గుండెపోటు వచ్చాక మందులు ఎలాగూ వాడక తప్పదు. కానీ... అసలది రాకుండానే చూసుకునేందుకు మొదట్నుంచే మందులు తీసుకోవచ్చా?

‘‘గుండెపోటు వచ్చాక మందులు ఎలాగూ వాడక తప్పదు. కానీ... అసలది రాకుండానే చూసుకునేందుకు మొదట్నుంచే మందులు తీసుకోవచ్చా?’’ ఈ ప్రశ్న కొందరిని వేధిస్తూ ఉంటుంది. ప్రధానంగా కుటుంబంలో గుండెపోటు ఉన్న వారు మందులు తీసుకుంటూ ఉంటే... అవే మందులు తామూ వాడితే గుండెపోటు రాదేమో అనే ఆలోచనా ఉంటుంది. దానిలోని వాస్తవాలను తెలుసుకోవడంతో పాటు ముందుజాగ్రత్త.

ఒకసారి గుండెజబ్బులు వచ్చినవారు మళ్లీ అది తిరగబెట్టకుండా ఉండేందుకు కొన్ని మందులు వాడుతుంటారు. ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, రామిప్రిల్ వంటివి అందులో కొన్ని.

మందులు రెండో దశలోనే:  

జబ్బు ఏదీ లేనప్పుడు రాకుండా చూసుకునే నివారణను ప్రాథమిక నివారణ (ప్రైమరీ ప్రివెన్షన్) అంటారు. అయితే గుండెపోటుగాని, బ్రెయిన్‌స్ట్రోక్ వంటిదిగాని ఒకసారి వచ్చాక మళ్లీ రాకుండా ఉండేందుకు తీసుకునే మందులు, పాటించే పద్ధతులను సెకండరీ ప్రివెన్షన్‌గా పేర్కొంటారు. సాధారణంగా మధుమేహం, రక్తపోటు ఉన్నట్లు బయడపడ్డాక గుండెజబ్బులు రాకుండా తీసుకునే జాగ్రత్తలను ప్రైమరీ ప్రివెన్షన్‌గానే గుర్తించాలి. అసలు మధుమేహం లాంటివి రాకుండా ముందుగానే జాగ్రత్త పడటమే ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అవుతుంది. అయితే ముందునుంచే మందులు వాడుతుంటే అసలు జబ్బే రాదు కదా అనే ఆలోచన కొందరిలో ఉంటుంది. ఇందులోని వాస్తవాలు.

రిస్క్‌ఫ్యాక్టర్స్: కొందరిలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. దానికి దోహదపడే అంశాలను రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అవి...

వయసు: నలభై ఏళ్ల వయసు దాటాక గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.

మధుమేహం: చక్కెర వ్యాధి ఉన్నవారిలో గుండె జబ్బులకు ఆస్కారం ఎక్కువ.

రక్తపోటు: బీపీ ఎక్కువగా ఉన్నవారికి

కొలెస్ట్రాల్: రక్తంలో కొలెస్ట్రాల్ వంటి కొవ్వు పదార్థాలు ఉన్నవారికి ;

స్మోకింగ్: పొగతాగే అలవాటు ఉన్నవారికి;

స్థూలకాయం: ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నవారికి గుండెజబ్బుల అవకాశం ఎక్కువ. మూత్రపిండాల వ్యాధి ఉండటం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. మహిళలకంటే పురుషుల్లో గుండెజబ్బులు ఎక్కువ.

వ్యాయామంతో గుండెజబ్బులు దూరం: 

ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ వ్యాయామం తప్పనిసరిగా చేయడం వల్ల గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చని పరిశోధనల్లో తేలింది. కనీసం చిరుచెమటలు వచ్చే దాకానో లేదా కొద్దిగా వేగంగా ఊపిరితీసుకునే దాకానో ఈ వ్యాయామం చేయాలి.అంతకంటే తక్కువ చేస్తే అది అలంకారప్రాయం అవుతుంది. ప్రతిరోజూ కనీసం 50 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇంక దీనితో పాటూ రోజూ ఆఫీస్ పనుల మధ్య కూడా నడవడం, అంతస్తులు ఎక్కడానికి లిఫ్ట్ బదులు మెట్లు ఉపయోగించడం వంటివి చేస్తుండాలి.

ఎంతెంత ఉండాలి:

గుండెజబ్బులు ఉన్నవారిలో రక్తపోటు విలువ 130/80 కంతే తక్కువగానూ, గుండెజబ్బులు లేనివారిలో 140 / 85 కంటే తక్కువగానూ ఉండాలి.

కొలెస్ట్రాల్ పాళ్లు: రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్ పాళ్లు...
200 కంటే తక్కువ ఉండాలి.

చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పాళ్లు...
100 కంటే తక్కువ ఉండాలి.

మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పాళ్లు...
40 కంటే ఎక్కువగా ఉండాలి.

ట్రైగ్లిజరైడ్స్ అనే రకం కొవ్వు పాళ్లు...
200 కంటే తక్కువగా ఉండాలి.

...మందులతోనే నివారణ ఎప్పుడు?

హై రిస్క్ ఉన్నవారికి తప్ప - సాధారణ రిస్క్ ఉన్నవారికి మందులు ఉపయోగించడం శ్రేయస్కరం కాదు. అందువల్ల గుండెజబ్బుల నివారణ కోసం స్టాటిన్స్ మినహా మిగతా వాటిని ఉపయోగించడం మంచిది కాదు. స్టాటిన్స్ కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి ఆస్ప్రిన్‌ను పురుషుల్లో 50 ఏళ్లు దాటిన వారికి, మహిళల్లో 60 ఏళ్లు దాటిన వారికి, ఒకటికి మించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఉపయోగించాలి

మధుమేహంతో పాటు రక్తపోటు, రక్తంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి ఆస్ప్రిన్ వాడతారు మధుమేహం ఉండి పొగతాగే అలవాటు ఉన్నవారికి ఆస్ప్రిన్ ఉపయోగిస్తారు మధుమేహం ఉండి మూత్రంలో మైక్రో-ఆల్బుమిన్ పోయేవారికి ఆస్ప్రిన్ ఉపయోగిస్తారు. పై అంశాలు లేకపోతే ఆస్ప్రిన్ వాడటం వల్ల రిస్క్ ఎక్కువ.

నివారణకు మంచి మార్గాలు  

మందుల కంటే ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పుల వల్లనే గుండెజబ్బుల నివారణకు మంచి అవకాశం ఉంది.

కొవ్వు పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవాలి ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఖచ్చితంగా గుండెజబ్బులను నివారిస్తాయని శాస్త్రీయంగా నిర్ధారణ కాకపోయినా... అవి తీసుకోవడం అన్నది ఆరోగ్యానికి మంచిది కాబట్టి వాటిని తీసుకోవడం మంచిదే. అవి చేపల్లో ఎక్కువ కాబట్టి వారంలో రెండు సార్లు చేపలు తినడం మంచిది ఒక రోజు ఒక వ్యక్తి తినే ఉప్పు ఆరు గ్రాముల కంటే తక్కువగా ఉండాలి

రోజూ కనీసం 400 గ్రాముల పండ్లు తినడం వల్ల గుండెజబ్బుకు అవకాశాలు చాలా తక్కువ.
  

సెకండరీ ప్రివెన్షన్‌గా వాడే మందులు... గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఆస్ప్రిన్: సాధారణంగా నొప్పుల నివారణతో పాటు ఆస్ప్రిన్ మాత్ర రక్తాన్ని పలచబార్చడం కోసం కూడా ఉపయోగపడుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉండదు. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే ఒకసారి గుండెపోటు వచ్చినవారు జీవితాంతం ఆస్ప్రిన్ మాత్ర తప్పకుండా వేసుకోవాలి.
గుర్తుంచుకోవాల్సిన విషయం: గుండెజబ్బు లేకుండానే ఆస్ప్రిన్ వాడటం వల్ల అంతగా గుణం కనిపించదు. పైగా ముందునుంచే మాత్రలు వేసుకోవడం వల్ల రక్తం పలచగా అయిపోయి రక్తస్రావం జరిగే అవకాశాలు పెరిగి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసే అవకాశం కూడా ఉంది. అందుకే కొంతకాలం క్రితం మధుమేహం ఉన్నవారికి గుండెజబ్బులు ఉన్నా లేకపోయినా ఆస్ప్రిన్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం దాని వల్లనే సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువని శాస్త్రపరిశోధనల్లో వెల్లడయ్యాక మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ కాకుండా కేవలం హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే దీన్ని ఇస్తున్నారు.
 

స్టాటిన్స్: రక్తంలో ఉండే కొవ్వు పాళ్లను తగ్గించే మందులివి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తాయి. అందుకే గుండెపోటు వచ్చిన ప్రతివారిలో ఈ మందును జీవితాంతం ఇస్తారు. అంతేకాదు... మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి చక్కెర వ్యాధి ఉంటే స్టాటిన్లు తప్పనిసరిగా వాడతారు.
 గుర్తుంచుకోవాల్సిన విషయం: కేవలం రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గాక... తక్కువ రిస్క్ ఉన్నవారికి సైతం స్టాటిన్స్ వాడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ అని తేలింది. దాంతో రక్త పరీక్షల్లో ‘హెచ్‌ఎస్ సిఆర్‌పీ’ విలువ - 2 ఎంజీ కంటే ఎక్కువగా ఉంటే గుండెపోటు లేనివాళ్లకి గుండెజబ్బులను నివారించవచ్చని తేలింది. అందుకే స్టాటిన్స్ వాడాలంటే ముందుగా డాక్టర్ తగిన పరీక్షలు చేసి అవి తీసుకోవాలా లేదా అన్నది నిర్ధారణ చేయాలి.


రామిప్రిల్: రక్తపోటు ఉన్నవారికి మాత్రమే ఈ మందులు ఉపయోగించాలి. ఎందుకంటే ఈ మందు రక్తపోటును తగ్గించి తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం: రక్తపోటు లేకుండా ఈ మందు వాడటం వల్ల ప్రయోజనం ఉండదు. ఆహారంలో ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించడం, మద్యపానం మానివేయడం, నడక లాంటి వ్యాయామాలు, పచ్చికూరలు తీసుకోవడం వంటివి చేశాక కూడా రక్తపోటు అదుపులో రానివారు మాత్రమే ఈ మందులు మొదలుపెట్టాలి.

బీటాబ్లాకర్స్: ఒకసారి గుండెపోటు వచ్చిన వారిలో మాత్రమే ఇవి ఉపయోగపడతాయి.

గుర్తుంచుకోవాల్సిన విషయం: గుండెజబ్బులు లేకుండానే వీటిని వాడితే భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా అవి కాపాడగలవన్న భరోసా ఏదీ లేదు. కేవలం రక్తపోటు ఉన్నవారికి లేదా ఒకసారి గుండెపోటు వచ్చినవారికి మాత్రమే వీటిని ఉపయోగిస్తారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top