చెమటలు ఎక్కువా...? అయితే ఇది చూడండి.

చెమట పట్టడం ప్రతివారికి సర్వసాధారణం. మనుషుల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిం చడానికి చెమట గ్రంథులు ఉపయోగపడతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. ఒంటినిండా చెమట గ్రంథులు మనుషులకు ఉంటాయి. 

చెమటకు మూలం
చెమట ఎక్రైన్ (స్వెట్) గ్లాండ్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మనిషి చర్మం మీద చెమట గ్రంథుల సంఖ్య అన్నది పుట్టినప్పుడే నిర్ణయమవుతుంది. పుట్టిన తరవాత కొత్తగా ఎక్రైన్ గ్లాండ్స్ అభివృద్ధి చెందవు. అయితే పుట్టాక రెండేళ్ల వయసు వచ్చేవరకు ఇవి పూర్తిస్థాయిలో పనిచేయవు. ఎక్రైన్ చెమట గ్రంధులు - పెదవులు, గోళ్లు, చెవి బయటి భాగం మినహా మిగతా శరీరమంతా వ్యాపించి ఉంటాయి.

చెమట వల్ల ఉపయోగాలు

సాధారణంగా వేడి, ఒత్తిడి ఉన్నప్పుడు చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అది ఆవిరి అయ్యే ప్రక్రియ శరీరాన్ని చల్లబరుస్తుంది. అంటే శరీరాన్ని చల్లగా ఉంచడానికి చెమట పట్టడం అవసరమన్నమాట. చెమట స్రవించడం అనే ప్రక్రియను మెదడులోని హైపోథలామస్ అనే భాగం నియంత్రిస్తుంది. చెమట ఎక్కువగా పట్టడం వల్ల చాలా సమస్యలు కలుగుతాయి. చెమట పట్టడం అవసరమే అయినా అది ఎక్కువగా పడుతుంటే మరికొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అధికంగా చెమట పట్టడాన్ని వైద్య పరిభాషలో ‘హైపర్ హిడరోసిస్’ అంటారు.  ఇది రెండు రకాలు...
జనరలైజ్‌డ్ హైపర్‌హిడరోసిస్ (శరీరమంతా విపరీతమైన చెమట పట్టడం), లోకలైజ్‌డ్ హైపర్‌హిడరోసిస్ (శరీరంలోని కొన్ని భాగాలకు మాత్రమే చె మట పట్టడం)

జనరలైజ్‌డ్ హైపర్ హిడరోసిస్‌కి కారణాలు...

చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో చెమట పట్టడం తక్కువ. వేసవిలో అంటే మార్చి నెల నుంచి వేడి మొదలవుతుంది. అప్పుడు చెమట పట్టడం ప్రారంభమవుతుంది. వేడి పెరిగే కొద్దీ చెమట కూడా ఎక్కువ అవుతుంటుంది. ఇది దాదాపు అందరిలోనూ ఉంటుంది. ఇవే కాక... వ్యాయామం చేసిన తరవాత చెమటలు ఎక్కువ వైరల్ ఫీవర్, మలేరియా జ్వరాల్లో శరీరం ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. చెమటలు పట్టాక శరీరం చల్లగా అయిపోతుంది.గుండెకు సంబంధించిన వ్యాధులు అంటే షాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సందర్భాల్లోనూ చెమటలు పడతాయి.ఎండోక్రైన్ లేదా హార్మోనల్ డిజార్డర్స్ అంటే హైపర్ పిట్యుటరిజమ్, హైపర్ థైరాయిడిజమ్, మధుమేహం వంటి వ్యాధుల్లోనూ చెమటలు ఎక్కువ. లింఫోమా, కార్సినాయిడ్ సిండ్రోమ్ వంటి క్యాన్సర్లు,స్థూలకాయం, గ ర్భిణీలలో, మెనోపాజ్ దగ్గర పడిన వారిలో...మద్యం ఎక్కువగా తాగినప్పుడు , పార్కిన్‌సన్స్ వ్యాధి, వెన్నెముక దెబ్బతినడం వంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు. ఫ్లూయాక్సిటిన్ వంటి మందులు వాడినప్పుడు .

లోకలైజ్‌డ్ హైపర్‌హిడరోసిస్‌లో రకాలు
ఉద్వేగాలకు లేదా భయాలకు లోనైననప్పుడు అరచేతులు, అరికాళ్లలో చెమట పట్టడంతో పాటు యాగ్జిలరీ హైపర్ హిడరోసిస్ (బాహుమూలాల్లో చెమట పట్టడం) గస్టెటరీ హైపర్ హిడరోసిస్ (వేడి లేదా ఘాటైన ఆహారం తీసుకునేటప్పుడు పెదవుల చుట్టూ, ముక్కు, నుదుటి మీద, తలలో చెమట పట్టడం), పోస్టరల్ లేదా ప్రెజర్ హైపర్ హిడరోసిస్ (కూర్చున్న మేరకు చెమట పట్టడం, సీట్‌తో ఆనుకున్న ప్రాంతం మేరకు చెమట పట్టడం) వంటి రకాలు కూడా ఉంటాయి. 


హైపర్ హిడరోసిస్ ఆఫ్ పామ్స్ అండ్ సోల్స్ లక్షణాలు:
కేవలం అరచేతులు, అరికాళ్లలో మాత్రమే అధికంగా చెమట పడుతుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. చెమట పట్టడం పగటి పూట అధికంగా, రాత్రుళ్లు తగ్గుతూ, నిద్ర పోయేటప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది.

దానివల్ల సమస్యలు:

నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించడం, ఆఫీసులో సరిగా పనిచేయలేకపోవడం స్నేహితుల నుంచి, కుటుంబసభ్యులు, బంధువుల నుంచి దూరంగా ఉండాలనిపించడం సిగ్గుగా అనిపించడం కుంచించుకుపోవడం ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఆత్మన్యూనతకు గురికావడం పిల్లలో చెమట అధికంగా పట్టడం వల్ల వారు పరీక్షల సమయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు.

* ఆన్సర్ షీట్ మీద రాయటం మొదలుపెట్టిన కొద్దిసేపటికే, పేపరంతా చెమటలో తడిసిపోతూంటుంది. ఈ చెమట ఎక్కువ కావడం వల్ల ఒక్కోసారి జవాబుపత్రం చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే పిల్లలు చేతికింద రుమాలు పెట్టుకుని నానా ఇబ్బందులూ పడుతుంటారు.

  * టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీ డాకారులు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. చేతిలోంచి రాకెట్, బ్యాట్ జారిపోతుంటాయి. అందువల్ల వారు తరచుగా చేతులను తుడుచుకోవలసి వస్తుంది ఎవరికైనా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ఇబ్బందిపడుతుంటారు ఎటువంటి చెప్పులు వేసుకున్నా జారిపోతుంటాయి. షూ అయితే కొంత నయంగా ఉంటుంది. సాక్స్ వేసుకోవడం వల్ల కొంతవరకు ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. అయితే సాక్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్ర పరుచుకోవాలి. లేదంటే దుర్వాసన వస్తాయి.

చెమటలు పట్టేవారు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు...

* చెమట ఎక్కువగా పట్టేవారు రోజూ రెండు మూడు సార్లు స్నానం చేస్తే మంచిది.
* మాయిశ్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువ పడుతుంది. అలాంటి వారు నార్మల్ సబ్బులు వాడాలి.
* సింథటిక్ వస్త్రాలు కాకుండా, నూలు వస్త్రాలు ధరించడం మంచిది.
* ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన వస్త్రాలు ధరించడం మంచిది.
Share on Google Plus