్షలో చక్కెర పాళ్లు 90 నుంచి 130 ఎంజీ/డీఎల్ మధ్యన ఉండాలి భోజనం తీసుకున్న గంట నుంచి రెండు గంటల మధ్య చక్కెర పాళ్లు 180 ఎంజీ/డీఎల్ ఉండాలి.

ఫర్... కొలెస్ట్రాల్
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) 100 ఎంజీ/డీల్ కంటే తక్కువ ఉండాలి ట్రైగ్లిజరైడ్స్ 150 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) 40 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువ ఉండాలి.
  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top