వెన్నెముక నొప్పి సంబంధించిన కొన్ని సమస్యలు మంచి శస్త్రచికిత్స పద్ధతులు


వెన్ను అంటేనే బలానికి ఒక ప్రతీక. నిటారుగా నిల్చోడానికి దోహదపడేది వెన్నెముక. ఆహారం, మనం నిల్చునే ప్రక్రియ, రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు వంటి ఎన్నో అంశాలు ఆరోగ్యకరమైన వెన్నెముకకు దోహదపడతాయి. అయితే ఇటీవల వెన్ను నొప్పితో బాధపడేవారి సంఖ్య పెరిగింది. మనం కూర్చుని పనిచేసే సమయంలోనూ వెన్నెముక నొప్పిని నివారించడానికి దానికి మంచి సపోర్ట్ అవసరం. అయితే చాలా సందర్భాల్లో దాన్ని సరిగ్గా చూసుకోకపోవడంతో వెన్నునొప్పుల వంటివి ఎక్కవగా వస్తున్నాయి. అయితే వెన్ను నొప్పిని చాలావరకు నివారించవచ్చు. ఒకవేళ వెన్నుకు సంబంధించిన కొన్ని సమస్యలు వచ్చినా గతం కంటే మంచి శస్త్రచికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.

సరైన పద్ధతిలో కూర్చోకపోవడం లేదా వెన్నును ఉంచకపోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. చాలా మంది తమ ఉద్యోగ బాధ్యతల వల్ల వెన్నును సరైన పద్ధతిలో ఉంచలేకపోతుంటారు. పైగా ఉద్యోగుల్లో చాలామంది ఒకేచోట కూర్చుని పనిచేసే వృత్తిలో ఉంటారు. అలాంటి వృత్తుల్లోని వారు సరైన పద్ధతిలో కూర్చోలేకపోవడంతో వెన్నునొప్పి సహజం.  


జన్యుపరమైన అంశాలు: 
కొందరిలో కుటుంబంలోనే సాధారణంగా వెన్నునొప్పులు ఎక్కువగా ఉంటాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, న్యూరోఫెబ్రొమాటిస్, స్కోలియోసిస్, మెదడు లేదా వెన్నుపూసలలో ఉండే కొన్ని అసాధారణత (అనామలీ)ల వల్ల వెన్ను నొప్పి వస్తుంది. ఈ తరహా సమస్యలు పుట్టుకతో వచ్చే లోపాల కారణంగా వస్తాయి. దగ్గరి బంధువులను పెళ్లిళ్లు చేసుకోవడం అన్నది ఈ తరహా సమస్యలకు ఎక్కువగా దోహదపడే అంశం.

పిల్లలు స్కూల్ బ్యాగ్‌ను మోస్తున్న సమయంలో వాళ్ల భుజాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో కూడా వెన్ను నొప్పి రావచ్చు. అయితే కేవలం ఆ కారణంగానే పిల్లలకు వెన్ను నొప్పి వస్తుందనే అంశంపై ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. వారి సామర్థ్యం కంటే ఎక్కువ భారాన్ని మోసే సమయంలో ఒకటి రెండు తరాల తర్వాతి వారికి వెన్నునొప్పి వస్తుంది. 


ఆస్టియోపోరోసిస్: 
ఎముక బలహీనమైపోయే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేసియా వంటి వ్యాధులు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. దాంతో వచ్చే సమస్యలైన ఫ్రాక్చర్లు, ఇతర కాంప్లికేషన్స్ ఎక్కువ. పైగా పొట్ట తగ్గించడానికి చేయించుకునే బేరియాటిక్ సర్జరీలతో కాల్షియం, విటమిన్ డి వంటి సప్లిమెంట్లు సరిగా అందకపోవడం వల్ల కూడా ఎముక సాంద్రత కోల్పోయి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే వెన్నునొప్పి నివారణకు పూర్తి పోషకాలు అందేలా చూడటం కూడా అవసరం. స్టెరాయిడ్స్, థైరాక్సిన్, గ్రోత్ హార్మోన్స్, కీమోథెరపీ... వంటి సందర్భాల్లోనూ ఎముకలపై వాటి ప్రభావం ఉంటుంది. వెన్నెముక కూడా దానికి మినహాయింపు కాదు.

సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్, మైలోపతి: 

చాలా సందర్భాల్లో మెడ దగ్గర నుంచి భుజానికి నొప్పి పాకడం వంటి సమస్య కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో భుజం నుంచి చేతి వేళ్ల వరకు కాస్త బలహీనంగా మారినట్లుగా కూడా అనిపించవచ్చు. వెన్నెముకలోని డిస్క్‌లు ఒకదానితో మరొకటి ఒత్తుకోవడం వల్ల ఇలాంటి సమస్య రావచ్చు. దాన్ని సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. దీని వల్ల వెన్నులో కొన్ని శాశ్వత (ఇర్రివర్సిబుల్) మార్పులు రావచ్చు. అందుకే కొన్ని సందర్భాల్లో ముందుగానే సమస్యను కనుగొని తగిన చికిత్స తీసుకోవడం అవసరం. మరికొన్ని సందర్భాల్లో వెన్నులో నొప్పి... వీపుకు పైభాగంలో మెడ వద్ద ఉన్న వెన్నుపూసలలో నొప్పితోనూ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మందులు కూడా పనిచేయనప్పుడు అత్యంత సునిశితంగా నిపుణులు శస్త్రచికిత్సతో ఆ సమస్యలకు చికిత్స చేయవచ్చు.  


ప్రమాదాలు (ట్రామా): 
కొన్ని సందర్భాల్లో వెన్నుపూసలలో దేనికైనా దెబ్బతగలడం వల్ల అవి ఉన్న స్థానం నుంచి పక్కకు జరగవచ్చు. అలాంటప్పుడు కూడా మున్ముందు నరాలకు సంబంధించిన కొన్ని సమస్యలను నివారించడానికి అత్యవసరంగా వెన్నుకు శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది.

వెన్నునొప్పి నివారణ కోసం...
చిన్న పిల్లలుగా ఉన్న సమయంలోనే వెన్నుకు ఏదైనా సమస్య వస్తే అది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ టైమ్‌లో వారికి ఎలాంటి సమస్యా లేకుండా చూడాలి. పిల్లలు స్కూల్ బ్యాగ్‌ను వీపుపై మోస్తున్నప్పుడు అది మరీ కిందికి జారిపోకుండా వీపు పై భాగంలో (అప్పర్ బ్యాక్) ఉంచేలా చూడాలి. స్కూల్ బ్యాగ్ వీపుపై మోసుకెళ్లకుండా చక్రాలపై రోల్ చేసేది ఉంటే మంచిది.

పిల్లలు స్కూల్లోనూ, పెద్దలు పనులు చేసే ప్రదేశంలో ఒంగిపోయినట్లుగా గాక వెన్నును నిటారుగా ఉంచేలా కూర్చోవడం (ఎర్గానమికల్లీ రైట్ పొజిషన్) అలవాటు చేయిస్తే మంచిది.

సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయ్యేలా ఆరుబయట తిరగడంతో పాటు మంచి వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలకు సరైన పాళ్లలో క్యాల్షియమ్ అంది ఎముకలు గట్టిపడతాయి.

బరువు తగ్గించుకోవడంతో వెన్నుపై పడే భారం తగ్గుతుంది.

పొగాకు నమలడం, ఆల్కహాల్ తాగడం వంటి దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. 



వీలైనంతగా దగ్గరి బంధువులతో వివాహాలను నివారించడమే మంచిది.

కొన్ని మందులు వాడుతున్నప్పుడు ఎముకలపై వాటి ప్రభావాన్ని గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. మందుల బయోకెమికల్ స్వభావం, వాటి హానికరమైన ప్రభావం, రిస్క్ వంటి అంశాలు తెలిసి ఉండే క్వాలిఫైడ్ నిపుణులను సంప్రదించడం మంచిది.

గాటు తక్కువగా ఉండే శస్త్రచికిత్సలు: 

మందులతో వెన్నునొప్పి తగ్గకపోతే... ఇప్పుడు అన్ని రకాల వెన్ను సమస్యలకు, సర్వైకల్ డిజార్డర్స్‌కు చాలా సమర్థంగా చేయదగిన సర్జికల్ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి వెన్నుకు ముందూ, వెనకా... ఇలా రెండు వైపులా కూడా చేయదగిన సర్జరీలు అందుబాటులో ఉన్నాయి.

మాగ్నిఫికేషన్: ఇప్పుడు మైక్రోస్కోప్ సహాయంతోనూ, వెన్నెముక వద్ద మంచి వెలుగు ప్రసరింపజేయడం ద్వారానూ వెన్నెముకను పదింతలు పెద్దగా చూసి సమర్థంగా శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతోంది.

మెడ వెనక భాగంలో నొప్పి... 

వెన్నెముకలో భాగంగా మెడ నుంచి మొదలై నడుము వరకు 32 నుంచి 34 ఎముకలుంటాయి. వీటిలో మెడభాగంలో ఉండే ఏడు వెన్ను ఎముకలను సర్వైకల్ స్పైన్‌గా చెబుతారు. శరీరం మొత్తం బరువును వెన్ను నేరుగానో లేదా ఇతరత్రా భరిస్తూనే ఉంటుంది. దాంతో మెడ భాగంలోని వెన్నుపూసలు అరగడం వల్ల ఒక్కోసారి వెన్ను నొప్పి వస్తుంది. ఇది మెడ వెనక భాగంలో కనిపిస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. కొందరిలో ఇది పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల కూడా రావచ్చు. మెడభాగంలో నొప్పి మొదలై, వేళ్ల చివరల్లో తిమ్మిర్లు, మొద్దుబారినట్లుగా ఉండటం వంటి సమస్య వచ్చి నడక కూడా కష్టమైతే ఆ కండిషన్‌ను మైలోపతి అంటారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చేయి లాగడం, మెడలోని వెన్నుపూసలు నొక్కుకుపోయి అది పెరాలిసిస్‌గా మారకుండా ఉండేందుకు రైడా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top