ఏదైనా సింపుల్ రైస్ కాంబినేషన్ నైన ఈ ఒక్క బిర్యానీ గ్రేవీని పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పే బిర్యానీ గ్రేవీ ఒక రెస్టారెంట్ స్టైల్ లో పర్ఫెక్ట్ గా ఉంటుంది.
కావలసినవి:
పావు కప్పు వేరుశనగ గుళ్ళు, ఒక స్పూన్ ధనియాలు , రెండు స్పూన్ల నువ్వు పప్పు, రెండు స్పూన్లు గసగసాలు, నాలుగు ఎండు మిరపకాయలు, ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ,ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ గరం మసాలా , ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు ,7, 8 బజ్జి మిరపకాయలు, అరకప్పు చింతపండు రసం, నూనె తగినంత.
చేయు విధానం:
ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి నూనె లేకుండా పావు కప్పు వేరుశనగ గుళ్ళు ,ఒక్క స్పూను ధనియాలు లో ఫ్లేమ్ మీద వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత రెండు స్పూన్ల గసగసాలు, రెండు స్పూన్ల నువ్వులు కలపాలి. కాస్త చిటపట సౌండ్ వచ్చాక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి వేగించిన తర్వాత మిక్సీ చేసుకొని మెత్తగా పొడిగా చేసి ఉంచుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయిలో పావు కప్పు నూనె వేసుకోవాలి. ఒక టీస్పూన్ ఆవాలు ,4 ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర ,పావు టీ స్పూన్ మెంతులు, మంచి సువాసన వచ్చేవరకు వేగించుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, సాల్ట్ తగినంత ఇవన్నీ కలిపి నూనెలో వేపాక, నూనె తేలుతూ ఉండగా అప్పుడు బజ్జి మిర్చి తీసుకొని చివర్లు కట్ చేసి ఆ కడాయిలో వేయాలి. ఇవి మీడియం ఫ్లేమ్ లో సగం మగ్గాక ఒక అర కప్పు చింతపండు రసం తీసుకొని అందులో వేయాలి .
మూత పెట్టి లో ఫ్లేమ్ మీద నూనె తేలేంతవరకు మగ్గ పెట్టండి. నూనె పైకి తేలిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పల్లీ కొబ్బరి పేస్ట్ ని అందులో వేసుకోవాలి. బాగా కలిపాక అందులో 300 ml వాటర్ పోసుకొని ఇంకాసేపు మరగనివ్వాలి, ఆ మరుగుతూ ఉండగా పైన వచ్చిన తేటని తీసివేయండి.
అప్పుడు కూర క్లియర్ గా చూడటానికి మంచి టెక్స్చర్ లో కనిపిస్తుంది. అందులో కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేయండి. టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఈ గ్రేవీ వేడి వేడి రైస్, బిర్యాని, రైస్ కాంబినేషన్స్ లో తీసుకోవచ్చు.


