భగవానుని అనుదినమూ పూజించాలని ఆగమశాస్త్రాలలోనే గాక భగవద్గీతలో కూడా చెప్పబడింది. గీత నాలుగో ఆధ్యాయంలో 'యేయథామాం ప్రపద్యన్తే తాంస్తదైవభజామహ్యం' అని ఉంది. అంటే ఎవరు నన్ను ఆరాధించగోరి తమకిష్టమైన ఏ రూపంతో నన్ను భావించి ఆశ్రయిస్తారో నేనారూపంతోనే నా దర్శనమిస్తున్నాను అని భగవానుడు చెప్పాడు. అర్చావతారము ఆయన సౌలభ్యానికి చివరి హద్దు. 12వ ఆధ్యాయంలో ఇలా ఉపదేశిస్తాడు. 'మోక్షానికై నన్నే ధ్యానించు.
తదేక ధ్యానానికి నీకు శక్తి లేకపోతే మత్కర్మ పరమోభవ అంటాడు. నా కర్మలంటే, ఆలయాలు నిర్మించడం, తోటలను పెంచడం దీపాలు వెలిగించడం, పుష్పాలు సమకూర్చడం, నామ సంకీర్తనం చేయడం, అర్చించడం... ఇవన్నీ మిక్కిలి ప్రీతితో చేయాలి.
'పత్రం, పుష్పం, ఫలం, తోయం, యోమే భక్త్యా ప్రయచ్ఛతి'-'యత్కరోషి' అనే శ్లోకాల్లో మనం ఏం చేసినా, ఏం తిన్నా భగవానుడికి అర్పించే స్వీకరించాలంటాడు. ఈ విధంగా భగవంతుని నిత్యమూ అర్చించి నివేదించిన పదార్థాలనే ప్రసాదంగా మనం స్వీకరించాలని గీత బోధిస్తోంది.