చాలా మంది అనుకుంటున్నట్లు మెల్ల కన్ను అదృష్టానికి సూచన కాదు.త్వరగా చేయించాలి చికిత్స......

మెల్లకన్ను అంటే... 

మెల్లను వైద్యపరిభాషలో స్ట్రాబిస్మస్ అంటారు. అందరి కళ్లలోని నల్ల కనుగుడ్లు ఒకేలా ఉంటాయి. ఒకేవైపునకు చూస్తూ ఉంటాయి. అయితే మనం ఏదైనా వస్తువును చూస్తూ ఉన్నప్పుడు వాటిలో ఏదో ఒక కన్నుగుడ్డు వస్తువుపై కేంద్రీకరించకుండా పక్కవైపునకు చూస్తూ ఉండటాన్ని ‘మెల్ల’ అంటారు. ప్రతి కంటిలోని కదలికలను అందులోని ఆరు కండరాలు నియంత్రిస్తుంటాయి. రెండు కనుగుడ్లూ ఒకేవైపునకు దృష్టి కేంద్రీకరించగలిగేలా ఈ కండరాలు దోహదపడుతుంటాయి. ఇందులో ఒక కండరం కుడివైపునకు, మరొకటి ఎడమ వైపునకు, మిగతా నాలుగూ కిందికీ, పైకీ, అన్నివైపులకూ చూసేలా సహాయం చేస్తాయి. 

ఈ ఆరు కండరాలూ రెండు కనుగుడ్లనూ ఒకేవైపునకు చూసేలా మెదడు నియంత్రిస్తుంటుంది. దాంతో పాటు రెండు కళ్ల దృష్టీ ఒకే వైపునకు ఉండేట్లుగా చేసేలా ఆ కండర కదలికల సమన్వయం ఉండేలా చూస్తుంది. ఒకవేళ ఆ ఆరు కండరాల మధ్య సమన్వయం లోపించినప్పుడు రెండు కనుగుడ్లూ ఒకే వైపునకు చూడకపోవడం వల్ల మెల్ల వస్తుంది. దీనికి మెదడులో నియంత్రణ యంత్రాంగంలో లోపమైనా కారణం కావచ్చు. లేదా కండరాల్లో ఏదైనా తన విధులను అనుకున్న రీతిలో నిర్వర్తించలేకపోవడమైనా కావచ్చు. కారణం ఏదైనప్పటికీ రెండు కనుగుడ్లూ ఒకేవైపునకు చూడలేవు. 

కనుగుడ్లు రెండూ వేర్వేరు వైపులకు చూస్తుండటంతో ఆ రెండు కళ్లలోని తెరలపై వేర్వేరుగా కనిపించే ప్రతిబింబాలను సమన్వయపరచడం మెదడుకు సాధ్యం కాదు. దాంతో మెదడు కాస్త గందరగోళానికి గురవుతుంది. క్రమంగా ఒక కంటిలోని ప్రతిబింబాన్ని విస్మరించడం ప్రారంభిస్తుంటుంది. సాధారణంగా రెండు కళ్లలోనూ బలహీనంగా ఉన్న కన్ను నుంచి వచ్చే ప్రతిబింబ చిత్రాన్ని క్రమంగా విస్మరిస్తూ పోతుంది. దాంతో ఒక కంటిలో ఏర్పడ్డ ప్రతిబింబ చిత్రాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉండటంతో ఆ రెండో కన్నును ‘లేజీ ఐ’గా అభివర్ణిస్తారు. 


మెల్లకన్నుకు కారణాలు... 
మన పిల్లల్లో మెల్ల కన్ను ఉందంటే.... దాదాపు 50 శాతం మందిలో వాళ్లకు అది పుట్టుకతోనే ఉంటుంది లేదా పుట్టిన కొద్దిరోజుల్లోనే వస్తుంది. అయితే ఇలా పుట్టుకతో వచ్చే మెల్లకంటికి కారణాలు తెలియవు. అయితే కొన్నిసార్లు మెల్ల కన్ను ఉందంటే దానితో పాటు కంటికి సంబంధించిన ఏదో సమస్య ఉందనడానికి అది ఒక సూచన. పెద్ద పిల్లల్లో మెల్ల కన్ను వచ్చిందంటే దానికి చూపు సమస్యలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) కారణం కావచ్చు. అవి క్రమంగా దృష్టిని మందగింపజేస్తూ క్రమంగా చూపు మసకబారేలా చేస్తాయి. కొన్నిసార్లు కంట్లో పువ్వు (క్యాటరాక్ట్), కంటిలో గడ్డలు (ఇంట్రా ఆక్యులార్ ట్యూమర్స్), నరాల సమస్యలు (నర్వ్ పాల్సీస్), డ్యూయెన్స్ సిండ్రోమ్, బ్రౌన్స్ సిండ్రోమ్ వంటి కండిషన్స్ వల్ల కూడా మెల్లకన్ను రావచ్చు. 

కుటుంబంలో ఎవరికైనా మెల్ల కన్ను ఉందంటే, వారి పిల్లలకు అది వచ్చే రిస్క్ ఎక్కువ. పిల్లల్లో పుట్టుకతో కాకుండా, ఆ తర్వాత వచ్చే మెల్లకంటికీ అనేక కారణాలుంటాయి. తలకు దెబ్బతగలడం వల్ల నరాలు దెబ్బతినడం (నర్వ్ పాల్సీ), మధుమేహం నియంత్రణలో లేకపోవడం, దీర్ఘకాలంగా ఉన్న క్యాటరాక్ట్, మెదడులో గడ్డలు వంటివి మెల్లకంటికి దారితీస్తాయి. ఒక్కొక్కప్పుడు చిన్నతనంలో మెల్ల కంటికి చేసిన చికిత్స సరిగా జరగకపోతే అప్పుడు కూడా పెద్దయ్యాక మళ్లీ మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంది. 

చికిత్స తప్పనిసరిగా చేయించాలా...? 
పై ప్రశ్నకు సమాధానం అవునని చెప్పాలి. ఎందుకంటే... కొన్ని వృత్తుల్లో ఉండేవారికి చాలా సునిశితమైన దృష్టి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మైక్రో సర్జరీ నిర్వహించే నిపుణులు, ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్‌లు, దేశ రక్షణ బాధ్యతలు నిర్వహించేవారికి సునిశితమైన దృష్టి ఉండాలి. చిన్నప్పుడే ఒకవేళ మెల్లకన్ను ఉండి, దానికి సరైన చికిత్స తీసుకోకపోతే... ఇలాంటి ఉద్యోగాలకు అవసరమైన సునిశితమైన దృష్టి పొందడం సాధ్యంకాకపోవచ్చు. అందుకే మెల్ల ఉంటే వీలైనంత చిన్నప్పుడే దానికి తగిన చికిత్స పొందాలని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చికిత్స పొందకపోవడం వల్ల క్రమంగా కోల్పోయే దృష్టిని మళ్లీ పొందడం సాధ్యం కాదని కూడా గుర్తుపెట్టుకోవాలి. 

మెల్లకన్ను లక్షణాలు
మెల్లకంటికి ఉన్న సాధారణ లక్షణం కనుగుడ్లు రెండూ ఒకే దిశలో లేకుండా (ఒకటి లోపలికి, లేదా బయటకు చూస్తూ) ఉండటం. ఈ కారణంగా వాళ్లు ఏదైనా చూడాలనుకుంటే తలను పూర్తిగా ఒకవైపునకు తిప్పాల్సి రావడం. ఇక మెల్ల ఉన్న కంటి చూపు క్రమంగా బలహీనపడుతూ పోతుంది. దాంతో అది అంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు దారితీస్తుంది. ఇక పెద్దయ్యాక వచ్చే అక్వైర్డ్ స్క్వింట్‌లో మెల్ల కన్ను వచ్చే ముందర ఒక్కోసారి ఒకేవస్తువు రెండుగా (డబుల్ విజన్) కనిపించేందుకు అవకాశం ఉంది. 

చికిత్స

చిన్నపిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు చికిత్స లక్ష్యం... వాళ్లు తమ చూపును క్రమంగా బలహీనపడిపోవడాన్ని నివారించడం. ఒకవేళ అప్పటికే చూపు బలహీనపడి ఆంబ్లోపియాకు దారితీస్తే దానికి అవసరమైన చికిత్స చేసి చూపును మరింతగా కోల్పోకుండా చూడటం. ఒకవేళ మెల్ల ఉన్న కంటిలో చూపు తగ్గిపోతుంటే... ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత సమర్థంగా చూపును కోల్పోకుండా ఆపవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏడేళ్ల వయసుకు ముందే చికిత్స మొదలుపెట్టాలన్నమాట. ఒకవేళ ఆ తర్వాత మొదలుపెట్టిన ఫలితాలు అంత సమర్థంగా ఉండకపోవచ్చు.

ఒకసారి ఈ కండిషన్‌కు చికిత్స మొదలు పెట్టి చూపును కోల్పోకుండా ఆపాక... రెండు కళ్లలోని కనుగుడ్ల అలైన్‌మెంట్ ఒకేలా ఉండేలా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శస్త్రచికిత్స అన్నది కేవలం రెండు కనుగుడ్లు ఒకేలా ఉండేందుకు అందం కోసం (కాస్మటిక్ ప్రయోజనం కోసం) చేసేది మాత్రమే. ఆ శస్త్రచికిత్స అన్నది చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడదని గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూపును మెరుగుపరచే చికిత్సపై అంతగా దృష్టి కేంద్రీకరించకుండా, కేవలం శస్త్రచికిత్స చేయమంటూ వైద్యులను ఒత్తిడి చేయడం సరికాదు.

ఇక పెద్దయ్యాక వచ్చిన మెల్ల కంటి విషయంలో ఒకే వస్తువు రెండుగా కనిపిస్తున్న సందర్భాల్లో ... అలాంటి స్క్వింట్‌లను సరిచేయడానికి కొన్ని కళ్లజోళ్లు (ప్రిజమ్ గ్లాస్‌లను) ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని సందర్భాల్లో బొటాక్స్ ఇంజెక్షన్స్‌తో కూడా మెల్లకంటికి చికిత్స చేయవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top