ఇప్పుడు చెప్పే వెన్న ఉండలు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి నచ్చుతాయి. వీటిని తయారుచేసుకోవటం చాలా సులువు. వెన్న ఉండలు దాదాపుగా వారం రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలకు స్నాక్ గా పెట్టవచ్చు.
కావలసిన పదార్దాలు
బియ్యం పిండి - రెండు కప్పులు
వెన్న - పావుకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నువ్వులు - మూడు స్పూన్స్
వాము - రెండు స్పూన్స్
నూనె - వేయించటానికి సరిపడా
తయారివిధానం
ఒక బౌల్ తీసుకోని దానిలో బియ్యం పిండి,వెన్న,నువ్వులు,వాము అన్నింటిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీటిని బాగా వేడి చేసి అందులో ఉప్పు వేసి బియ్యం పిండి మిశ్రంమలో కలపాలి. వేళ్ళతో దీన్ని చపాతీ పిండి మాదిరిగా ముద్దగా కలపాలి.
ఈ ముద్ద మీద ఒక తడి గుడ్డ వేసి అరగంట పాటు నాననివ్వాలి. అనంతరం ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా(అంటే గోలి సైజ్) చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక పైన తయారుచేసుకున్న ఉండలను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.