మీ కిచెన్‌ను మించిన క్లినిక్ లేదు.

పసుపు (హరిద్రా):
జలుబు, రొంప చేసినప్పుడు వేడి వేడి పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. పసుపుకొమ్మును కాల్చి, ఆ పొగను పీలిస్తే ముక్కుదిబ్బడ నయమవుతుంది. పసుపుముద్దను పుదీనా రసంలో కలిపి, రాత్రి పడుకునేప్పుడు మొటిమలపై రాస్తే కొన్నాళ్లకు అవి తగ్గిపోతాయి. బహిష్టు తర్వాత పసుపు, తేనె, నెయ్యి కలిపి సేవిస్తే గర్భాశయ శుద్ధి కలుగుతుంది. పసుపుకు యాంటీసెప్టిక్ గుణం కలిగి ఉంది కనుక, తాజాగా ఉన్న గాయాలపై రాస్తే రక్తస్రావం ఆగిపోయి, గాయం త్వరగా మానుతుంది. దీనికి యాంటిబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్నాయని ఆధునిక పరిశోధనల్లోనూ విదితమైంది. 

వెల్లుల్లి (లశున):
దీనిలో లవణరసం తప్ప మిగిలిన ఐదు రసాలు ఉంటాయి. (అంటే... మధుర, అమ్ల, కటు, తిక్త, కషాయ రసాలు). రెండు మూడు వెల్లుల్లి రేకలను దంచి కప్పుడు పాలల్లో మరిగించి, కొంచెం చక్కెర కలుపుకుంటే దాన్ని ‘లశునక్షీరం’ అంటారు. వారానికి రెండు, మూడుసార్లు పరగడుపున ఒక కప్పు తాగితే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. తరచూ కనిపించే ఇన్ఫెక్షన్స్ (ముఖ్యంగా గొంతునొప్పి)ను ఇది దరిచేరనివ్వదు. వెల్లుల్లి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. జీర్ణక్రియను బాగుచేసి, విరేచనాలను నివారిస్తుంది. లశునక్షీరం - దగ్గు, జలుబులకు మంచి నివారణ. కీళ్లనొప్పులు, గుండెజబ్బులు కూడా తగ్గుతాయి. నువ్వుల నూనెలో వెల్లుల్లి రేకల్ని మరిగించి, చల్లార్చి, రెండు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. 

ఉల్లిపాయ (పలాండు):

రెండు చెంచాల ఉల్లిరసానికి తేనె, నెయ్యి, బెల్లం సమానంగా కలిపి నిత్యం సేవిస్తే పురుషుల్లో శుక్రం అభివృద్ధి చెందుతుంది. ఉల్లిగడ్డను కాల్చి చిటికెడు ఉప్పుతో తింటే జీర్ణశక్తి వృద్ధిచెందుతుంది. ఉల్లిరసంలో అల్లపురసం, తేనె కలిపి సేవిస్తే జలుబు, రొంప తగ్గుతాయి. ఉల్లిరసం, నిమ్మరసం ఒక్కొక్క చెంచా కలిపి ప్రతిరోజూ పరగడుపున సేవిస్తే బరువు తగ్గుతారు. వేసవిలో వడదెబ్బ నుంచి కాపాడుతుంది. దీని రసంలో కొంచెం ఉప్పు కలిపి, పంటి చిగుళ్లకు పూస్తే దంతమూల రక్తస్రావం తగ్గుతుంది. 

అల్లం (అర్ద్రక):
చిన్న అల్లం ముక్కను శుభ్రంగా కడిగి, నిప్పులపై కొంచెం వేడిచేసి కొంచెం ఉప్పును అద్ది, పరగడుపున నమిలి తింటే జీర్ణకోశ సంబంధిత వ్యాధులన్నింటినీ పోగొడుతుంది. గొంతుకి ఇన్ఫెక్షన్ రాదు. అల్లానికి రక్తప్రసరణను పెంచే గుణం ఉంది. దీనివల్ల గుండెకు, మెదడుకు, మూత్రపిండాలకు, జననాంగాలకు చక్కటి రక్తప్రసరణ జరిగి హార్ట్‌ఎటాక్‌ను, పక్షవాతాన్ని నివారించడానికి ఉపకరిస్తుంది. కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. పురుషాంగ స్తంభనకు దోహదపడుతుంది. అల్లాన్ని పసుపు, తులసిరసంతో సేవిస్తే చర్మరోగాలు ముఖ్యంగా దద్దుర్లు (అర్టికేరియా) తగ్గిపోతాయి. దీన్ని దంచి, మజ్జిగలో కలిపి తాగితే వాతవ్యాధులు తగ్గుతాయి. నిమ్మరసంలో కొంచెం సైంధవలవణం కలిపి, అల్లపు ముక్కలను దాంట్లో వారం రోజులు నాన్చి, ఎండబెడితే ‘భావన అల్లం’ తయారవుతుంది. దీన్ని చప్పరించి నమిలితే అరుచి తగ్గి, ఆకలి పుట్టి, జీర్ణక్రియ బాగవుతుంది. అల్లపురసం తేనెతో సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. 

కరివేపాకు (కరినింబ):
రోజూ రెండు చెంచాల కరివేపాకు రసం తాగితే మధుమేహ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. నరాల బలహీనత తగ్గుతుంది. కడుపులో గ్యాస్ తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణకోశ క్యాన్సర్లను నివారిస్తుంది. 

జీరకర్ర (జీరక):

నిమ్మరసంలో కొంచెం సైంధవలవణాన్ని కలిపి, జీలకర్రను వారం రోజులు నానబెట్టి ఎండిస్తే ‘భావనజీర’ తయారవుతుంది. ఇది కొంచెం నమిలి చప్పరిస్తే ఆకలిపుడుతుంది. గర్భిణికి కలిగే వాంతులను తగ్గించి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జీలకర్ర చూర్ణాన్ని పెరుగులో కలిపి సేవిస్తే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. జీలకర్రను వేయించి, పొడిచేసి 1-2 గ్రాములు నెయ్యితో కలిపి రోజూ సేవిస్తే బాలింతలకు స్తన్యవర్ధకంగా పనిచేస్తుంది. జీలకర్ర, ఉప్పు కలిపి నూరి, అందులో తేనె కలిపి, తేలుకుట్టిన చోట పూతగా పూస్తే ఉపశమనం లభిస్తుంది. జీలకర్ర, ధనియాలు, అల్లం కలిపి కషాయం కాచి 30 మి.లీ. రోజూ తాగితే అధిక బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఈ కషాయం వల్ల వైరల్ జ్వరాలు కూడా తగ్గుతాయి. పైల్స్ (అర్మోరోగం)కి కూడా మంచిది. జీలకర్రలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 

ధనియాలు:
ధనియాల చూర్ణాన్ని పటికబెల్లంతో కలిపి తింటే అరుచి, అజీర్ణం, గొంతునొప్పి, జలుబు, రొంప తగ్గుతాయి. గర్భిణులకు వాంతులు తగ్గుతాయి. కషాయం తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది. జ్వరహరంగా పనిచేస్తుంది. ధనియాలు, కరివేపాకు, చింతచిగురులను ఎండబెట్టి పొడి చేసి, స్వల్ప ప్రమాణంలో సైంధవలవణం కలిపి ఆవునెయ్యితో అన్నం మొదటిముద్దతో తింటే సమస్త జీర్ణకోశవ్యాధులు తగ్గుతాయి. 

ఏలకులు (ఏలా):

ఏలకుల చూర్ణాన్ని స్వల్పప్రమాణంలోనే సేవించాలి. పటికబెల్లంతో కలిపి చప్పరిస్తే నోటి దుర్వాసన పోతుంది. పాలలో మరిగించి, చల్లార్చి తేనెతో వాడితే పుంసత్వ శక్తికి చాలా మంచిది. నిమ్మరసంతో సేవిస్తే వాంతులు తగ్గుతాయి. దోసగింజల చూర్ణంతో కలిపి సేవించి అనుపానంగా పల్లేరు కషాయం తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. మూలవ్యాధికి కూడా మంచిది. పాలమీగడలో కలిపి ఆ ముద్దను నోటిలో చప్పరిస్తే నాలుక, దవడ పూత తగ్గుతుంది. ఈ చూర్ణాన్ని బట్టలో పెట్టి వాసన చూస్తే తుమ్ములు, తలనొప్పి తగ్గుతాయి. మధుమేహానికి కూడా మంచిదే. 

గమనిక:కల్తీలేని ద్రవ్యాలను మాత్రమే సమకూర్చుకోవాలి. మేలిమి ద్రవ్యాలతో మాత్రమే ఔషధ ఫలితాలు లభిస్తాయి. వీటిని వంట ద్రవ్యాలుగా వంటకాల్లో వాడటం వల్ల అవసరమైనప్పుడు ఔషధంగా అవి పనిచేయవని కొందరు అపోహ పడుతుంటారు. అది వాస్తవం కాదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top