మన ఆహారంలో సత్తువెంత?

ఏఆహారం తీసుకుంటే మంచిదో...ఎందులో పోషకాలు లభిస్తాయో...ఏది ఎలా వండకూడదో మనకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యం కారణంగానో, బద్ధకం వల్లనో అదే పని మనం చేస్తుంటాం. ఉదాహరణకు పాలిష్ చేసిన బియ్యం కన్నా దంపుడు బియ్యం మంచిదని మనకు తెలుసు. అయినా రుచిగా ఉంటుందని పాలిస్ చేసిన బియ్యాన్నే అన్నంగా తింటాము. ఆకు కూరలను ఎక్కువగా ఉడికిస్తే అందులోని పోషకాలు నశిస్తాయని తెలిసినా పచ్చిపచ్చిగా తినలేమన్న సాకుతో బాగా ఉడికించి తింటాము.

పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బి1, బి2 విటమిన్లు తక్కువగా ఉంటాయి. అలాగే బాగా ఆకుకూరలను బాగా ఉడికిస్తే అందులోని ముఖ్యమైన పోషకాలైన బెటా కారోటిన్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ తుడిచిపెట్టుకుపోతాయని న్యూట్రిషన్లు చెబుతున్నారు. ఒకసారి ఉడికించిన ఆహారాన్ని మరోసారి వేడిచేస్తే అందులోని విటమిన్ బి, విటమిన్ సిలు నశిస్తాయని వారు అంటున్నారు. పోషకాలు తప్పనిసరి
ప్రస్తుతం మనం నివసిస్తున్న కాలుష్య వాతావరణం, ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వల్ల శరీరంలో పోషక విలువల లోపం ఏర్పడుతుందని, ఇది కాలక్రమంలో శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని న్యూట్రిషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమతుల పోషకాహారాన్ని తీసుకోవడమే దీనికి పరిష్కారమని వారు సూచిస్తున్నారు. అన్ని వేళలా అటువంటి ఆహారం తీసుకోవడం సాధ్యపడనపుడు విటమిన్లను ఆహారానికి అదనంగా తీసుకోవలసి ఉంటుంది. ప్రస్తుత సమాజంలో 60 నుంచి 80 శాతం మంది యువజనులు పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, దీని వల్ల భవిష్యత్తులో వారి మానసిక ఎదుగుదలలో అవరోధాలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సప్లిమెంట్లు ప్రత్యామ్నాయం కాదు
సప్లిమెంట్స్‌ను ఆహారానికి అనుబంధంగా తీసుకోవాలే తప్ప ఆహారానికి ప్రత్యామ్నాయంగా కాదని, అలా చేయడం వల్ల సమస్య మరింత జఠిలమవుతుందని వారు చెబుతున్నారు. బయట జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకునే టీనేజర్లు కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరని, దీంతో పౌష్టికాహార లోపానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ రూపొందించిన రోజూ తీసుకోవలసిన పోషకాల జాబితా ప్రకారం 4 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలు విటమిన్ సి(40 ఎంజి), ప్రొటీన్(20.1-55.5 గ్రాములు వయసును బట్టి), కాల్షియం(600-800 ఎంజి), ఐరన్ (4-6 పిల్లలకు 13 ఎంజి, 16-17 మగపిల్లలకు 28 ఎంజి, యువతులకు 26 ఎంజి) ప్రతి రోజు తీసుకోవాలి. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న 50 శాతం మందికి పైగా పిల్లలలో లక్షణాలు వెలుపలికి కనపించని విటమిన్ ఎ, విటమిన్లు మి2, మి6, ఫోలేట్, విటమిన్ సి లోపాలు ఉన్నట్లు నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో ఆఫ్ ఇండియా వెల్లడించింది. దేశంలోని 79 శాతం మంది పిల్లలు, 56 శాతం మంది యుక్తవయసు బాలికలు, 30 శాతం మంది అబ్బాయిలలో ఐరన్ లోపం కారణంగా రక్తహీనత ఏర్పడినట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తన తాజా నివేదికలో బయటపెట్టింది.

పిల్లల ఆహారంలో లోపాలు
అన్ని వయసులకు చెందిన వారి లో విటమిన్ డి, ఐరన్, జింక్, కాల్షియం లోపాలు సాధారణంగా ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. రెండేళ్ల లోపు పిల్లలకు పాలు తప్ప మరే ఆహారం ఇవ్వకపోవడం దీనికి కారణమని సర్వే చెబుతోంది. అలాగే స్కూలుకు వెళ్లే పిల్లలకు కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఇస్తున్నారే తప్ప ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారాన్ని ఇవ్వడం లేదని కూడా నివేదికలో పేర్కొన్నారు.

శరీరంలో ఐరన్ లోపాలు ఏర్పడితే బద్ధకం, చిరాకు, అసహనం, గోళ్లు చిట్టిపోవడం, వంకర్లు తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. విటమిన్ డి లోపం ఏర్పడినపుడు కాళ్లు, చేతుల ఎముకలు, కండరాలలో నొప్పి ఏర్పడుతుంది. జింక్ లోపం ఏర్పడితే చర్మంపైన మచ్చలు, నోటిలో పుండ్లు ఏర్పడతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top