మసాలా దినుసులు ఆరోగ్యానికి అంత మంచివి కాకపోయినా... సౌందర్య సాధనాలుగా మాత్రం బాగా పనిచేస్తాయి. మార్కెట్ లో దొరికే కృత్రిమ సౌందర్య సాధనాలను ఉపయోగించటం కంటే మన వంటగదిలో పోపులపెట్టేలో ఉన్న మసాలా దినుసులతో ఆకట్టుకొనే అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మసాలా దినుసులను ఉపయోగించి అందమైన చర్మాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకుందాం.
దాల్చినచెక్క
దీనిని బిరియాని,ఫ్రైడ్ రైస్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. గరం మసాలా పొడి తయారీలో కూడా దాల్చినచెక్కదే అగ్ర స్థానం. ఇది పదార్దానికి ఎంత రుచిని,వాసనను కలిగిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. దాల్చినచెక్క ముఖ సౌందర్యాన్ని పెంచటానికి ఎంతో దోహదం చేస్తుంది. దాల్చినచెక్క పొడిలో కొంచెం నీరు కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.
ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తే ముఖం మీద ఉండే వేడి పొక్కులు,మొటిమలు తగ్గుతాయి. దాల్చినచెక్క లో ఉండే యాంటి బ్యాక్టిరియాల్ గుణాలు చర్మంలోని బ్యాక్టిరియను సమర్దవంతముగా ఎదుర్కొని చర్మం సహజ సౌందర్యం పొందటానికి సహాయపడుతుంది.
అయితే దీనిని ఉపయోగించటానికి ముందు బ్యూటిషియన్ సలహా తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడికి కొద్దిగా తేనే, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ చేసి,దానిని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు ఊడటం తగ్గుతుంది.
మిరియాలు
ఘాటైన రుచితో ఉండే మిరియాలను వంటలలో తరచూ వాడుతూ ఉంటాము. జలుబు,జ్వరం వంటి రుగ్మతలకు మిరియాల చారు బాగా పనిచేస్తుందని అమ్మమ్మల కాలం నుండి నమ్మకం. అంతేకాక ఆహారం త్వరగా జీర్ణం కావటానికి కూడా సహాయపడుతుంది.
మిరియాలు ఆరోగ్యానికే కాకుండా సౌందర్య పోషణలో కూడా ఉపయోగపడతాయి. మిరియాలను మెత్తగా పొడి చేసుకొని దానిలో పెరుగు కలిపి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు. అయితే ఈ చిట్కా పొడి చర్మం వారికీ అంతగా ఉపయోగపడదు. వీరు నిపుణుల సలహా మేరకు మాత్రమే ఈ ప్యాక్ ను ఉపయోగించాలి.